బిగ్‌బాస్‌కు బిగ్‌ షాక్‌..

7 Oct, 2019 20:22 IST|Sakshi

ముంబై : ప్రముఖ రియాల్టీ షో బిగ్‌బాస్‌పై దుమారం రేగుతోంది. అశ్లీలం శ్రుతిమించిందని ఆరోపిస్తూ హిందీ బిగ్‌బాస్‌ సీజన్‌ 13ను నిషేధించాలని అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ) కేంద్ర సమాచార ప్రసార మంత్రి ప్రకాష్‌ జవదేఖర్‌కు రాసిన లేఖలో విజ్ఞప్తి చేసింది. ఓ ప్రైవేట్‌ ఛానల్‌లో ప్రసారమవుతున్న బిగ్‌బాస్‌ షో కుటుంబంలో అందరితో కలిసి చూసేందుకు అభ్యంతరకరంగా ఉందని అశ్లీల ధోరణిలో సాగుతోందని సీఏఐటీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ రియాలిటీ షో మన పురాతన సాంస్కృతిక, సంప్రదాయాలను మంటగలిపేలా ఉందని మండిపడింది. టీఆర్‌పీ, లాభాల వేట కోసం విలువలను గాలికొదిలేసే విధానాన్ని భారత్‌ వంటి భిన్న సంస్కృతులకు నిలయమైన దేశంలో అనుమతించరాదని కోరింది. బిగ్‌బాస్‌ కాన్సెప్ట్‌ తీవ్ర అభ్యంతరకరమని, టెలివిజన్‌ ప్రపంచంలో నైతిక విలువలకు ఇది పూర్తి విరుద్ధమని పేర్కొంది. ఈ షో ప్రైమ్‌టైమ్‌లో ప్రసారమవతుందన్న ఇంగితం నిర్వాహకులకు లేకపోవడం దురదృష్టకరమని పేర్కొంది. బిగ్‌బాస్‌ షో అన్ని విలువలకు తిలోదకాలిచ్చిందని దుయ్యబట్టింది.

మరిన్ని వార్తలు