ప్రముఖ దర్శక నిర్మాత విజయ బాపినీడు కన్నుమూత

12 Feb, 2019 10:10 IST|Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి, శోభన్‌ బాబులతో  వరుస సినిమాలు తెరకెక్కించిన ప్రముఖ దర్శక నిర్మాత విజయ బాపినీడు(86) ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో అనారోగ్యంతో కన్నుమూశారు. 1936 సెప్టెంబర్ 22న ఏలూరు సమీపంలోని చాటపర్రులో జన్మించిన విజయ బాపినీడు, ఎంతో మంది ప్రముఖులను రాష్ట్రానికి అం‍దించిన సీఆర్‌ఆర్‌ కాలేజ్‌లో డిగ్రీ పూర్తి చేశారు. తరువాత జర్నలిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించి సినిమా రంగం మీద మక్కువతో రచయితగా దర్శకుడిగా మారారు. నిర్మాతగానూ విజయం సాధించారు.

తెలుగులో 1982లో దర్శకుడిగా పరిచయం అయిన ఆయన మగ మహారాజు, మహానగరంలో మాయగాడు, హీరోలాంటి వరుస విజయాలతో కమర్షియల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. రాజేంద్ర ప్రసాద్‌ లాంటి కామెడీ హీరోలతోనూ వినోదాత్మక చిత్రాలను తెరకెక్కించి ఆకట్టుకున్నారు. తెలుగులో 22 చిత్రాలకు దర్శకత్వం వహించిన విజయ బాపినీడు చివరి చిత్రం 1998లో తెరకెక్కిన ‘కొడుకులు’.

ఇటీవల చిరంజీవి రీ ఎంట్రీ తరువాత ఓ సినీ వేదిక మీద మాట్లాడిన ఆయన.. మరోసారి చిరును డైరెక్ట్ చేయాలనుందన్నారు. అయితే ఆ కోరిక తీరకుండానే ఆయన తుది శ్వాస విడిచారు. తెలుగు సినిమాకు ఎన్నో కమర్షియల్ సక్సెస్‌లను అందించటంతో పాటు చిరంజీవి టాప్‌ స్టార్‌గా ఎదగటంలో కీలక పాత్ర పోషించిన విజయ బాపినీడు మరణం పట్ల తెలుగు సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అమెరికాలో ఉంటున్న విజయ బాపినీడు పెద్ద కుమార్తె వచ్చేందుకు ఆలస్యమవుతుండటంతో అంత్యక్రియలు గురువారం నిర్వహించాలని నిర్ణయించారు. హైదరాబాద్‌లోని మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు