త్రిష పరమపదంకు టైమ్‌ వచ్చింది

12 Jan, 2020 07:43 IST|Sakshi
త్రిష

నటి త్రిష పరమపదం విళైయాట్టుకు టైమ్‌ వచ్చింది. ఈ చెన్నై చిన్నది ప్రస్తుతం రాంగీ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉంది. కాగా త్రిష ఇంతకుముందు నటించిన రెండు, మూడు చిత్రాలు నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు ఎదురుచూస్తున్నాయి. అందులో ఒకటి పరమపదం విళైయాట్టు. విశేషం ఏమిటంటే ఇది ఈ బ్యూటీకి 60వ చిత్రం కావడం. ఈ చిత్ర ట్రైలర్‌ ఇప్పటికే విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. కే.తిరుజ్ఞానం తెరకెక్కించిన ఈ చిత్రంలో త్రిషతో పాటు నటుడు నందా, బేబీ మానసి, రిచర్డ్, ఏఎల్,అళగప్పన్, వేల రామమూర్తి ముఖ్య పాత్రల్లో నటించారు. 24 హెచ్‌ఆర్‌ఎస్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి అమ్రేశ్‌  సంగీతాన్ని అందించారు.

ఇది యథార్థ సంఘటన ఇతివృత్తంతో తెరకెక్కించిన చిత్రం అని దర్శకుడు తెలిపారు. నటి త్రిష ఇందులో డాక్టర్‌గా నటించారని, కొందరు ఆమెను కిడ్నాప్‌ చేయడంతో వారెవరు, ఆమెను ఎందుకు కిడ్నాప్‌ చేశారు? వారి నుంచి ఎలా తప్పించుకుందన్న పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన చిత్రంగా  పరమపదం విళైయాట్టు చిత్రం ఉంటుందని చెప్పారు. కాగా త్రిష నటించిన హీరోయిన్‌ సెంట్రిక్‌ కథా చిత్రం ఇది. నిజం చెప్పాలంటే ఈ బ్యూటీ నటించిన హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రాలు ఇప్పటి వరకూ సక్సెస్‌ కాలేదు. దీంతో పరమపదం విళూయాట్టు చిత్రంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. చిత్రంలో యాక్షన్‌ సన్నివేశాలు కూడా చోటుచేసుకుంటాయని తెలిసింది. కాగా చాలా కాలంగా విడుదల కోసం ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది.

చిత్రాన్ని ఈ నెల 31వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాతల వర్గం అధికారికంగా ప్రకటించారు. కాగా దీని తరువాత నటి త్రిష నటించిన గర్జన విడుదల కావలసి ఉంది. ఇదీ హీరోయిన్‌ సెంట్రిక్‌ కథా చిత్రమే. ఇకపోతే ప్రస్తుతం నటిస్తున్న రాంగీ చిత్రం కూడా హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రమే కావడం విశేషం. మరో విషయం ఏమిటంటే నటి త్రిష ఈ మధ్య నటించిన 96, పేట చిత్రాలు మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు పరమపదం విళూయాట్టు చిత్రానికి ఆ మ్యాజిక్‌ పని చేస్తుందనే నమ్మకంతో త్రిష ఉంది. ఈ చిత్రం హిట్‌ అయితే కొత్త సంవత్సరంలోనూ త్రిష సక్సెస్‌ పయనం కొనసాగినట్లే అవుతుంది. అన్నట్టు ఈ బ్యూటీ చాలా కాలం తరువాత తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవితో జత కట్టనుంది. 

మరిన్ని వార్తలు