దర్శకుడు శరవణన్‌కు ఓకేనా! 

14 Feb, 2019 06:53 IST|Sakshi

చెన్నై చిన్నది త్రిష కొత్త చిత్రానికి పచ్చజెండా ఊపిందన్నది లేటెస్ట్‌ న్యూస్‌. ఈ సంచలన నటిని అపజయాల బాట నుంచి తప్పించిన చిత్రం 96. ఆ తరువాత రజనీకాంత్‌తో నటించాలన్న తన చిరకాల ఆకాంక్షను పేట చిత్రం తీర్చింది. ఈ చిత్ర విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీకి అవకాశాలు వరుస కడుతున్నాయి. అలాంటి వాటిలో శరవణన్‌ దర్శకత్వం వహించనున్న చిత్రం ఒకటని తెలిసింది. దర్శకుడు శరవణన్‌ గురించి చెప్పాలంటే ఈయన ఏఆర్‌.మురుగదాస్‌ శిష్యుడు. ఇంతకు ముందు ఎంగేయుమ్‌ ఎప్పోదుమ్‌ వంటి విజయవంతమైన చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమై ఆ తరువాత ఇవన్‌ వేరమాదిరి, వలియవన్‌ చిత్రాలను తెరకెక్కించారు.

అయితే ఈ రెండు చిత్రాలు ఆశించిన సక్సెస్‌ను అందుకోలేదు. దీంతో శాండిల్‌వుడ్‌కు వెళ్లారు. అక్కడ ఎంగేయుమ్‌ ఎప్పోదుమ్‌ చిత్రాన్ని పునీత్‌ రాజ్‌కమార్‌ హీరోగా చక్రవ్యూహ పేరుతో రీమేక్‌ చేశారు. అది యావరేజ్‌ చిత్రమే అయ్యింది. అనంతరం శరవణన్‌ రోడ్డు ప్రమాదానికి గురై ఆస్పత్రి పాలయ్యారు. ఇటీవలే పూర్తి ఆరోగ్యంతో ఇంటికి చేరిన శరవణన్‌ ఆస్పత్రిలో ఉండగా ఒక కథను తయారు చేసుకున్నారట. హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథాంశంతో కూడిన ఈ కథను త్రిషకు వినిపించగా ఆమె అందులో నటించడానికి ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం త్రిష నటించిన గర్జన,చతురంగవేట్టై–2 చిత్రాలు విడుదల కావాల్సిఉండగా, 1818, పరమపదం విళైయాట్టు చిత్రాల్లో నటిస్తోంది.
 

మరిన్ని వార్తలు