సచిన్ రిటైర్మెంట్ పై టాలీవుడ్ హీరోల స్పందన

12 Oct, 2013 05:50 IST|Sakshi
సచిన్ రిటైర్మెంట్ పై టాలీవుడ్ హీరోల స్పందన
క్రికెట్ గాడ్‌గా పేర్గాంచిన సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ వార్త క్రీడా ప్రపంచాన్ని కలవరానికి గురి చేసింది. సచిన్ వీరాభిమానులు ఈ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. సచిన్‌ని విపరీతంగా ఆరాధించేవారిలో మన టాలీవుడ్ హీరోలు కూడా ఉన్నారు. వారు కూడా సచిన్ రిటైర్మెంట్ వార్త విని చలించిపోయారు. పలువురి హీరోల స్పందన ఇలా...
 
 క్రికెట్‌ను సచిన్‌కు ముందు... సచిన్‌కు తర్వాత అని విభజించాల్సిందే - వెంకటేశ్
 నా దృష్టిలో ఇది వెరీ శాడ్ డే. 24 ఏళ్లుగా సచిన్ ఆటను ఆస్వాదిస్తూ వచ్చాను. ఇక తను లేని క్రికెట్ అంటే నాకే బ్లాంక్‌గా ఉంది. సచిన్‌ని చూసి ఎవ్వరైనా సరే ఇన్‌స్పైర్ కావాల్సిందే. అతని డిసిప్లిన్, డెడికేషన్, ఎఛీవ్‌మెంట్, ఎనర్జీ... మామూలు వ్యక్తులకు సాధ్యం కాదు. నాకు రిలాక్సేషన్ అంటే క్రికెట్టే. సచిన్ లేని క్రికెట్‌ని ఇంకో రకంగా ఊహించాల్సిందే. ఇక నుంచి ఈ క్రికెట్ ఎలా ఉంటుందో అనిపిస్తోంది. అసలు క్రికెట్ గురించి మాట్లాడాలంటే... సచిన్‌కి ముందు, సచిన్‌కి తర్వాత అని విభజించాల్సిందే. సచిన్‌తో నాకు మంచి పరిచయమే ఉంది. దక్షిణాఫ్రికాలో జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్‌ల సమయంలోనూ, ఐపీయల్ మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు తనను చాలాసార్లు కలిశాను. మా ఇద్దరి మధ్యనా చాలా మంచి చర్చలు జరిగేవి. ఆ సందర్భాలను ఎప్పుడు గుర్తు చేసుకున్నా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది.
 
 నేనెక్కడ కనిపించినా గుర్తుపట్టి పలకరిస్తుంటారు - శ్రీకాంత్
 ‘‘క్రికెట్‌ని గాఢంగా ప్రేమించే వాళ్లంతా సచిన్ రిటైర్మెంట్ వార్త వినగానే ఏడ్చినంత పనిచేశారు. క్రమశిక్షణకు నిలువుటద్దంలాంటి వ్యక్తి ఆయన. సచిన్‌ని చూడ్డానికే స్టేడియమ్‌కి వెళ్లేవాళ్లు చాలామంది ఉంటారు. ఇప్పుడా సంఖ్య తగ్గుతుంది. ఇకపై నేను కూడా స్టేడియమ్‌కి వెళ్లి మ్యాచ్‌లు చూడను. సచిన్‌తో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. వైజాగ్‌లో ఓసారి ఛారిటీ మ్యాచ్ జరిగినప్పుడు సచిన్‌తో పాటు ఐదుగురు ఇండియన్ క్రికెటర్లు, నేను, చిరంజీవిగారు, వెంకటేశ్‌గారు, తరుణ్ క్రికెట్ ఆడాం. ఆ మ్యాచ్‌లో నా కాలికి దెబ్బ తగిలితే, సచిన్ స్వయంగా నాకు ఐస్ పెట్టి ఎలా కేర్‌గా ఉండాలో సూచనలు చేశారు. ఆ తర్వాత రోజు చిరంజీవిగారి ఇంట్లో పార్టీ జరిగినప్పుడు సచిన్, మేమంతా చాలా ఎంజాయ్ చేశాం. ఆ క్షణాల్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఇప్పటికీ నేనెక్కడ కనిపించినా గుర్తుపట్టి పలకరిస్తుంటారు.
 
 సచిన్ కోసమే ఇన్నేళ్లూ క్రికెట్ చూశాను - విష్ణు
 ‘‘ఇక సచిన్ లేని క్రికెట్‌ని నేను చూడలేను. సచిన్ కోసమే ఇన్నేళ్లూ క్రికెట్ చూశాను. ఇక నుంచి క్రికెట్ ప్రపంచమంతా బిఫోర్ సచిన్, ఆఫ్టర్ సచిన్ అని చెప్పుకుంటారు. ఈ 40 ఏళ్లలో 30 ఏళ్లు సచిన్ క్రికెట్‌నే అంకితమైపోయాడు. నెక్ట్స్ ఆయన ఏం చేస్తాడు? ఎంత మందికి ఆదర్శవంతంగా ఉంటాడు? అనేది నాతో పాటు చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హైదరాబాద్ వచ్చినపుడు 2 సార్లు సచిన్‌ని కలిశాను. ఆ ఇన్సిడెంట్స్ ఇప్పటికే నా మదిలో లైవ్లీగా ఉన్నాయి’’.
 
 వన్ అండ్ ఓన్లీ సచిన్ - సిద్దార్థ్
 ‘‘నాకు డాన్ బ్రాడ్‌మన్ తెలీదు. గ్యారీ సోబర్స్‌ని చూడలేదు. నేను చూసింది, నాకు తెలిసింది, నేను ఆరాధించింది, నేను ఆస్వాదించింది వన్ అండ్ ఓన్లీ సచిన్‌నే. ప్రపంచంలో ఇంత గొప్ప బ్యాట్స్‌మెన్ మళ్లీ రాడు. 24 ఏళ్లుగా ఈ క్రికెట్ ప్రపంచాన్ని తేజోవంతం చేసినందుకు సచిన్‌కి కృతజ్ఞతలు.
 
 సచిన్ అంటేనే క్రికెట్... క్రికెట్ అంటేనే సచిన్..! - అల్లరి నరేశ్
 ‘గబ్బర్ సింగ్’లో పవన్ కల్యాణ్ ‘పిల్లా... నువ్వు లేని జీవితం నల్లరంగు అంటుకున్న తెల్ల కాగితం’ అని పాట పాడినట్టుగా, సచిన్ లేని క్రికెట్‌ని ఊహించడమే ఎంతో కష్టంగా ఉంది. బ్రియాన్ లారా లాంటి హేమాహేమీల్లాంటి క్రికెటర్లే సచిన్ రిటైర్మెంట్ వార్తను జీర్ణించుకోలేకపోతుంటే, నాలాంటి సాధారణ అభిమానుల పరిస్థితి ఏంటి? నిజంగానే సచిన్ క్రికెట్ దేవుడు. ఆయనలో ఇప్పటికీ క్రికెట్ ఆడే సత్తా ఉంది. కానీ కొత్త తరానికి అవకాశం ఇవ్వాలనే ఒకే ఒక్క కారణంతో పక్కకు తప్పుకుంటున్నారు. నా మట్టుకు నేను సచిన్ లేని క్రికెట్‌ని చూడ్డానికి ఇంకో రెండేళ్లు పడుతుందేమో! అసలు ఒక మనిషి 24 ఏళ్లుగా ఎక్కడా గ్రాఫ్ పడిపోకుండా హైరేంజ్‌లోనే క్రికెట్ ఆడటమంటే మాటలు కాదు. అది సచిన్ ఒక్కడి వల్లే అవుతుంది. ఇన్నేళ్లలో తనపై ఒక్క కాంట్రవర్శి కూడా రాకపోవడం చాలా గొప్ప విషయం. అసలు సచిన్ గురించి ఇంకా చాలా చెప్పొచ్చు. ఫైనల్‌గా మాత్రం ఒక్కటే. సచిన్ అంటేనే క్రికెట్. క్రికెట్ అంటేనే సచిన్.
 
 సచిన్‌కి ఇంకో అయిదారేళ్లు ఆడగల స్టామినా ఉంది - ప్రిన్స్
 ‘‘ఇండియాలో క్రికెట్ ఎప్పుడు పుట్టిందో నాకైతే తెలీదు కానీ, సచిన్ వచ్చాకనే చాలా ఎక్కువ మందికి క్రికెట్ బాగా దగ్గరైంది. నా విషయానికొస్తే - అసలు నేను క్రికెట్ పట్ల ఆకర్షితుణ్ణయ్యిందే సచిన్ వల్ల. ఈ 24 ఏళ్లల్లో చాలామంది క్రికెటర్లు అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. సచిన్ ఒక్కడే ఇంత లాంగ్ ఇన్నింగ్స్ ఆడాడు. తన కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు పుట్టినవాళ్లతో కూడా అతను సమానంగా ఆడుతున్నాడు. ఇది మామూలు విషయం కాదు. సచిన్‌కి ఇంకో అయిదారేళ్లు ఆడగల స్టామినా ఉంది. వైజాగ్‌లో ఏ ఇంటర్నేషనల్ మ్యాచ్ జరిగినా నేనే బాల్ బాయ్‌ని. ఆ విధంగా సచిన్‌ని ఐదారుసార్లు కలిశాను. హీరో అయ్యాక 2 సార్లు కలిశాను. ఇంతకన్నా అదృష్టం ఏముంటుంది!