సంక్రాంతి సక్సెస్ ఈ నలుగురిదీ!

24 Jan, 2016 00:11 IST|Sakshi

స్టార్ టాక్

 దర్శకులు సుకుమార్, శ్రీవాస్, మేర్లపాక గాంధీ, కల్యాణ్‌కృష్ణ - నలుగురూ ఇప్పుడు హాట్ టాపిక్. వీళ్ళ నలుగురి సినిమాలూ ఈ సారి సంక్రాంతికి బాక్సాఫీస్ బరిలో దిగిన సినిమా పందెంకోళ్ళు. వివిధ హీరోల అభిమానులు, పరిశ్రమలోని వర్గాలు కత్తులు నూరుకుంటున్న టైమ్‌లో ఈ నలుగురు దర్శకులనూ ‘సాక్షి ఫ్యామిలీ’ ఒకే దగ్గర కూర్చోబెట్టి, వాళ్ళతో ముచ్చటించింది. తీసిన సినిమాలు, నటించిన హీరోలు వేరైనా, పరిశ్రమలో అందరూ ఒకటేనని నిరూపించింది. ప్రస్తుతం వార్తల్లో వ్యక్తులైన నలుగురు దర్శకులతో ‘సాక్షి’ జరిపిన ఎక్స్‌క్లూజివ్ డబుల్ ‘డబుల్ ధమాకా’ ఇది...
 
మీ నలుగురు దర్శకులకూ ఒకరికొకరు పరిచయమేనా? లేక ఇప్పుడే కలిశారా?
 శ్రీవాస్ - నాకు సుక్కు (సుకుమార్) బాగా తెలుసు. సంక్రాంతికి వచ్చిన మా ‘డిక్టేటర్’, సుక్కు ‘నాన్నకు ప్రేమతో’ పనులు ప్రసాద్ ల్యాబ్స్‌లో పక్కపక్కనే జరిగాయి. ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ మేర్లపాక గాంధీ, ‘సోగ్గాడే చిన్ని నాయనా’తో దర్శకుడైన యువకుడు కల్యాణ్‌కృష్ణ గురించి విన్నాను.

 గాంధీ - నేను, సుకుమార్ గారు యాక్టర్ బ్రహ్మాజీ గారింట్లో ఒకసారి కలిశాం.

సుకుమార్- నాకు శ్రీవాస్ గారు బాగా తెలుసు. ఇక, మా కాకినాడ అబ్బాయి కల్యాణ్‌కృష్ణను బన్నీ పార్టీలో కలిశా. ఇక, గాంధీ వాళ్ళ నాన్న గారు మేర్లపాక మురళి నవలా రచయిత కదా! ఆయన సాహిత్యంతో పరిచయముంది.
 
మీ నలుగురిలో గాంధీ (చిత్తూరు జిల్లా) మినహా మిగిలిన ముగ్గురూ తూర్పుగోదావరి జిల్లా వాసులే?
 శ్రీవాస్ - అవును. మేమూ ముందు గమనించలేదు. ఇందాకే ఎవరో ఈ మాట అన్నారు. మా గోదావరి జిల్లాల్లో ఉండే ఆప్యాయతలు, వెటకారాలు అన్నీ మాలో ఉన్నాయి. ఇంకో మాటేమిటంటే, మీ నలుగురూ గ్రామీణ వాతావరణం నుంచి వచ్చినవాళ్ళు. పల్లె సంస్కృతికి ప్రతిబింబమైన సంక్రాంతికే మీ నలుగురి సినిమాలూ రావడం...

 శ్రీవాస్ - యాదృచ్ఛికమే అయినా ఆనందంగా ఉంది.
 
సంక్రాంతి అనగానే మీకు ఏం గుర్తొస్తుంది?
 శ్రీవాస్ - మా ఊరు సీతానగరంలో రామదుర్గా పిక్చర్ ప్యాలెస్ అనే సినిమా హాలుండేది. సంక్రాంతి అనగానే... సినిమాలు, హాలులో జనం కొట్టే విజిల్స్ గుర్తొస్తాయి. బాలయ్య లాంటి మాస్ హీరో దొరకడంతో, అనుకోకుండా సరిగ్గా అలాంటి సినిమానే తీశా.

 సుకుమార్ - ఆ... ఇదీ కారణం! (నవ్వులు...)

 గాంధీ - మాది తిరుపతి దగ్గర రేణిగుంట. నాకు కూడా సంక్రాంతి అంటే గుర్తొచ్చేవి సినిమాలే. ఫ్రెండ్స్‌తో కలసి రేణిగుంట నుంచి తిరుపతికి వెళ్ళి, అక్కడ సినిమాలు చూసేవాళ్ళం. ‘నరసింహనాయుడు’ లాంటి సినిమాలు సంక్రాంతికి చూసి, ఎంజాయ్ చేసిన రోజులు మామూలువి కావు.

సుకుమార్ గారూ! మరి, మీరు చెప్పండి?
 సుకుమార్ - ముందుగా తమ్ముడు కల్యాణ్‌కృష్ణ చెబుతాడు.

 కల్యాణ్‌కృష్ణ - మా అమ్మమ్మ గారిదీ, నాయనమ్మ గారిదీ పల్లెటూరే. అందుకే, సంక్రాంతి అంటే - అందరం కలవడం, ఆనందంగా గడపడం అలవాటు. బేసిక్‌గా నాకు ఫ్యామిలీ ఎమోషన్స్ ఇష్టం. మా ‘సోగ్గాడే చిన్ని నాయనా’ కూడా అలాగే వచ్చింది. అందరి మూలాలూ గ్రామాల నుంచే మొదలవుతాయి. అందుకే, మా సినిమా ఎక్కువగా కనెక్ట్ అయింది.
 సుకుమార్ - (సరదాగా... బుంగమూతి పెడుతూ...) మా సినిమాలు కూడా కనెక్టయ్యాయండీ... (నవ్వులు...)

 శ్రీవాస్ - (నవ్వేస్తూ...) {పతిసారి లాగా కాకుండా ఈసారి విశేషం ఏమిటంటే, సంక్రాంతి సినిమాలన్నీ బాగా ఆడుతున్నాయి.
 
ఈసారి ‘డిక్టేటర్’ ఫుల్ మాస్... ‘నాన్నకు ప్రేమతో క్లాస్ నిండిన మాస్... ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ఫ్యామిలీస్... ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ యూత్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్. సినిమాలపరంగా ఈ మధ్య ఇంత విభిన్నమైన సంక్రాంతి మరొకటి రాలేదేమో!
 శ్రీవాస్ - మేమందరం కలసి ఒక మాట చెబుతాం. (మిగిలినవాళ్ళ వైపు తిరిగి...) మీరు కూడా ఓటేయాలి. ఇలా వివిధ రకాలైన సినిమాలు ఒకే సీజన్‌లో రావడం ప్రేక్షకుల అదృష్టం. మా దురదృష్టం. ఎందుకంటే, సంక్రాంతి సీజన్‌లో ప్రేక్షకుల నుంచి తెలుగు సినిమాకు రూ. 150 కోట్లు వసూలవుతాయనుకుంటే, అదే మొత్తాన్ని నాలుగు సినిమాలూ పంచుకోవాల్సి వచ్చింది. నాలుగు సినిమాలొచ్చాయి కదా అని ఎక్‌స్ట్రా ఎమౌంట్ ఎక్కడ నుంచీ రాదు కదా! సినిమాల కోసం ఎంత ఖర్చు చేయాలని జనం ప్రిపేర్ అయ్యారో, అంతే ఖర్చు చేస్తారు. రెండు సినిమాలు రిలీజైతే, ఇదే మొత్తం ఆ రెండిటికీ వచ్చేది.

 సుకుమార్ - కానీ, నాలుగు రిలీజైతే నాలుగూ సక్సెస్ అనిపించుకోవడం విశేషం. నిజంగానే ఆనందించాల్సిన విషయం. ఎక్కువ మందిని సినిమా హాలులోకి ఆకర్షించాం.

 శ్రీవాస్ -  ఒక్కోసారి రాజకీయాల లాంటివి ఎక్కువుంటాయి. వాటన్నిటి నుంచి పక్కకు తెచ్చి, సినిమా హాలులో కూర్చోబెట్టాం.

 సుకుమార్ - (ఛలోక్తిగా...) జనమంతా సినిమాల హడావిడిలో మునిగిపోయి, హాళ్ళలో ఉండిపోవడం వల్ల బయట క్రైమ్ రేటు బాగా తగ్గింది. అందుకు, పోలీసులతో సహా అందరూ మా సినిమా వాళ్ళను అభినందించాలి. (నవ్వులు...)

 శ్రీవాస్ - నిజం చెప్పాలంటే, ఇండస్ట్రీలో అన్ని రకాల సినిమాలు తీసేవాళ్ళూ అవసరం. ఇలా డిఫరెంట్ జానర్స్‌లో తీసేవాళ్ళుంటేనే, ప్రేక్షకులకూ బాగుంటుంది. ఇండస్ట్రీకీ బాగుంటుంది. అన్ని ఒకటే రకంగా ఉంటే చూడలేరు, చూడరు.

 కల్యాణ్‌కృష్ణ - అవును. అందరం అన్నీ చేయాలి.

 శ్రీవాస్ - గాంధీని కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాల దర్శకుడనీ, కల్యాణ్‌కృష్ణను ఫ్యామిలీ చిత్రాల దర్శకుడనీ అనుకోనక్కర లేదు. కల్యాణ్ లైఫ్ అంతా ఇంతా ఇలాంటి సినిమాలే చేస్తూ కూర్చోరు కదా! రేపు అఖిల్‌తో ఒక క్యూట్ లవ్‌స్టోరీ చేయాల్సి వస్తే, చేస్తారు. అలాగే, గాంధీ ఒక మాస్ తరహా చిత్రం చేయాల్సి వస్తే చేస్తారు. నన్నడిగితే, అసలు డెరైక్టర్స్ ఎప్పుడూ ఒకే రకం సినిమాలు తీయాలని అనుకోరు. నా సంగతే చూస్తే, ‘లౌక్యం’ మంచి హిలేరియస్ కామెడీ ఉండే సినిమా. ఆ వెంటనే బాలయ్యబాబుతో సినిమా అనగానే ‘డిక్టేటర్’ లాంటి మాస్ స్టైల్ యాక్షన్ ఫిల్మ్ చేశాను కదా!

 సుకుమార్ - అవును. నేను ‘లౌక్యం’ చూశాను. చాలా క్లాస్‌గా ఉంటుంది. మేకింగ్ కూడా బాగుంటుంది.

 గమనిస్తే మీ నలుగురు దర్శకులకూ రచనా నేపథ్యం ఉంది. సుకుమార్, కల్యాణ్‌కృష్ణలైతే... మొదలైందే రచయితలుగా! దాని వల్ల సినిమాకు ఎంత ఉపయోగపడింది?
 శ్రీవాస్ - రైటరే దర్శకుడు కావడం వల్ల ఉపయోగమే. ఉదాహరణకు దాసరి గారు. ఇక, మా గురువు గారు కె. రాఘవేంద్రరావు రైటర్ కాకపోయినా, కథను అల్లుకునే విధానం అద్భుతంగా ఉంటుంది. పెద్ద ఎన్టీయార్‌తో ‘అడవిరాముడు’ గురించి ఆయన చెబితే ఆశ్చర్యపోయా. ఎన్టీయార్ అప్పటి దాకా చేయని నేపథ్యంలో సినిమా అయితే బాగుంటుందని అటవీ నేపథ్యం ఎంచుకున్నారు. దానికి తగ్గట్లే హీరోను ఫారెస్ట్ ఆఫీసర్‌ను చేశారు. కానీ, ఆయన ఫలానా అని ముందే అది చెప్పేస్తే, డ్యూయెట్లకి కుదరదు కాబట్టి, ఆ సంగతి ఇంటర్వెల్‌కి చెబుదామనుకున్నారు. ఒక రైటర్ కాకపోయినా, కమర్షియల్ దర్శకుడు ఎలా ఆలోచించి, కథ అల్లుకోవాలో చెప్పడానికి అంతకు మించి ఇంక ఉదాహరణేం కావాలి!
 
కానీ, ఈ మధ్య దర్శక - రచయితలు కూడా ఇతరుల స్క్రిప్ట్‌ల మీద ఆధారపడడం కూడా జరుగుతోంది! మరి, మీ రైటింగ్ స్కిల్స్ వృథా అవుతున్నట్లేగా?
 శ్రీవాస్ - అలా కాదు. గతంలో ‘లక్ష్యం’, ‘రామ రామ కృష్ణ కృష్ణ’ చిత్రాలకు నేనే కథలు రాసుకున్నా. కానీ, మనమే కథ రాసుకొని, స్క్రిప్ట్ చేసుకోవాలంటే దానికి ఆరు నెలల నుంచి ఏడాది దాకా పడుతుంది. ఒక సినిమా అయిపోయిన వెంటనే, దాని మీద వచ్చిన విమర్శలు, రివ్యూల్లో పేర్కొన్న తప్పొప్పుల్ని అర్థం చేసుకొని, మళ్ళీ అవి జరగకుండా ఉండేలా కొత్త సినిమా స్క్రిప్ట్‌కి కూర్చోవాలి. ఇలా కొత్త సినిమా ఏమిటనేది - ఆలోచించుకోవడానికే 4 నెలల టైమ్ పడుతుంది. ఒక లైన్ అనుకొని, ఏ హీరో దగ్గరకు వెళ్ళినా, అప్పటికే అతను కనీసం రెండు సినిమాలు చేస్తూ ఉండి ఉంటాడు. దాంతో, మళ్ళీ వెయిటింగ్. అందుకే, దర్శకులైన మేము ఎక్కువగా బయటివారి కథలు తీసుకొని, సినిమాకు తగ్గట్లు తీర్చిదిద్దుకుంటాం. కానీ, బయటివాళ్ళ కథను జడ్జ్ చేయడానికి కూడా దర్శకుడికి రైటింగ్ స్కిల్స్ కావాల్సిందే. అది తప్పనిసరి.

 సుకుమార్ - ఇది కరెక్ట్. శ్రీవాస్ మాటలతో నేను పూర్తిగా ఏకీభవిస్తా. నన్నడిగితే - దర్శకుడిగా మమ్మల్ని పెట్టుకొనేది మా క్రియేషన్‌కి కాదు... మా జడ్జిమెంట్‌కి! ఫలానా కథ ఎంతవరకూ వర్కౌట్ అవుతుందనేది జడ్జ్ చేయడాన్ని బట్టి మా సక్సెస్ ఉంటుంది. ఎవరైతే, కథను సరిగ్గా జడ్జ్ చేయగలుగుతారో వాళ్ళకు సక్సెస్ వస్తుంది. సక్సెస్‌ఫుల్ డెరైక్టర్ అవుతారు.గాంధీ గారూ! సంక్రాంతి బరిలో హేమాహేమీలైన ముగ్గురు పెద్ద హీరోల చిత్రాల మధ్య వస్తున్నప్పుడు దేన్ని నమ్మి, ధైర్యం చేశారు?

మేర్లపాక గాంధీ - కంటెంట్‌ను నమ్ముకున్నా. వినోదంతో సాగే ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ కథతో అందరూ కనెక్ట్ అవుతారనుకున్నాను. అనుకున్నట్లుగానే ఇవాళ చాలామంది కనెక్ట్ అయినట్లు బాక్సాఫీస్ దగ్గర ప్రూవ్ అయింది.
 
కల్యాణ్‌కృష్ణ గారూ! మొదటి మూడు సినిమాలూ రిలీజైపోయాక, ఆఖరున జనవరి 15న మీ ‘సోగ్గాడి చిన్ని నాయనా’ వస్తుంటే, మీరు ఏమైనా టెన్షన్ ఫీలయ్యారా? సినిమా రిజల్ట్ ఎప్పుడు తెలిసింది?
 కల్యాణ్‌కృష్ణ - రిలీజ్‌కు ముందు నుంచి గట్టి నమ్మకం ఉంది.  నాగార్జున గారు తన ఫ్రెండ్స్‌కీ, మరికొందరికీ షో వేశారు. చూసినవాళ్ళ రెస్పాన్స్ చూశాక, ‘తప్పు జరగదు’ అనే నమ్మకం మాకుంది. అయితే ఎంతైనా, సినిమా రిలీజ్‌కు ముందు రోజు చిన్నపాటి టెన్షనైతే ఉంది. ఇక్కడ రిలీజ్ కన్నా కొద్ది గంటల ముందే మన అర్ధరాత్రి టైమ్‌కే లండన్ లాంటి చోట్ల షోలు పడతాయి. అక్కడ నుంచే ఫస్ట్ హిట్ టాక్ వచ్చింది. ఇక్కడ కూడా షో పడ్డాక రెస్పాన్స్‌తో రిజల్ట్ తెలిసిపోయింది.

 శ్రీవాస్ - నిజం చెప్పాలంటే, ఇక్కడ రిలీజ్ రోజున పొద్దున్న మనం నిద్ర లేచే టైమ్‌కే ఓవర్సీస్ నుంచి సినిమా టాక్ వచ్చేస్తుంది. ఫోనుల్లో మెసేజ్‌లు, కాల్స్ వచ్చేస్తాయి.

 సుకుమార్ - అందుకే మేము లేట్‌గా నిద్ర లేస్తుంటాం (నవ్వులు...). ‘నాన్నకు ప్రేమతో’ సినిమాకైతే రిలీజ్‌కు ముందు దాదాపు 500 గంటలు కంటిన్యుయస్‌గా పనిచేశా. అరగంట నిద్రపోవాలంటే, పెద్ద డిస్కషనే! మధ్య మధ్యలో 10 నిమిషాలు చిన్న కునుకు తీయడమే తప్ప, కంటి నిండా నిద్ర కూడా లేదు. రిలీజ్ ముందు రోజు రాత్రి కూడా ప్రింట్స్, కరెక్షన్స్ - అవన్నీ చూసుకోవడమే సరిపోయింది. వర్క్ అంతా పూర్తయ్యాక ఎప్పుడు పడుకున్నానో, నిద్ర లేచానో నాకే తెలీదు. తీరా నిద్ర లేచే సరికి ‘ఇవాళే సినిమా రిలీజ్ కదా’ అని గుర్తొచ్చింది. ఎన్ని ఫోన్లు వచ్చాయో తెలీదు కానీ, మెమరీ 20 మిస్డ్ కాల్స్‌కే కాబట్టి, అవి నోట్ అయి ఉన్నాయంతే! అన్ని ఫోన్లు వచ్చాయంటే, సినిమా సక్సెస్ అన్న మాట అని అర్థమైంది.

 శ్రీవాస్ - రిలీజ్ రోజున మన ఫోన్ ఆగకుండా మోగుతూనే ఉంటే సినిమా హిట్. మోగకపోతే, ఫట్ అన్న మాట.

 సుకుమార్ - ఫోన్ మోగలేదంటే, పొరపాటున సెలైంట్ మోడ్‌లో పెట్టేశామేమోనని ఒకటికి, రెండుసార్లు చెక్ చేసుకోవాల్సిందే. (నవ్వులు...)

 శ్రీవాస్ - ‘డిక్టేటర్’ సినిమా విషయానికొస్తే - సహ నిర్మాతగా, దర్శకుడిగా నాది డబుల్ వర్క్. అయితే, టెన్షన్ పడలేదు. సర్వసాధారణంగా సినిమావాళ్ళందరికీ రిలీజ్ ముందు రోజున బయ్యర్లు సినిమా కొనడానికి కమిటైన డబ్బులో ఎంత తగ్గించి తెస్తారో అని టెన్షన్. ‘డిక్టేటర్’ విషయానికి వస్తే - డిస్ట్రిబ్యూటర్లుఒక వారం ముందే వచ్చి, ‘నాన్నకు ప్రేమతో’ సహా మరికొన్ని సినిమాలు కూడా ఒకేసారి వస్తున్నాయి కాబట్టి, డబ్బు అనుకున్నంత సమకూరడం లేదని చెప్పారు. వాళ్ళ ఇబ్బందులు కూడా గ్రహించి, ఈరోస్ వాళ్ళతో, బాలకృష్ణ గారితో మాట్లాడాం. ముందుగా వాళ్ళు ‘డిక్టేటర్’ కొనడానికి కమిటైన డబ్బులో నుంచి 15 శాతం డిస్కౌంట్ ఇచ్చాం. దాంతో, మాకు జరగాల్సిన వ్యాపారంలో కొన్ని కోట్లు తగ్గినా, సినిమా పరిశ్రమలో అందరి క్షేమం కోసం చూశాం. డిస్ట్రిబ్యూటర్లు కూడా మిగిలినదంతా మిస్ కాకుండా కట్టారు. పరిశ్రమ క్షేమం దృష్టిలో పెట్టుకొని చేసిన ఈ చర్యతో బాలకృష్ణ కూడా హ్యాపీగా ఫీలయ్యారు. అనుకున్నట్లుగానే, రిలీజవగానే ‘డిక్టేటర్’ హిట్ అయింది.
 
కానీ, సినిమా రిలీజ్ రోజున సరైన టాక్ తెలుస్తుందంటారా?
 శ్రీవాస్ - ఏ హీరో అభిమానులైనా తమ హీరో సినిమా రిలీజ్ రోజునే చూసేస్తారు. ఫ్యాన్స్ డెఫినెట్‌గా పాజిటివ్‌గా రియాక్ట్ అవుతారు. పైగా, బాలయ్యబాబు లాంటి మాస్ హీరోతో చేసే సినిమా అంటే పెద్ద ఎడ్వాంటేజ్. ఫ్యాన్స్ బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తూ, ముందుగా ఆనందంతో అరిచేస్తారు. ఒక్కోసారి మన సినిమా నిజంగా ఇంత హిట్టయిందా అనిపిస్తుంది. అందుకే, ఎవరమైనా సరే - ఫస్ట్ డే టాక్ నిజమా, కాదా అని క్రాస్ చెక్ చేసుకుంటాం. మాకు డిస్ట్రిబ్యూటర్లు కూడా తెలుసు కాబట్టి, వాళ్ళకు ఫోన్ చేసి అడుగుతుంటాం. వాళ్ళు అబద్ధం చెప్పరు. అందుకని రెండోరోజు నుంచి నిజాలు తెలిసిపోతాయి. నాలుగైదు రోజుల తర్వాత పరిస్థితి స్పష్టంగా అర్థమైపోతుంటుంది. ఎందుకంటే, మాటల్లో బుకాయించగలమే కానీ, డిస్ట్రిబ్యూటర్లు చూపించే అంకెలను కాదనలేం కదా!
 సుకుమార్, గాంధీ, కల్యాణ్‌కృష్ణ - అవును... అది నిజం.
 
 ఇంతకీ, మీ నలుగురికీ మిగతా ముగ్గురు దర్శకుల సినిమాల్లో, సినిమా మేకింగ్‌లో నచ్చిందేమిటి?
 శ్రీవాస్ - సుక్కుది చాలా డిఫరెంట్ స్టైల్. రెగ్యులర్ ఫార్మట్‌లో కాకుండా కొత్తగా తీస్తాడు. ఆ సీన్ చూసేవాళ్ళకూ, చూసేవాళ్ళకూ కొత్తదనం అనిపిస్తుంది. ‘ఆర్య’ సినిమా అలాంటి డిఫరెంట్ స్టైల్‌కు ఒక ఉదాహరణ. ఇక, మేర్లపాక గాంధీ ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ చూశాను. అతని ఎంటర్‌టైన్‌మెంట్ టైమింగ్ బాగుంటుంది. కల్యాణ్‌కృష్ణ మా తూ.గో. జిల్లా వాడేగా! మా సహజమైన గోదావరి శైలిలో సినిమా తీస్తాడు. ‘సోగ్గాడే...’ బాగుందని విన్నా.

కల్యాణ్‌కృష్ణ - సుకుమార్ గారిలో నాకు నచ్చేది ఏమిటంటే - ‘ఆర్య’లోని వన్‌సైడ్ లవ్ మొదలు ఏది చెప్పినా, తనదైన లాజిక్‌తో కన్విన్స్ చేస్తారు. శ్రీవాస్ గారి ‘లక్ష్యం’ నుంచి అన్ని సినిమాలూ చూస్తూ వచ్చా. ఎమోషన్‌ని ఆయన బాగా హ్యాండిల్ చేస్తారు. ఇక, గాంధీ గారి కామెడీ టైమింగ్ నాకు బాగుంటుంది.

 మేర్లపాక గాంధీ - నాకు శ్రీవాస్ గారి సినిమాల్లో అటు ఎంటర్‌టైన్‌మెంట్, ఇటు ఎమోషన్ - రెండూ డీల్ చేయడం బాగుంటుంది. సుకుమార్ గారు మంచి క్రియేటివ్ డెరైక్టర్.

 సుకుమార్ - శ్రీవాస్ సినిమాల గురించి ఇందాకే చెప్పేశాను. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ నాకు నచ్చింది. కల్యాణ్‌కృష్ణకు ఇది తొలి సినిమానే కాబట్టి, ఇంకా బాగా వృద్ధిలోకి వస్తాడు.
 
ఇతర దర్శకుల సినిమాలు చూసినప్పుడు అలా మనమూ తీయాలన్నంత అనిపించిన సందర్భాలు?
 కల్యాణ్‌కృష్ణ - కొన్ని సీన్స్ చూసినప్పుడు అలా అనిపిస్తుంది. శ్రీవాస్ గారు తీసిన ‘లక్ష్యం’లో హీరో అన్న క్యారెక్టర్ జగపతిబాబును చూసినప్పుడూ, ‘ఆర్య’లో తాజ్‌మహల్ గురించి చెప్పే సీన్ లాంటివి చాలా ఇష్టం.

 గాంధీ - ఏ సినిమా చూసినా, ఫలానాది చాలా బాగుంది అనుకొనే సందర్భాలు చాలా ఉన్నాయి. సుకుమార్, శ్రీవాస్ గార్ల సినిమాలూ అంతే! కానీ, నాకు తెలిసింది, నేను చేయగలిగినదే చేద్దామని ఫిక్సయ్యా.
 
కానీ, పక్కవాళ్ళ సినిమా చూసినప్పుడు ఇలాంటిది మనం తీయలేకపోయామనో, మన సినిమాయే బాగా ఆడాలనో జెలసీ ఉండదా?
 సుకుమార్ - సెకన్‌లో వెయ్యోవంతు ఒక చిన్నపాటి జెలసీ ఫీలింగ్ రావడం మానవ సహజం. క్రియేటివ్ ఫీల్డ్‌లో మరీ! (నవ్వులు...). కానీ, వెంటనే దాన్ని పాజిటివ్‌గా, ఆనందంగా మార్చుకోవాలి. మారుతుంది.

 శ్రీవాస్ - చాలామందికి తెలియనిదేమిటంటే, సినిమా పరిశ్రమలో నడిచేది ఒక చైన్ రియాక్షన్. మన ముందు సినిమాలు ఆడకూడదనుకొంటే, అక్కడ నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్, బయ్యర్ దగ్గర మన సినిమా కొనడానికి డబ్బులెక్కడ ఉంటాయి? కాబట్టి, ఆ ఎఫెక్ట్ మన సినిమా మీద పడుతుంది. కాబట్టి, ప్రతి ఒక్కరి సినిమా ఆడాలి. ఫిల్మ్‌నగర్‌లో కూర్చొని, మన హీరో, మన సినిమా ఒక్కటే గొప్ప.. మనదొక్కటే ఆడితే చాలు. అవతలివాడి సినిమా బాగోలేదు... పోవాలి అనుకుంటే, తప్పు.

 సుకుమార్ - అవును. ఇది చాలా మంచి లాజిక్. ప్రాక్టికల్ కూడా!

 శ్రీవాస్ -నిజానికి, సినిమా బిజినెస్ అనేది గుడ్డిగా ఆడే ఒక ఆట. ఇటీజ్ ఎ ఫేక్ గేమ్. ఒక పేకాట లాగా ఉంటుంది. డబ్బులు ఎప్పుడు వస్తాయో, ఎప్పుడు పోతాయో చెప్పలేం.

 సుకుమార్ - ఇవాళ సంక్రాంతి రిలీజ్‌లు నాలుగూ సినిమాలూ ఆడుతున్నాయీ అంటే, థ్యాంక్స్ టు ‘బాహుబలి’. ఆ సినిమా కొన్నేళ్ళుగా బయటకు రాని జనాన్ని ఇళ్ళల్లో నుంచి సినిమా హాలుకి మళ్ళీ రప్పించడం మొదలుపెట్టింది. 

గాంధీ - ఇవాళ నిజంగానే సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్య పెరిగింది.

 శ్రీవాస్ - సినిమాలు చూసి 15 - 20 ఏళ్ళయిన అత్తయ్యలు, మామయ్యలు కూడా ఇప్పుడు మళ్ళీ థియేటర్ల వైపు వస్తున్నారు. సినిమా బాగుందని వింటే, వచ్చి చూస్తున్నారు.

 కల్యాణ్‌కృష్ణ - అందుకే, ఈసారి కలెక్షన్స్ కూడా బాగున్నాయి.

 శ్రీవాస్ - ఏమైనా, పక్కవాడి సినిమా ఫెయిలవ్వాలి, మనం పాసవ్వాలి అనుకుంటే, వాడికి 34 మార్కులొస్తాయి. మనకు 35 మార్కులొస్తాయి. పక్కవాడికి 99 మార్కులు రావాలి, మనం అంతకన్నా ఇంకొద్దిగా బాగుండాలి అనుకుంటే, మనకు 100 మార్కులొస్తాయి. అప్పుడే అందరం బాగుంటాం.

 సుకుమార్, గాంధీ, కల్యాణ్‌కృష్ణ - అవును. బ్రహ్మాండంగా చెప్పారు.
 
మీ మీద ప్రభావం చూపిన సినిమాలు, దర్శకులంటే?
 శ్రీవాస్ - నా మీద కె. రాఘవేంద్రరావు గారి ప్రభావం చాలా ఉంది. ఆయన లాగా అన్ని రకాల కోవల సినిమాలూ ట్రై చేయాలి, ఎలాంటివైనా చేయగలడనిపించుకోవాలని కోరిక. ప్రభావం చూపిన సినిమాలంటే, తమిళ దర్శకుడు శంకర్ సినిమాలు బాగా ఇష్టం. హిందీలో ‘లగాన్’.

 సుకుమార్ - {పత్యేకించి కొన్ని సినిమాలని చెప్పడం కష్టం. ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు చూస్తూ ఉండేసరికి, రోజుకో సినిమా ఇష్టమై, ప్రభావం మారిపోతుంటుంది. అయితే, బేసిగ్గా రామ్‌గోపాల్ వర్మ, కృష్ణవంశీ, మణిరత్నం అంటే నాకు బాగా ఇష్టం. మరీ ముఖ్యంగా, వర్మ గారి సినిమాలంటే!  నేను టీచింగ్ వదిలేసి, దర్శకత్వం వైపు వచ్చేయాలని నన్ను బాగా ప్రభావితం చేసిన సినిమా మణిరత్నం ‘గీతాంజలి’.

 కల్యాణ్‌కృష్ణ - ‘సీతారామయ్య గారి మనవరాలు’ నుంచి ‘నరసింహనాయుడు’ దాకా చాలా సినిమాలు ఇష్టం. సహజంగానే వాటి ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. దర్శకుల్లో నాకు కృష్ణవంశీ గారు బాగా ఇష్టం.  

 మేర్లపాక గాంధీ - నాకు జంధ్యాల గారు ఇష్టం. ఆయన అన్ని సినిమాలూ చూశా. బేసిక్‌గా ఆయన పాత్రల క్యారెక్టరైజేషన్ నాకు ఇష్టం.
 
సంక్రాంతి అంటే ఆడవాళ్ళ ముగ్గులు, గొబ్బెమ్మలు, అలంకారాలు, పిండివంటలు - అన్నీ! కానీ, సినిమాలకొచ్చేసరికి ఎంతసేపటికీ, హీరోల సినిమాలేనా? హీరోయిన్ల సినిమాలతో సంక్రాంతి సీజన్ చేయొచ్చుగా?
 శ్రీవాస్ - (నవ్వేస్తూ...) హీరోలందరూ ఒక ఏడాది సెలవు తీసేసుకుంటే, అప్పుడు హీరోయిన్ల సినిమాలే చేయొచ్చు.

 సుకుమార్ - మాకైతే, జెండర్ తేడా లేదు. ఆడా, మగా ఒకటే! (నవ్వులు...). గతంలో విజయశాంతి గారి లాంటివాళ్ళకు ప్రత్యేక మార్కెట్ ఉండేది. ఇప్పుడు ఎందుకనో చాలా కారణాల వల్ల హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు అన్ని రావడం లేదు. అలాంటి సినిమాలతో సంక్రాంతి వస్తే... అదో వెరైటీ.
 
 ఇంతకీ మీరు మీ సినిమాలు కాకుండా, సంక్రాంతికొచ్చిన ఇతర రిలీజ్‌లు చూశారా?
 శ్రీవాస్ - అసలు మీరు మా సినిమాలన్నీ చూశారా?

 సుకుమార్ - అవునవును. చూశారా?

 ‘సాక్షి’ - (నవ్వుతూ...) చూడకుండా ఎలా ఉంటాం! చూశాం. రివ్యూలు రాశాం. ఇంటర్వ్యూలు చేశాం, చేస్తున్నాం.

 శ్రీవాస్ - (నవ్వేస్తూ...) కానీ, చాలామంది చూడకుండానే, ట్రైలర్లు చూసేసి, ‘హీరో స్టైల్ బాగుంది’ లాంటి మాటలతో మసిపూసి మారేడుకాయచేసి, మమ్మల్ని ఇంటర్వ్యూ చేసేస్తుంటారు. కానీ, నా మటుకు నేను సంక్రాంతి రిలీజ్‌లన్నీ ఇంకా చూడలేదు. ఎక్కడండీ! ఇప్పటి దాకా మా సినిమాల పనులు, రిలీజ్ హంగామా, ఇప్పుడేమో ప్రమోషన్ హడావిడిలో ఉన్నాం. కొద్దిగా తీరిక దొరికిన తరువాత ఇప్పుడిక వెళ్ళాలి.

 సుకుమార్, మేర్లపాక గాంధీ, కల్యాణ్‌కృష్ణ - మా పరిస్థితి కూడా సేమ్ టు సేమ్.

 శ్రీవాస్, సుకుమార్- ఇప్పుడిక ఫ్యామిలీలు తీసుకొని, మిగిలిన సినిమాలకు కూడా వెళతాం.

 మేర్లపాక గాంధీ - నేను మా ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ రిలీజ్ ముందు రోజు బాగా టెన్షన్ పడ్డా. మా కన్నా ఒక రోజు ముందే జనవరి 13న ‘నాన్నకు ప్రేమతో’ వచ్చేసింది. పైగా, నేను సుకుమార్ గారి ఫ్యాన్‌ని. ఆ మధ్య ఆయన నిర్మించిన ‘కుమారి 21 ఎఫ్’ నాకు బాగా నచ్చింది. మా ఫ్రెండ్స్ అందరూ ‘నాన్నకు ప్రేమతో’కి వెళుతూ, నన్ను రమ్మన్నారు. ‘నేను రానురా బాబూ! ఈ టెన్షన్‌లో సుకుమార్ గారి సినిమా చూశానంటే, నాకిక నా సినిమా నచ్చదు. నా సినిమా రిలీజయ్యాక, కొంచెం ఆగి చూస్తాను’ అని చెప్పాను. ఇప్పటి వరకూ చూడడం కుదరలేదు. ఇప్పుడు వెళతాను.

 సుకుమార్ - అవును. ‘కుమారి 21 ఎఫ్’ బాగుందని గాంధీ నాకు చాలా మంచి ఎస్.ఎం.ఎస్. పెట్టాడు.

 శ్రీవాస్ - మేము ఇతర సంక్రాంతి రిలీజ్‌లు చూడలేదన్న మాటే కానీ, చూసినదాని కన్నా చాలా ఎక్కువే విన్నాం. (నవ్వులు...)
 
ఇంతకీ ఈ సంక్రాంతి మీకు ఏమిచ్చింది?
 శ్రీవాస్, గాంధీ, కల్యాణ్‌కృష్ణ, సుకుమార్ - (నలుగురూ ఒక్కసారిగా...) సక్సెస్ ఇచ్చింది.

 సుకుమార్ - మీకు మాత్రం మా నలుగురి నుంచి మంచి ఇంటర్వ్యూ ఇచ్చింది (నవ్వులు...)
 
ఇంతకీ, ఫైనల్లీ ఈ సంక్రాంతి బాక్సాఫీస్ రేసులో... ‘...అండ్ ది అవార్డ్ గోస్ టు...’?
 శ్రీవాస్ - (వెంటనే అందుకుంటూ...) ఆడియన్స్! అన్ని సినిమాలనూ ప్రేక్షకులు చాలా పాజిటివ్‌గా రిసీవ్ చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ తమ టేస్ట్‌ను బట్టి, నాలుగు కోవల సినిమాలనూ ఆదరించారు. పరిశ్రమ పచ్చగా కళకళలాడడానికి ఇంతకన్నా ఏం కావాలి!

 సుకుమార్ - ఈ మాట నిజం. శ్రీవాస్ చెప్పినదానికే మా ఓటు (నవ్వులు...).

 గాంధీ, కల్యాణ్‌కృష్ణ - అవునవును. నిజం.
 
చివరిగా మీ నలుగురూ కలసి ఒక్కొక్కరూ ఒక్కో భాగం చొప్పున గొలుసుకట్టుగా ఒక సినిమా స్టోరీ ఇప్పటికిప్పుడు అల్లేసి, మా ‘సాక్షి’ పాఠకుల కోసం చెబుతారా?
 శ్రీవాస్ - (నవ్వేస్తూ...) ఏదో ఎందుకు... ఇదే చెబుతాం... కల్యాణ్ నువ్వు స్టార్ట్ చెయ్యి! ‘సాక్షి ఇంటర్వ్యూకు వచ్చాం’ అని చెప్పు. (కల్యాణ్ నవ్వుతూ... అలాగే చెప్పారు). సుక్కు గారూ! మీరేమో...

 సుకుమార్ - భలే ఇంటర్వ్యూ మొదలైంది... మధ్యలో రెండు టీలు తాగాం... (నవ్వులు...)

 శ్రీవాస్ - పత్రికల్లో రివ్యూల ఫక్కీలో చెప్పాలంటే... మధ్యలో కాస్తంత నిదానించినా, మంచి ఇంటర్వ్యూలో భాగమై, హ్యాపీగా ఫీలయ్యాం.

 గాంధీ గారూ! క్లైమాక్స్ మీదే!
 గాంధీ - వదిలేస్తే... ఇంటికి వెళ్ళిపోతాం. (నవ్వులు... నలుగురూ దర్శకులూ ఆత్మీయంగా కౌగిలించుకుంటూ, సెల్ఫీ దిగారు).
 
     - రెంటాల జయదేవ