త్రిష జీవితంలో రామ్‌ ఎవరు?

25 Oct, 2018 11:05 IST|Sakshi

సినిమా: 96 చిత్రం చూసిన తరువాత ఆ చిత్ర కథానాయకి త్రిష నిజ జీవితంలో రామ్‌ ఎవరన్న ప్రశ్న ఆమె అభిమానుల్లో తలెత్తుతోంది. విజయ్‌సేతుపతి, త్రిష జంటగా నటించిన చిత్రం 96. ఇటీవల ఎలాంటి అంచనాలు లేకుండా తెరపైకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల విశేష ఆదరణను పొందుతోంది. ఈ చిత్రంలోని కళాశాల సన్నివేశాల్లో విజయ్‌సేతుపతి, త్రిష పాత్రలను యువత తమలో చూసుకుని ఎంజాయ్‌ చేస్తున్నారనే చెప్పాలి. అందుకే ఈ చిత్రానికి అంత ఆదరణ లభిస్తోంది. 96 చిత్ర విడుదలకు ముందే దీని తెలుగు రీమేక్‌ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్‌రాజు పొందారంటే కథ, కథనాల్లో ఎంత నవ్యత ఉందనేది అర్థం అవుతుంది. ఇందులో హీరో పేరు రామ్‌. చిత్రం చూసిన పెళ్లి కాని అమ్మాయిలు తమకు రామ్‌ లాంటి భర్త లభిస్తే బాగుండు అని ఆశ పడుతున్నారంటే 96 చిత్రం వారిపై ఎంత ప్రభావం చూపుతుందో అర్థం అవుతోంది. ఇక ఇందులో నటి త్రిష పాత్ర విరామానికి కొంచెం ముందే ఎంటర్‌ అవుతుంది. అయినా ఆ పాత్ర త్రిషకు ఎంతో పేరును తెచ్చి పెట్టింది. ఇందులో త్రిష పాత్ర పేరు జాను. ఆమె ఇంతకు ముందు విన్నైతాండి వరువాయా చిత్రంలో జెస్సీ అనే ప్రేమికురాలి పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.

ఇప్పటి వరకూ జెస్సీ పాత్ర త్రిష జీవితంలో చెరిగిపోలేదు. అయితే 96లో జాను పాత్ర అంతకంటే మంచి పేరును తెచ్చి పెట్టింది. ఈ తరంలో అభినయంతో చిత్రాన్ని విజయతీరాలకు చేర్చే నటి నయనతారనే అనే అనుకున్న వాళ్లు జాను పాత్రలో త్రిష హావభావాలను చూసిన తరువాత మంచి పాత్రలు అమిరితే ఈమె కూడా అద్భుత అభినయాన్ని చాటగలదనే అభిప్రాయం సినీ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ కలుగుతోంది. 96 చిత్రంలో జాను పాత్రను అంతగా అనుభవించిన నటించిన త్రిష నిజజీవితంలో రామ్‌ ఉన్నాడా అనే ప్రశ్న ఆమె అభిమానుల్లో అనుమానం రేకెత్తిస్తోంది. దీనికి ఈ బ్యూటీ ఏం చెప్పిందంటే నేను చదివింది గరల్స్‌ స్కూల్, కాలేజీనేనని, అందువల్ల రామ్‌ లాంటి లవర్‌ తన నిజ జీవితంలో లేడని స్పష్టం చేసింది. 96 లాంటి హిట్‌ చిత్రం తరువాత త్రిషకు మరింత క్రేజ్‌ పెరిగిందని చెప్పవచ్చు. అంతే కాకుండా ప్రస్తుతం ఈ జాణ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు జంటగా పేట చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రంపై అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో త్రిష మరో రౌండ్‌ కొట్టే అవకాశం ఉందనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.

మరిన్ని వార్తలు