టీయస్సార్‌ మీద బయోపిక్‌ తీయాలి

13 Jan, 2019 03:28 IST|Sakshi
పరుచూరి గోపాలకృష్ణ, టి.సుబ్బరామిరెడ్డి, పింకీ రెడ్డి, మీనా, నగ్మ, శోభన కామినేని

పరుచూరి గోపాలకృష్ణ

2010 నుంచి కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి టీవీ 9తో కలసి ‘టీయస్సార్‌ – టీవీ9 నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌’ పేరుతో అవార్డ్‌ ఫంక్షన్‌ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 2017–2018 సంవత్సరానికి సంబంధించిన అవార్డులను వచ్చే నెల 17న విశాఖపట్టణంలో నిర్వహించనున్నారు. ఈ అవార్డ్స్‌ జ్యూరీ చైర్మన్‌గా టీయస్సార్‌ వ్యవహరించనున్నారు. పరుచూరి గోపాలకృష్ణ,  కేయస్‌ రామారావు, నరేశ్,  రఘురామ కృష్ణంరాజు, కామినేని శోభనా, జీవిత, నగ్మా, మీనా, జ్యూరీ సభ్యులు.

అవార్డు వేడుక వివరాలు తెలియజేయడానికి హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో టీయస్సార్‌ మాట్లాడుతూ – ‘‘సినిమా పవర్‌ఫుల్‌ మీడియమ్‌. కోట్లాది మందిని ఆనందింపజేస్తుంది. కళాకారులని జనం అభిమానిస్తారు, ఆరాధిస్తారు. అలాగే మా అవార్డ్స్‌ ఫంక్షన్‌లో నిర్ణయం కూడా ప్రజలదే. వాళ్ల    ఓటింగ్‌ని పరిగణించి జ్యూరీ సభ్యులు విజేతలను ప్రకటిస్తారు. కళాకారులు ఆనందం పొందితే నాకు కొత్త శక్తి వస్తుంది. విద్యాబాలన్‌కు శ్రీదేవి మెమోరియల్‌ అవార్డ్‌ అందిస్తాం’’ అన్నారు.

‘‘బ్రతికున్నంత కాలం అవార్డులు గెలవడానికి ప్రయత్నిస్తాం’ అని అక్కినేని నాగేశ్వరరావుగారు ఓసారి నాతో అన్నారు. కళాకారుల ఆకలి అలాంటిది. ఆ కళాకారుల ఆకలి తీరుస్తున్నారు సుబ్బరామిరెడ్డిగారు. శివుణ్ణి నటరాజు అంటాం. ఆయన్ను ఆరాధిస్తూ, ఆయన ఆజ్ఞాపించిందే చేస్తున్నారు టీయస్సార్‌గారు. ఈయన జీవితం ఆధారంగా బయోపిక్‌ తీయాలి’’ అన్నారు పరుచూరి గోపాలకృష్ణ. ‘‘టీయస్సార్‌గారు నాకు 25 ఏళ్లుగా తెలుసు. ఆయన నిర్మించిన ‘గ్యాంగ్‌మాష్టార్‌’ సినిమాలో యాక్ట్‌ చేశాను. మళ్లీ ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది’’ అన్నారు నగ్మా.

‘‘చలికి దుప్పట్లు, కళాకారులకు చప్పట్లు ముఖ్యం’’ అన్నారు నరేశ్‌.  ‘‘నాన్నగారి అడుగు జాడల్లోనే నడుస్తున్నాను. కళాకారులను అభినందించడానికి ఎంతో శ్రమపడతారు నాన్న. నాన్నగారి ఆటోబయోగ్రఫీ రాయిస్తున్నాం. ‘టీచింగ్స్‌ ఆఫ్‌ టీయస్సార్‌’ పేరుతో ఆ బుక్‌ ఈ ఏడాది తీసుకొస్తాం’’ అన్నారు పింకీ రెడ్డి. ‘‘గవర్నమెంట్లు నంది అవార్డ్స్‌ ఫంక్షనే వరుసగా చేయలేకపోతున్న తరుణంలో టీయస్సార్‌ వరుసగా ఈ అవార్డ్‌ పంక్షన్స్‌ చేయడం అభినందనీయం’’ అన్నారు నిర్మాత కేయస్‌ రామారావు. ‘‘హైదరాబాద్‌ వచ్చి చాలా రోజులైంది. సంతోషంగా ఉంది. మమ్మల్ని జ్యూరీ సభ్యులుగా నియమించినందుకు మా బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తాం’’ అన్నారు మీనా. ఈ కార్యక్రమంలో కామినేని శోభన పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు