గుప్పెడు పాటలు...గుండెనిండా పరిమళం!

9 Feb, 2015 22:53 IST|Sakshi

లండన్ వాళ్లకు తమిళం తెలియదు. కాజీపేట వాళ్లకు ఫ్రెంచ్ అర్థం కాదు. ప్రాంతానికో భాష... దేశానికో భాష... కానీ, ప్రపంచమంతా అర్థం చేసుకునే భాష... ప్రేమ. మీరు ఏమైనా అనుకోండి... ఎంతైనా కామెంట్ చేసుకోండి... ప్రేమ వేల్యూ ప్రేమదే. సాహిత్యానికి, సినిమాకి ఈ ప్రేమే గొప్ప ఇంధనం. ప్రేమ పేరు చెప్పి ఎన్ని వేల పాటలొచ్చాయో! ముఖ్యంగా బాలీవుడ్‌లో... కానీ, ప్రస్తుతానికి ఓ పది పాటల గురించి మాట్లాడుకుందాం.  ఆ పాటల్లో ప్రేమనంతా ఆస్వాదిద్దాం! ఆ ప్రేమ పరవళ్లలో కొట్టుకుపోదాం... ఎలాగూ మరో నాలుగు రోజుల్లో ప్రేమికుల రోజు ఉంది కదా!

సినిమా పేరు: బైజూ బావరా (1952)
ప్రేమ జంట: భరత్ భూషణ్, మీనాకుమారి
స్వర సారథ్యం: నౌషాద్ అలీ
సాహిత్యం: షకీల్ బాదాయుని
గానం: మహమ్మద్ రఫీ
తూ గంగాకీ మౌజ్..
మై జమునాకీ ధారా..

ప్రేయసి అలిగింది. అర్జంట్‌గా ప్రసన్నం చేసుకోవాలి. ప్రియుడి తొందరపాటు. ఇందుకు పాటకు మించిన అస్త్రం ఏముంటుంది! పాట మొదలైంది.
ప్రియా.. ఈ దూరం మన అనుబంధాన్ని చెరిపేయగలదా? నువ్వెంత దూరం వెళ్లినా వెతుక్కుంటూనే వస్తాను. నీ అలకనంతా మాయం చేసి వలపు పుట్టేలా చేస్తాను...
ఇలా సాగిపోయింది పాట. కరిగిపోవడం మినహా  ఆ కలహంసకు వేరే దారి ఏముంటుంది!
కమ్మటి ముద్దు... చక్కటి కౌగిలి మిగులుతాయి ప్రియుడికి.
మీ ప్రేయసి అలక తీర్చడానికి మీరూ వాడొచ్చు... ఈ పాటను!
**************
సినిమా పేరు: శ్రీ 420 (1955)
ప్రేమ జంట: రాజ్‌కపూర్, నర్గిస్
స్వర సారథ్యం: శంకర్-జైకిషన్
సాహిత్యం: శైలేంద్ర
గానం: లతా మంగేష్కర్, మన్నాడే
‘ప్యార్ హువా ఇక్‌రార్ హువా హై..
ప్యార్ సే ఫిర్ క్యోం డర్తా హై దిల్..’

భోరున వర్షం. తనివి తీరా తడవాలి. పక్కన ప్రేయసి ఉంది. అయినా ప్రియుడికి ఈ వాన చాలడం లేదు. ఎందుకంటే... ప్రేమ మొదలైంది. అంగీకారం కూడా దొరికింది. కానీ మనసులో ఏదో సంశయం. ప్రేమకు గమ్యం ముఖ్యమా? గమనం ముఖ్యమా ఏమో... ఈ పాట వింటుంటే మొత్తం సంశయాలన్నీ తొలగిపోయి, ఓ భరోసా దొరుకుతుంది. కావాలంటే వినండి.
******************
సినిమా పేరు: ఓ కౌన్ థీ (1964)
ప్రేమ జంట: మనోజ్‌కుమార్,
సాధన
స్వర సారథ్యం: మదన్‌మోహన్
సాహిత్యం: రాజా మెహ్దీ అలీఖాన్
గానం:  లతా మంగేష్కర్
లగ్ జా గలే.. ఫిర్ ఏ హసీన్...

రాత్ హో నా హో...
మునుపటి క్షణంతో మనకు పని లేదు. రేపటి క్షణం గురించి ఆలోచన అనవసరం. ఇవాళ్టి క్షణం విలువైనది. మనసు నిండా ప్రేమ నింపుకోవాలి. ఒంపుకోవాలి. తడిసి ముద్దవ్వాలి. మళ్లీ మళ్లీ... ఇలా ఆస్వాదిస్తూనే ఉండాలి. అస్సలు వృథా వద్దు.
కాలాన్నీ... మౌనాన్నీ... పరిసరాల్ని ఏ మాత్రం పట్టించుకోవద్దు. ప్రేమకు ఈ క్షణమే శాశ్వతం
నిజం! నిజంగా నిజం! ఒడిసిపట్టండి ఈ పాటను!
***********************
సినిమా పేరు: సరస్వతిచంద్ర (1968)
ప్రేమ జంట: మనీష్, నూతన్
స్వర సారథ్యం: కల్యాణ్‌జీ-ఆనంద్‌జీ
సాహిత్యం: ఇందీవర్
గానం:  లతా మంగేష్కర్, ముఖేష్
చందన్ సా బదన్..
చంచల్ చిట్‌వన్.. ధీరే సే తేర యే..’

పాట వెళ్లిపోయింది.. నువ్వూ వెళ్లిపోతావు. ఇంక నేనేం కావాలి?
అవును కదూ! నీ జ్ఞాపకాలు ఇంకా మిగిలే ఉన్నాయిగా!
చందనంతో పోత పోసినట్టుండే నీ దేహం మెరుపు... విల్లులా ఒంగిన కనుబొమ్మల్లోంచి దూసుకొచ్చే చూపుల రాపిడి... అమ్మో... నా వల్ల కాదు. నీ కన్నా నీ జ్ఞాపకాలు చేసే గాయమే అధికం. మనసుకు తియ్యటి యాతన కావాలనుకుంటేనే ఈ పాటను వినండి బాబూ!
**********************
సినిమా పేరు: ఆరాధన (1969)
ప్రేమ జంట: రాజేశ్ ఖన్నా,
షర్మిలా ఠాగూర్
స్వర సారథ్యం: ఎస్.డి. బర్మన్
సాహిత్యం: ఆనంద్ బక్షి
గానం: కిశోర్‌కుమార్
మేరీ సప్నోంకీ రాణీ కబ్ ఆయేగీ తు...
కాలం ఘనీభవిస్తోంది.. మనసు ద్రవీభవిస్తోంది! నా కోసం ఎప్పుడు పాడతావు చెప్పు! నువ్వు నా కలల రాణివి. నీ కోసం ఎంత కాలమని ఎదురుచూడాలి. ఈ తోటలో పువ్వులు కూడా నీ గురించే ఆరా తీస్తున్నాయ్. నీ కోసమే ఈ అన్వేషణ.. ఈ నిరీక్షణ.. ఎప్పుడు వస్తావు చెప్పు!
విరహాన్ని ఓ పాట రూపంలో అనుభవించాలని ఉందా...? అయితే వినండి ఈ పాట..
***********************
సినిమా పేరు: పాకీజా (1972)
ప్రేమ జంట: రాజ్‌కుమార్, మీనాకుమారి
స్వర సారథ్యం: గులామ్ మొహమ్మద్
సాహిత్యం: కమల్ అమ్రోహీ
గానం: లతా మంగేష్కర్
‘మౌసమ్ హై ఆషికానా... ఏ దిల్ కహీ సే..’
ఒంటరితనాన్ని భరించలేను. ఇదెంత నరకమో నీకేం తెలుసు. పగలు నాపై పగబట్టింది. చివరకు రాత్రి కూడా నన్ను బాధిస్తోంది. ఇక్కడ వెన్న లేదు.. వెన్నెలా లేదు.. మొత్తం చీకటే. నువ్వు రావాలి దివ్వెలాగా... ఆ కొంచెం వెలుతురు చాలు.
నిజమే ఈ పాట తప్పకుండా వెలుతురునిస్తుంది.
***********************
సినిమా పేరు: యాదోం కీ బారాత్ (1973)
ప్రేమ జంట: ధర్మేంద్ర, జీనత్ అమన్
స్వర సారథ్యం: రాహుల్ దేవ్ బర్మన్
సాహిత్యం: మజ్రూ సుల్తాన్
గానం:  మొహమ్మద్ రఫీ, ఆశా భోంస్లే

చురా లియా హై తుమ్నే జో దిల్ కో...నజర్ నహీ చురానా సనమ్
ప్రేమంటే ఉప్పెన! తియ్యటి ఉప్పెన! కొట్టుకుపోవాల్సిందే! ఊపిరాడదు.. ఆకలేయదు.. దాహముండదు. నీ మీద నాకెంత ప్రేమ ఉందో ఎలా తేల్చాలి! దేంతో కొలవాలి! నా చూపుల భాష అర్థమైతే, నా హృదయంలోని గాఢత తెలిస్తే... ఈ ప్రశ్నలే ఉండవు.
నిజమో కాదో.. ఈ పాట వింటూ తేల్చుకోవాలి.
**********************
సినిమా పేరు: మైనే ప్యార్ కియా (1989)
ప్రేమ జంట: సల్మాన్‌ఖాన్, భాగ్యశ్రీ
స్వర సారథ్యం: రామ్-లక్ష్మణ్
సాహిత్యం: అసాద్ బోపల్లి
గానం: లతా మంగేష్కర్, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
దిల్ దీవానా
బిన్ సజ్‌నా కే..
ఏ పగ్‌లా హై
సమ్‌జానే సే..

ఇన్నాళ్లూ ఈ గుండె లబ్‌డబ్‌మనే కొట్టుకుంది. ఇప్పుడేమో శ్రుతి మార్చి లవ్ లవ్ అంటోంది. ఎందుకిదంతా? అసలేం జరిగింది? నువ్విటొచ్చాకే ఇదంతా జరిగింది కదూ! కానీ బావుంది. మళ్లీ మళ్లీ కావాలి. నీ ప్రేమతోనే ఈ గుండె నిండాలి.     ఈ పాటతో కూడా...!
**********************
సినిమా పేరు: 1942... ఎ లవ్‌స్టోరీ (1994)
ప్రేమ జంట: అనిల్‌కపూర్,
మనీషా కొయిరాలా
స్వర సారథ్యం:
ఆర్.డి. బర్మన్
సాహిత్యం: జావేద్ అక్తర్
గానం: కుమార్ సాను
ఏక్ లడ్‌కీ కో దేఖా తో ఐసా లగా..
జైసే ఖిల్‌తా గులాబ్...

ఇప్పుడే ఒకమ్మాయిని చూశా.. అప్పుడే అరవిరిసిన గులాబీలా ఉంది. కవి ఊహల్లోంచి ఉరికొచ్చిన కవితా జలపాతంలా ఉంది. తళుక్కున మెరిసే ఉదయ రవికిరణంలా ఉంది. ఈ గులాబీ పరిమళాన్ని ఆస్వాదించాలి. ఈ జలపాతంలో తనివి తీరా తడిసి ముద్దవ్వాలి. ఈ కిరణపు నునువెచ్చని చెక్కిలిపై ఓ ముద్దు అవ్వాలి. ఈ పాట వింటూ ఆ అమ్మాయి మనసు వాకిట ముందు నిలిచి మెల్లిగా తలుపు తట్టండి.
**************************
సినిమా పేరు: దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే(1995)
ప్రేమ జంట: షారుక్ ఖాన్, కాజోల్
స్వర సారథ్యం: జతిన్-లలిత్
సాహిత్యం: ఆనంద్ బక్షి
గానం: కుమార్ సాను, లతా మంగేష్కర్
తుజే దేఖా తో యే జానా సనమ్.. ప్యార్ హోతా హై దీవానా సనమ్
ప్రేమ అంటే ఏంటి? పిచ్చా? నువ్వు ఏదైనా అనుకో.. నాకు మాత్రం నువ్వు కావాలి. నీ నవ్వులకు ఈ దోసిలి చాలదనుకుంటే, మొత్తం మనసునే పరిచేస్తాను. ఒక్క కౌగిలి ఇవ్వు. సమస్తాన్నీ జయించేస్తాను. ఛా.. నిజమా! అనిపిస్తోందా? ప్రేమంటే పిచ్చి? కానీ ఈ పాట మాత్రం పిచ్చి కాదు.. ప్రేమే!