నా జీవితంలో ఇదే అతి పెద్ద బిరుదు

18 Sep, 2019 03:58 IST|Sakshi
రఘురామకృష్ణంరాజు, టీజీ వెంకటేశ్, మురళీమోహన్, టీఎస్సార్, రాజశేఖర్, జయసుధ, రాధిక, జమున, రోజా, జయప్రద

‘‘ఇన్నేళ్ల నా సినీ జీవితంలో అతి పెద్ద గిఫ్ట్‌ అంటే అభినయ మయూరి బిరుదే’’ అని సహజ నటి జయసుధ అన్నారు. విశాఖలో మంగళవారం టి.సుబ్బిరామిరెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా నటి జయసుధకు అభినయ మయూరి  బిరుదును ప్రదానం చేశారు. ఈ సందర్బంగా జయసుధ మాట్లాడుతూ – ‘‘నన్ను సినీ పరిశ్రమలోకి తీసుకు వచ్చిన విజయనిర్మల (దివంగత నటి, దర్శకురాలు) ఆంటీ ఈ బిరుదు ప్రదానోత్సవంలో లేకపోవటం నాకు చాలా వెలితిగా ఉంది. నా తొలి సినిమా ‘పండంటి కాపురం’లో జమున నా తల్లి పాత్ర పోషించారు. అప్పుడు నా వయసు 12 ఏళ్లు. ఇన్నేళ్ల తరువాత నా బిరుదు ప్రదానోత్సవంలో ఆమె పాల్గొనటం చాలా అదృష్టంగా భావిస్తున్నా. సినీ జీవితంలో చాలా మంది స్నేహితులు ఉంటారు.

కానీ అందులో కొంత మంది మాత్రమే మన నిజ జీవితంలో కూడా ఉంటారు. నాకు జయప్రద, రాధిక, మురళీమోహన్‌ అలాంటివారే. వారు నా  జీవితంలోని అన్ని విషయాల్లో భాగస్వామ్యంగా ఉన్నారు. గత 40 ఏళ్లుగా టీఎస్సార్‌ (టి. సుబ్బిరామిరెడ్డి) నిర్వహించే అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. ఏనాడూ ఆయన్ని నేను ఏమీ అడగలేదు. కానీ ఇంత మంది ప్రముఖల సమక్షంలో నాకు ఈ బిరుదు ప్రదానం చేసి నాలోని ఉత్సహాన్ని నింపారు. ఆయన తన పుట్టిన రోజు వేడుకలను ఎక్కడైనా చేసుకోవచ్చు కానీ వైజాగ్‌ అంటే ఆయనకు ఎనలేని ప్రేమ. అందుకే అన్ని వేడుకలు విశాఖలోనే జరుపుకుంటారు’’ అన్నారు. వేదికపై ప్రసంగిస్తున్నప్పుడు నటుడు రాజశేఖర్‌ పేరు చెప్పబోయి రాజశేఖర్‌ రెడ్డి అని జయసుధ సంభోదించారు. దీనితో వైఎస్సార్‌ ఆశీస్సులు కూడా తనపై ఉన్నాయని అందుకునే తన నోట వెంట ఆయన పేరు వచ్చిందని జయసుధ అన్నారు. 

►నటి జమున మాట్లాడుతూ ‘‘జయసుధను ఎందుకు అందరూ సహజ నటి అంటారు.. మేము కాదా అనిపించేది. కానీ ఆమె తక్కువ మేకప్‌తో ఎక్కవ నటన ప్రదర్శించి ప్రేక్షకుల మనస్సులను దోచుకోవటం వలనే ఆ బిరుదు వచ్చిందని గ్రహించడానికి ఎక్కువ సమయం పట్టలేదు. కళాకారులకు ఇలాంటి అవార్డులు, బిరుదుల ప్రదానం వలన ప్రోత్సాహం, ఎంతో ఉత్సాహం లభిస్తుంది’’ అన్నారు.

►నటి శారద మాట్లాడుతూ ‘‘ఒక చిత్రంలో నేను జయసుధ చెంప పై గట్టిగా కొట్టాలి. ఆ సన్నివేశంలో ఆమె నటించిన తీరు ఆద్భుతం’’ అని చెప్పారు. 

కళ ఒక మహాశక్తి: టీఎస్సార్‌
టి. సుబ్బిరామి రెడ్డి మాట్లాడుతూ –‘‘కళ ఒక మహా శక్తి అని నేను నమ్ముతాను. అందుకే కళాకారులను ప్రోత్సహిస్తాను. సర్వమతాల సారాంశం ఒక్కటే. అందుకే అన్ని మతాల గురువులను సన్మానించాను. అందరూ ప్రతీ సంవత్సరం జన్మదినం జరుపుకుంటారు. అయితే అటువంటి కార్యక్రమాలు నలుగురికి  ఉపయోగపడేలా చేసుకోవాలని ఆలోచించుకోవాలి. అక్కినేని నాగేశ్వరరావు నాకు మంచి స్నేహితుడు. ఆయన స్ఫూర్తితోనే ఈ విధంగా నలుగురి మధ్యలో నా జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఏం సాధించాం, ఏం సా«ధించబోతున్నాం అని నెమరువేసుకుంటాను. కొన్నేళ్లుగా  ఇలా విశాఖ నగరవాసుల మ«ధ్యనే ఈ వేడుకలు జరుపుకుంటూ గొప్ప గొప్ప కళాకారులను సన్మానిస్తున్నాను.

ఈ ఏడాది జయసుధకు అభినయ మయూరి బిరుదు అందించడం ఆనందంగా ఉంది. జయసుధ సౌమ్యురాలు. ఆమె అందరికీ మంచి స్నేహితురాలు. ఆమె అన్ని పాత్రల్లోనూ జీవించారు’’ అని చెప్పారు.ఈ వేడుకల్లో భాగంగా జయసుధకు బంగారు కంకణాన్ని బహుకరించారు. 20 నిముషాలపాటు టీఎస్సార్‌ చేసిన ఓంకారం వీక్షకులను ఆకట్టుకుంది.ఈ వేడుకలో టీటీడీ ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి, హాస్యనటుడు బ్రహ్మానందం, రాజశేఖర్, శరత్‌ కుమార్, జయప్రద, రాధిక, జీవిత, ఏపీఐఐసీ ఛైర్మన్‌ రోజా తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు