‘నాకు ఆ హక్కు ఉంది’

28 Nov, 2017 18:09 IST|Sakshi

తమిళసినిమా: చెన్నై చిన్నది త్రిష నాకు ఆ హక్కు ఉందని అంటోంది. సంచలనాలకు కేంద్ర బిందువుగా పేరు పొందిన నటీమణుల్లో ముందు ఉంటుంది. ఈ చిన్నది ఇటీవల కాలంలో కాస్త సైలెంట్‌ అయ్యిందనుకుంటున్న సమయంలో అలా ఉండటం నా వల్లకాదు అన్నట్లుగా మళ్లీ వివాదాల్లోకి వచ్చేసింది. విక్రమ్‌, త్రిష జంటగా నటించిన సామి చిత్రం అప్పట్లో సంచలన విజయాన్ని సాధించింది. హరి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి తాజాగా సీక్వెల్‌ తెరకెక్కుతోంది. ఇందులో విక్రమ్‌కు జంటగా నటి త్రిష, కీర్తీ సురేశ్‌లను నాయికలుగా ఎంపిక చేశారు. ఇంతకు ముందు విక్రమ్‌తో ఇరుముగన్‌ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన శిబు తమీన్‌ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 

కాగా చిత్రం షూటింగ్‌కు రెడీ అవుతున్న సమయంలో అనూహ్యంగా త్రిష మీతో నాకు సెట్‌ కాలేదంటూ వైదొలిగింది. దీంతో షాక్‌కు గురైన చిత్ర నిర్మాత నిర్మాతల మండలిలో త్రిషపై ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో వివరణ కోరుతూ నిర్మాతల మండలి త్రిషకు నోటీసులు జారీ చేసింది. ఈ చిత్రంలో నటి కీర్తీసురేశ్‌కు అధిక ప్రాముఖ్యత ఉందని, ఆమె కంటే తనకు సన్నివేశాలు తక్కువగా ఉన్నందునే చిత్రం నుంచి తప్పుకున్నట్లు త్రిష పేర్కొన్నట్లు ప్రచారం జరిగింది. అయితే అసలు కారణం అది కాదని ఆమె చెప్పింది. 

సోమవారం నిర్మాతలమండలి నోటీస్‌కు బదులిచ్చిన త్రిష అందులో పేర్కొంటూ తాను సామి -2 చిత్రంలో ఒక్క సన్నివేశంలో కూడా నటించలేదని, అందువల్ల ఆ చిత్రం నుంచి వైదొలిగే హక్కు తనకు ఉందని చెప్పింది. అంతే కాదు తాను తీసుకున్న అడ్వాన్స్‌ను తిరిగి ఇచ్చేస్తానని, వ్యక్తిగత కారణాల వల్లే తాను సామి -2 చిత్రం నుంచి తప్పుకున్నట్లు వివరణ ఇచ్చిందట. అయితే త్రిష వివరణకు నిర్మాతల మండలి సంతృప్తి చెందిందో లేదో తెలియదుగాని, సామి -2 చిత్రంలో ఆమెను నటింపజేయడానికి సామరస్య చర్చలు మాత్రం జరుగుతున్నాయని సమాచారం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా