నటుడు జనార్ధన్‌ రావు మృతి

7 Mar, 2020 05:33 IST|Sakshi
ముప్పుళ్ల జనార్ధన్‌ రావు

సీనియర్‌ నటుడు ముప్పుళ్ల జనార్ధన్‌ రావు(74) శుక్రవారం ఉదయం గుండెపోటుతో చెన్నై సాలిగ్రామంలో కన్నుమూశారు. గుంటూరు జిల్లా పొనిగళ్ల గ్రామంలో 1946లో జన్మించిన జనార్ధన్‌ రావు  చెన్నైలో స్థిరపడ్డారు. తెలుగు, తమిళ సహా వివిధ భాషల్లో వెయ్యికి పైగా చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా తెలుగులో ‘జానకిరాముడు, మజ్ను, కొండవీటి సింహం, పెదరాయుడు, అభిలాష, అమ్మోరు, గోరింటాకు, గోకులంలో సీత, తలంబ్రాలు’.. వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన చివరిగా నటించిన చిత్రం ‘జనతా గ్యారేజ్‌’. పలు టీవీ సీరియళ్లలోనూ నటించారాయన. చెన్నైలో ఒక రికార్డింగ్‌ స్టూడియోను లీజుకు తీసుకుని నిర్వహించారు. భాగస్వామ్యంలో కొన్ని అనువాద చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఆయన మృతిపట్ల తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు సంతాపం తెలిపారు. జనార్ధన్‌ రావు అంత్యక్రియల్ని కుటుంబ సభ్యులు శుక్రవారమే నిర్వహించారు.

మంచి నటుడిని కోల్పోయాం: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్
తెలుగు సినిమా రంగం మంచి సీనియర్ నటుడిని కోల్పోయిందని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ యాక్టింగ్ ప్రెసిడెంట్ బెనర్జీ, ప్రధాన కార్యదర్శి జీవితా రాజశేఖర్, కార్యవర్గ సభ్యులు తమ సంతాపాన్ని తెలిపారు. సీనియర్ నటుడు జనార్ధన్ రావు మృతి వార్త తెలిసిన వెంటనే వారు స్పందించారు. జనార్ధన్ రావుతో తమకు మంచి అనుబంధం ఉందన్నారు బెనర్జీ. ఆయన మృతికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యవర్గం సంతాపం తెలియజేసింది. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటించింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు