బాహుబలిని ఢీకొట్టిన విక్రంవేదా.. దుమ్మురేపిన అర్జున్‌రెడ్డి, ఘాజీ!

21 Dec, 2017 19:43 IST|Sakshi

2017లో విడుదలైన టాప్‌ -10 భారతీయ సినిమాల జాబితాను ప్రముఖ సినిమా సమాచార వెబ్‌సైట్‌ ఐఎండీబీ తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో బాహుబలి-2ను అధిగమించి తమిళ క్రైమ్‌ థిల్లర్‌ మూవీ 'విక్రమ్‌ వేదా' టాప్‌ పొజిషన్‌ను సొంతం చేసుకోవడం గమనార్హం. అయితే, ఈ జాబితాలో మూడు తెలుగు సినిమాలు ఉండటం విశేషం. టాప్‌-10 ఇండియన్‌ సినిమాల్లో మొదటిస్థానంలో విక్రమ్‌ వేదా ఉండగా.. రెండో స్థానంలో రాజమౌళి వెండితెర దృశ్యకావ్యం 'బాహుబలి-2', కొత్త దర్శకుడు సందీప్‌ వంగా తెరకెక్కించిన ట్రెండ్‌ సెట్టర్‌ 'అర్జున్‌రెడ్డి' మూడోస్థానంలో ఉన్నాయి. రాణా దగ్గుబాటి హీరోగా కొత్త దర్శకుడు సంకల్ప్‌రెడ్డి రూపొందించిన 'ద ఘాజీ అటాక్‌' సినిమా ఆరోస్థానంలో నిలిచింది. ఐఎండీబీ యూజర్లు ఇచ్చిన రేటింగ్స్‌, రివ్యూల ఆధారంగా ఈ టాప్‌-10 జాబితాను ప్రకటించింది. ఇటు ప్రేక్షకులూ, అటు విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలే ఈ జాబితాలో ఉండటం విశేషం. 

క్రైమ్‌ థిల్లర్‌గా తెరకెక్కి కోలీవుడ్‌లో సూపర్‌హిట్‌ అయిన 'విక్రమ్‌ వేదా' తొలిస్థానంలో నిలువగా, రాజమౌళి 'బాహుబలి-2' రెండోస్థానంలో నిలిచింది. అయితే, ప్రపంచవ్యాప్తంగా బాహుబలి-2 సాధించిన విజయం, కలెక్షన్ల ముందు 'విక్రమ్‌ వేదా' విజయం చిన్నదేనని చెప్పాలి. ఇక తెలుగు ట్రెండ్‌సెట్టర్‌, విజయ్‌ దేవరకొండను సూపర్‌స్టార్‌ను చేసిన 'అర్జున్‌రెడ్డి' ఈ జాబితాలో మూడోస్థానాన్ని దక్కించుకొంది. నాలుగోస్థానంలో ఆమిర్‌ఖార్‌ తెరకెక్కించి అతిథి పాత్ర పోషించిన 'సీక్రెట్‌ సూపర్‌స్టార్‌' నిలువగా.. ఇర్ఫాన్ ఖాన్, సబా ఖామర్ జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్‌టైనర్‌"హిందీ మీడియం' ఐదోస్థానాన్ని దక్కించుకుంది. రాణా హీరోగా మూడు (హిందీ, తమిళం, తెలుగు) భాషల్లో విడుదలైన ఘాజీ సినిమా ఈ జాబితాలో ఆరోస్థానంలో నిలువగా..  ఇక, ఈ ఏడాది అక్షయ్ కుమార్ నటించిన రెండు సినిమాలు 'జాలీ ఎల్‌ఎల్‌బీ- 2', టాయ్‌లెట్‌ ఏక్‌ ప్రేమకథ..  ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. సామాజిక అంశాలు నేపథ్యంగా తీసుకొని తెరకెక్కిన 'టాయ్‌లెట్‌' ఏడో స్థానంలో నిలువగా.. కోర్టుడ్రామాగా తెరకెక్కిన జాలీ ఎల్‌ఎల్‌బీ-2 సినిమా ఎనిమిదో స్థానంలో నిలిచింది. తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్ భారీ బడ్జెట్ చిత్రం 'మెర్సల్‌' ఎనిమిదో స్థానంలో నిలువగా.. మమ్మూటీ, స్నేహ జంటగా తెరకెక్కిన మలయాళ మూవీ ది గ్రేట్ ఫాదర్ ఈ జాబితాలో పదోస్థానంలో నిలిచింది. తెలుగులో వెంకటేశ్‌ హీరోగా ఈ సినిమా రీమేక్‌ కానున్నట్టు తెలుస్తోంది. 
 

>
మరిన్ని వార్తలు