‘సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు’

9 Jun, 2020 15:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సినిమా షూటింగ్‌లకు అనుమతినిచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చలనచిత్ర నిర్మాతల మండలి కృతజ్ఞతలు తెలిపింది. కరోనా మార్గదర్శకాలు, లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూ రాష్ట్రంలో సినిమా, సీరియల్‌ షూటింగ్‌లు జరుపుకోవడానికి కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కు ధన్యవాదాలు తెలుపుతూ నిర్మాతల మండలి మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. (లైట్స్‌.. కెమెరా.. యాక్షన్‌)

‘తెలుగు చలనచిత్ర పరిశ్రమ సమస్యలను పరిష్కరిస్తూ, అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. కేసీఆర్‌ సమర్థ నాయకత్వంలో తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందని కచ్చితంగా నమ్ముతున్నాము.  సినిమా షూటింగ్‌లు, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకోవడానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ సీఎం ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా సినిమా థియేటర్లు కూడా తెరుచుకునే విధంగా అనుమతులు ఇస్తారని ఆశిస్తున్నాం. (సీఎం జగన్‌తో సినీ పెద్దల భేటీ)

టాలీవుడ్‌లో నెలకొన్న సమస్యలపై గతంలో ఇచ్చిన మెమోరండంపై చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్‌, మంత్రి తలసాని హామీ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇది టాలీవుడ్‌ వేగంగా అభివృద్ది చెందడానికి దోహదపడుతుంది’ అంటూ నిర్మాత మండలి పేర్కొంది. అదేవిధంగా సినిమా పరిశ్రమ అభివృద్దికి సహకరిస్తున్న నిర్మాత, జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌, తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ రామ్మోహన్‌లకు కూడా చలనచిత్ర నిర్మాత మండలి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు