ఉందా..లేదా!

11 Jan, 2018 01:19 IST|Sakshi

తమిళసినిమా: సామి–2 చిత్రంలో నటి త్రిష ఉందా? లేదా? అన్న అయోమయం కొనసాగుతోంది. 2003లో విక్రమ్, త్రిష జంటగా నటించిన చిత్రం సామి. హరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించి విక్రమ్‌కు మాస్‌ ఇమేజ్‌ను, త్రిష స్టార్‌ ఇమేజ్‌ను తెచ్చి పెట్టింది. దాదాపు 15 ఏళ్ల తరువాత ఆ చిత్రానికి సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు హరి. పులి, ఇరుముగన్‌ చిత్రాల తరువాత శిబు తమీన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విక్రమ్‌కు జంటగా త్రిష, మరో కథానాయకిగా కీర్తిసురేశ్‌ నటించడానికి అంగీకరించారు. ఆ తరువాత నటి త్రిష చిత్రం నుంచి తప్పుకున్నారు. ఈ వ్యవహారం పెద్ద వివాదానికి దారి తీసింది. నటుడు విక్రమ్‌ స్వయంగా త్రిషతో మాట్లాడి నటింపజేసే ప్రయత్నం చేశారనే ప్రచారం జరిగింది.

అయినా ఆమె ససేమిరా అనడంతో చేసేదేమీ లేక చిత్ర నిర్మాత నిర్మాతల మండలిలో త్రిషపై ఫిర్యాదు చేశారు. దీంతో మండలి నిర్వాహకులు త్రిషతో చర్చించి సమస్యను పరిష్కరించి నటించడానికి ఒప్పించినట్లు టాక్‌. దీంతో త్రిష సామి–2లో నటిస్తున్నారని దర్శకుడు హరి ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో త్రిష వర్గం మాత్రం సామి–2లో తాను నటించడం లేదని ముందు చెప్పినట్లు, తిరిగి ఆ చిత్రంలో నటించే ప్రసక్తే లేదని అంటున్నారు. త్రిష కనుక తమ చిత్రంలో నటించకపోతే తమకు ఏర్పడిన నష్టాన్ని చెల్లించాలని నిర్మాత డిమాండ్‌ చేసినట్లు కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. అయితే తాను అలా అనలేదని నిర్మాత ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దీంతో సామి–2 చిత్రంలో త్రిష ఉన్నట్టా? లేనట్టా అన్న అయోమయం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం దర్శకుడు హరి విక్రమ్, కీర్తీసురేశ్‌లకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా