గర్జించే టైమ్‌ వచ్చింది!

17 Jun, 2019 11:52 IST|Sakshi

తమిళసినిమా: నటి త్రిష గర్జించే టైమ్‌ వచ్చింది. ఈ అమ్మడికి ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌ గాడిలో పడిందన్న విషయం తెలిసిందే. విజయ్‌సేతుపతితో ప్రేమను పండించిన 96 చిత్రం, రజనీకాంత్‌తో జత కట్టిన పేట చిత్రాల విజయాలు ఈ బ్యూటీకి నూతన ఉత్సాహాన్నిచ్చాయనే చెప్పాలి. ఇంతకుముందు తమిళంలో పాటు తెలుగు, కన్నడం, హిందీ భాషల్లో నటించిన త్రిష ప్రస్తుతం కోలీవుడ్‌పైనే పూర్తిగా దృష్టి పెడుతోంది. అదే విధంగా తమిళంలో చేతినిండా చిత్రాలున్నాయి కూడా. ఈ చెన్నై చిన్నది నటించిన పరమపదం విళైయాడు చిత్రం నిర్మాణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతోంది.

కాగా ప్రస్తుతం ఎంగేయుం ఎప్పోదుం చిత్రం ఫేమ్‌ శరవణన్‌ దర్శకత్వంలో హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రం రాంగీలో నటిస్తోంది. దీనితో పాటు నటి సిమ్రాన్‌తో కలిసి మరో చిత్రంలోనూ నటిస్తోంది. కాగా ఈ సంచలన నటి నటించిన గర్జన చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్నా విడుదలలో జాప్యం జరుగుతూ వస్తోంది. ఇదీ హీరోయిన్‌ సెంట్రిక్‌ కథా చిత్రమే. సుందర్‌బాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సెంచరీ ఇంటర్నేషనల్‌ ఫిలింస్‌ సంస్థ నిర్మించింది. కాగా ఇది హిందీలో నటి అనుష్కశర్మ హీరోయిన్‌గా నటించిన ఎన్‌హెచ్‌ 10 చిత్రానికి రీమేక్‌ అన్నది గమనార్హం. ఇందులో నటి త్రిష యాక్షన్‌ సన్నివేశాల్లోనూ నటించిందట. అమిత్‌భార్గవ్, వంశీకృష్ణ ఇతర ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఇప్పుడు మోక్షం కలిగింది. దీని విడుదల హక్కులను ఎస్‌ఓడీ పిక్చర్స్‌ సంస్థ సొంతం చేసుకుంది. గర్జన చిత్ర విడుదల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ఈ సంస్థ నిర్వాహకులు తెలిపారు. నటి త్రిష సెంట్రిక్‌ కథా పాత్రల్లో నటించిన నాయకి, మోహిని వంటి చిత్రాలు నిరాశ పరచాయి. తాజాగా గర్జన చిత్రం అయినా ఈ బ్యూటీని హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ చిత్రాల నాయకిగా సక్సెస్‌ను అందిస్తుందేమో చూడాలి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా