పన్నెండు గంటలు...సందడే సందడి..

1 Dec, 2014 10:23 IST|Sakshi

 ఉత్తరాంధ్రను వణికించిన హుద్‌హుద్ తుపాను బాధితుల సహాయార్థం తెలుగు సినీ పరిశ్రమ చేపట్టిన  ‘మేము సైతం’ కార్యక్రమం ఆదివారం నాడు పన్నెండు గంటల పాటు జరిగింది.

 * ఉదయం 10 గంటలు దాటిన తరువాత  అన్నపూర్ణా స్టూడియోలో కేవలం ప్రత్యేక ఆహ్వానితుల మధ్య ప్రారంభమైన ‘మేము సైతం’ కార్యక్రమం రాత్రి 10 గంటల వరకు సాగింది. కోటి స్వరాలు కూర్చగా, అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించిన ప్రత్యేక గీతం ‘మేము సైతం ఓ విశాఖ వాసులారా... ’ ఆలాపనతో కార్యక్రమం మొదలైంది. సీనియర్ సినీ నేపథ్య గాయని పి. సుశీల, తదితరులు కలసి ఈ గీతాన్ని ఆలపించారు. దర్శకుడు దాసరి నారాయణరావు, నటుడు మోహన్‌బాబు, బాలకృష్ణ మాట్లాడారు. ‘‘సినిమా వాళ్ళందరూ కలసి 10 కోట్ల దాకా ఇచ్చేయవచ్చు కదా అని అనవచ్చు. కానీ, బాధితులకు అండగా నిలిచి, ప్రతి ఒక్కరూ తమకు చేతనైన ఆర్థిక సాయం అందించాలన్న స్ఫూర్తి ప్రజల్లో కలిగించడా నికే ఈ కార్యక్రమం’’ అని దాసరి అన్నారు.
 
* ‘వందేమాతర’ గీతానికీ, ‘మనం’ చిత్రంలోని ‘చిన్ని చిన్ని ఆశలు నాలో..’ పాటకు శ్రీయ డాన్స్ ఆకట్టుకుంది.
 
* నందమూరి బాలకృష్ణ ఎవరూ ఊహించని విధంగా ఈ కార్యక్రమంలో గాయకుడిగా అవతారమెత్తారు. గాయని కౌసల్యతో కలిసి ఆయన ‘చలాకీ చూపులతో...’ పాట పాడారు. ఆ తర్వాత కొంతసేపటికి మళ్లీ వేదికపైకి వచ్చి మాళవికతో కలిసి ‘నీ కంటి చూపుల్లోన...’ పాట పాడారు. ఈ పాటలు పాడుతున్నప్పుడు బాలకృష్ణ మైక్‌ని సునాయసంగా గాల్లోకి ఎగరేసి, స్టయిల్‌కి పట్టుకోవడం, చిన్ని చిన్ని స్టెప్స్ వేయడం వీక్షకులను అలరించింది. ఈ రెండు పాటలే కాక, ఆ తర్వాత ఓ స్కిట్ కూడా చేసి, కార్యక్రమానికి నిండుదనం తీసుకు వచ్చారు.
 
* బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, వేణుమాధవ్ అడపా దడపా తమదైన శైలిలో నవ్వించారు.
 
* గాయకుడు బాబా సెహగల్ ‘గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్..’ పాట పాడి అందరిలో జోష్ నింపారు. ఈ పాట ముగింపులో పలువురు దర్శక, నిర్మాతలు వేదికపైకి వచ్చి డాన్స్ చేయడం విశేషం. స్టెప్పులేసినవాళ్లల్లో రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, డి. సురేష్‌బాబు, ఎన్వీ ప్రసాద్, కేయల్ నారాయణ తదితరులు ఉన్నారు.
 
* మణిశర్మ, కోటి, వందేమాతరం శ్రీనివాస్, మనో, రమణ గోగుల, ఆర్పీ పట్నాయక్, అనూప్ రూబెన్స్, సునీత, శ్రీలేఖ తదితర సంగీతదర్శకులు, గాయనీ గాయకులు పాడిన పాటలు ఓ రిలాక్సేషన్.

* డిఫరెంట్లీ ఏబుల్డ్ చిల్డ్రన్‌తో కలిసి ఇషా చావ్లా చేసిన డాన్స్ హృదయాన్ని హత్తుకుంది. పాట చివర్లో ‘ఈసారి సాయం మాకు కాదు.. హుద్‌హుద్ బాధితులకు చేయండి’ అని వారిలోని ఒక బాలుడు అనడం ఆహూతులను కదిలించింది.
 
* ‘మేము సైతం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పుడు.. దక్షిణాదికి చెందిన ఇతర భాషల సినీ ప్రముఖులు కూడా విచ్చేస్తారని పేర్కొన్నారు. కానీ, వారెవరూ రాకపోవడం గమనార్హం.
 
* మీడియాకు సైతం ప్రవేశం లేకుండా కేవలం టికెట్ కొన్నవారికే పరిమితం కావడంతో పత్రికలవారికి సమాచార సేకరణ ఇబ్బందిగా మారింది. పత్రికలకు ఫొటోలు, సమాచారం అందించే విషయంలో నిర్దుష్టమైన ప్రణాళిక, వ్యవస్థ కొరవడ్డాయి. దాదాపు 12 గంటల పాటు టీవీలో లైవ్ టెలికాస్ట్ అని ప్రకటించినప్పటికీ, ముందుగానే రికార్డు చేసిన కార్యక్రమాలను వేదిక వద్ద ప్రదర్శిస్తూ, వాటినే ‘ప్రత్యక్ష ప్రసారం’గా టీవీలో చూపారు.
 
* మధ్యాహ్నం దాటాక కోట్ల విజయభాస్కరరెడ్డి ఇండోర్ స్టేడియమ్ వేదికగా తారల మధ్య సరదా ఆటల పోటీలు జరిగాయి. మంచు విష్ణు, మనోజ్‌లు రెండు కబడ్డీ జట్లకు కెప్టెన్లుగా వ్యవహరించారు. ఈ పోటీలో బ్రహ్మానందం పాల్గొనడం ఓ ఆకర్షణ. ఈ పోటీలో మంచు మనోజ్ జట్టు విజేతగా నిలిచింది.  
 
* ఇక ఎన్టీఆర్, నాగార్జున కెప్లెన్లుగా రెండు జట్ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో నాగార్జున జట్టు గెలిచింది. ఈ మ్యాచ్‌లో నాగశౌర్య వరుసగా మూడు సిక్సర్లు కొట్టి, స్టేడియమ్‌లో సందడి రేపారు.
 
 *
అలాగే, వెంకటేశ్, రామ్‌చరణ్ కెప్టెన్లుగా జరిగిన మ్యాచ్‌లో వెంకీ టీమ్ గెలిచింది. రామ్‌చరణ్ మూడు క్యాచ్‌లు పట్టారు.
 
 * నాకౌట్ దశలో విజయం సాధించిన రెండు జట్లతో ఫైనల్ మ్యాచ్ జరిగింది. వెంకటేశ్, నాగార్జున జట్లు పోటాపోటీగా ఆడిన నేపథ్యంలో గెలుపు నాగ్ టీమ్‌దే అయ్యింది.
 
ఆరు ఓవర్లకే పరిమితమైన ఈ మ్యాచ్‌లను టెన్నిస్ బంతితో ఆడారు.
 
*  మరోపక్క సాయంత్రం వేళ మళ్ళీ అన్నపూర్ణా స్టూడియోలో తారల సందడి సాగింది. ‘బాహుబలి’ బృందం వంటకం చేయడాన్ని రికార్డు చేసి, ప్రదర్శించారు.
 
*  హుద్ హుద్ తుఫాను సమయంలో కొంతమంది ప్రాణాలను కాపాడిన, సమాచార వ్యవస్థను సరి చేయడానికి పాటుపడిన కొంతమంది వ్యక్తులను ‘రియల్ హీరోస్’ పేరుతో నాగార్జున పరిచయం చేశారు.

*  తుషాను బాధితుల కోసం ప్రత్యేకంగా తయారు చేయించి, ఆ పాటలో అక్కినేని కుటుంబ సభ్యులు మొత్తం నటించడం విశేషం.
 
 * సాయంత్రం వేళ సందడిలో చక్రి, దేవిశ్రీ ప్రసాద్, తమన్‌లు పాటలతో అలరించారు. తమన్ ఆధ్వర్యంలో జరిగిన మ్యూజికల్ షోలో రవితేజ కొన్ని పాటలు పాడి, నర్తించారు. దేవిశ్రీ ప్రసాద్ ‘శంకర్‌దాదా జిందాబాద్...’ గీతానికి చిరంజీవి చాలా హుషారుగా స్టెప్పులు వేయడం ప్రత్యేక ఆకర్షణ అయింది. గాయకుడు మనో సారథ్యంలో సినీ నటులు పాల్గొన్న ‘అంత్యాక్షరి’ ఉత్సాహంగా సాగింది. ముఖ్యంగా చిరంజీవి, వెంకటేశ్, రాజశేఖర్, అలీ, జయప్రద తదితరులు చాలా హుషారుగా పాటలు పాడారు.
 
ఈ కార్యక్రమంలో మరో హైలైట్ హీరో మహేష్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌లను హీరోయిన్ సమంత ఇంటర్వ్యూ చేయడం. అసలు ఇద్దరు స్టార్ హీరోలు పవన్ కల్యాణ్, మహేశ్‌బాబులతో మీకెలా స్నేహం కుదిరింది? అని త్రివిక్రమ్‌ని సమంత అడిగితే - ‘‘ఇద్దరికీ ఒక ప్రత్యేక లక్షణం ఉంది. ఇద్దరూ నిరాడంబరంగా ఉంటారు. మహేశ్ వార్డ్ రోబ్‌లో రెండు ప్యాంట్లు, రెండు చొక్కాలు మినహా ఉండవు. ఎంత పెద్ద కారు, ఎంత ఖరీదు గల కారులో వెళ్లాలా అని ఆలోచించడు. ఉండటానికి చిన్న ఇల్లు, చదువుకోవడానికి కొన్ని పుస్తకాలు ఉండే చాలని మహేశ్ అనుకుంటాడు. పవన్ కల్యాణ్ కూడా చాలా సింపుల్‌గా ఉంటారు. తన దగ్గరా రెండు ప్యాంట్లు, రెండు చొక్కాలే ఉంటాయి. ఖరీదు గల కారుల్లో తిరగాలని ఆయన అనుకోరు. చుట్టూ చెట్లు, చదువుకోవడానికి కొన్ని పుస్తకాలు ఉంటే చాలని కోరుకునే వ్యక్తి. ఇలా ఇద్దరి మనస్తత్వాలు ఒకే విధంగా ఉన్నాయి కాబట్టే, ఇద్దరితోనూ నాకు మంచి స్నేహం కుదిరింది’’ అని చెప్పారు.