‘సినీ కార్మికుల కోసం స్టార్లు కదలాలి’

20 Mar, 2020 14:21 IST|Sakshi

ముంబై : కరోనా మహమ్మారి సినీ పరిశ్రమపై పెనుప్రభావం చూపుతోంది. సినిమా షూటింగ్‌లు, రిలీజ్‌లు నిలిచిపోవడంతో పాటు థియేటర్లు మూతపడటం బాలీవుడ్‌కు తీవ్ర నష్టాలను మిగిల్చింది. ఇటీవల విడుదలైన భాగీ 3, అంగ్రేజి మీడియం వంటి సినిమాలు నష్టాలను మూటగట్టుకున్నాయి. ఈనెల 31న థియేటర్లను తిరిగి తెరిచిన తర్వాత ఆయా సినిమాలను రీ రిలీజ్‌ చేసేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వ మార్గదర్శకాలతో వినోద పరిశ్రమ ఈ నిర్ణయాలు తీసుకున్నా దినసరి కార్మికుల పరిస్థితిపై మాత్రం సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

ఫ్లడ్‌లైట్ల వెలుతురులోనే కడుపు నింపుకునే సినీ కార్మికులకు ఇప్పుడు పూట గడవని పరిస్థితి. కరోనా దెబ్బకు స్పాట్‌ బాయ్‌లు, కార్పెంటర్లు, లైట్‌మెన్లు, స్టంట్‌మెన్‌లు, పెయింటర్లు వంటి దినసరి కార్మికులు విలవిలలాడుతున్నారు. సినీ పరిశ్రమలో దినసరి వేతనంతో పనిచేసే కార్మికులను ఆదుకునేందుకు సంక్షేమ నిధిని భారత నిర్మాతల మండలి ఏర్పాటు చేసినా కార్మికులకు తిరిగి పని దొరికేవరకూ వారికి కొంత డబ్బును అందించేందుకు దర్శక నిర్మాతలు ముందుకు రావాలని సినీ విశ్లేషకులు తరణ్‌ ఆదర్శ్‌ కోరారు.

షారుక్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, అమీర్‌ ఖాన్‌, దీపికా పడుకోన్‌, వరుణ్‌ ధావన్‌, విక్కీకౌశల్‌ వంటి అగ్ర తారలు సినీ పరిశ్రమలో పనిచేసే దినసరి కార్మికులను ఆదుకునేందుకు ముందుకు రావాలని సినీ విమర్శకులు కోమల్‌ నహతా పిలుపు ఇచ్చారు. కరోనా ప్రభావంతో బాలీవుడ్‌ రూ 800 కోట్ల వరకూ నష్టపోతుందని నహతా అంచనా వేశారు. మరోవైపు టాప్‌ స్టార్లు రూ కోటి నుంచి రూ 1.5 కోట్ల వరకూ విరాళాలుగా ఇస్తే సినీ కార్మికులకు ఊరటగా ఉంటుందని అన్నారు. కేవలం డబ్బు సాయమే కాకుండా నిత్యావసర సరుకులు కూడా వారికి పంపిణీ చేయాలని సినీ నిపుణులు అతుల్‌ మోహన్‌ ఆకాంక్షించారు.

చదవండి : కరోనా దెబ్బ: సినిమా షూటింగ్‌లు బంద్‌

>
మరిన్ని వార్తలు