మెరిసిన తారాలోకం

18 Feb, 2019 07:30 IST|Sakshi

వేడుకగా టీఎస్సార్‌–టీవీ9 నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డుల బహూకరణ ఉత్సవం

పోర్టు స్టేడియానికి తరలివచ్చిన ప్రసిద్ధ నటీనటులు

సుబ్బరామి రెడ్డిపై ఆహూతుల ప్రశంసల జల్లు

వేదికపై కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాల విరిజల్లు

వెండితెర తారలు తళుక్కున మెరిశారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 56 మంది ప్రముఖ సినీ నటీనటులు ఒకే వేదికపై కనువిందు చేశారు. ఇంతమంది తమ అభిమాన హీరో హీరోయిన్లను చూడటానికి అభిమానులు ఎగబడ్డారు. టి.సుబ్బరామిరెడ్డి కళాపరిషత్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘టీఎస్సార్‌ టీవీ9 నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌’ 2017, 2018 సంవత్సరాలకు ప్రముఖ నటీనటులకు అందజేశారు. స్థానిక పోర్టు స్టేడియంలోఆదివారం రాత్రి ఈ కార్యక్రమం జరిగింది.

అక్కయ్యపాలెం(విశాఖ ఉత్తర): టి.సుబ్బరామి రెడ్డి కళాపరిషత్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘టిఎస్సార్‌ టీవీ9  నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌’ 2017, 2018 సంవత్సరాలకు ప్రముఖ నటీనటులకు అందజేశారు. ఈ వేడుకకు విశాఖ పోర్టు స్టేడియం వేదికగా నిలిచింది. తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నటులుగా వెలుగొందుతున్న చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మోహన్‌బాబు, రాజేంద్రప్రసాద్‌ అభిమానులను  అలరించారు. ఎందరో నటీమణులు కూడా వేదికపై తళుక్కుమన్నారు. ఈ సందర్భంగా సుబ్బరామి రెడ్డి మాట్లాడుతూ కళల్లో ఈశ్వర శక్తి ఉందని, కళాకారులను ప్రోత్సహించడం, ప్రేమించడం ఈశ్వరుని ధ్యానించడమే అన్నారు. అభిమానుల ఆనందమే కళాకారులకు శక్తి అని అన్నారు. వారి ఆనందంకోసం గత పదేళ్లుగా ప్రముఖ సినీ నటులు, నిర్మాతలు, దర్శకులు, సాంకేతిక నిపుణులను సత్కరిస్తున్నట్టు చెప్పారు. మెగాస్టార్‌  చిరంజీవి మాట్లాడుతూ సుబ్బరామి రెడ్డి కళాహృదయానికి ఈ కార్యక్రమం నిదర్శనమన్నారు.

అవార్డుల ప్రదానోత్సవం కనులపండువగా జరిగిందని, ఇంత మంది అభిమానుల ఆనందాన్ని గుండెల్లో నింపుకొని ఇంటికి వెళ్తున్నానని అన్నారు. ముందుగా  పుల్వామా ఘటనలో వీరమరణం పొందిన జవాన్లకు నివాళులు అర్పించారు. మోహన్‌బాబు మాట్లాడుతూ  ఓటు వద్దు, అభిమానం కావాలన్న మహోన్నత వ్యక్తి సుబ్బరామిరెడ్డి అని కొనియాడారు. దాసరి లేని లోటు తీర్చలేనిదని, దాసరి మెమోరియల్‌ అవార్డు అందుకోవడం  అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. నాగార్జున మాట్లాడుతూ తనకు నచ్చిన రంగస్థలం, మహానటి, గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రాలకు అవార్డులు అందజేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా  పలువురు కొరియోగ్రాఫర్లు, సినీ నటులు చేసిన నృత్యాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటీనటులు ప్రియమణి, కుష్బూ, అలీ, విశాల్, రకుల్‌ప్రీత్, కేథరిన్, ప్రీతం కౌర్, రాశీఖన్నా, విద్యాబాలన్, సుమంత్, బోనీకపూర్,  తమన్, ఇళయరాజా,సిరివెన్నెల సీతారామశాస్త్రి,  పరుచూరి గోపాలకృష్ణ, దేవిశ్రీప్రసాద్‌  పాల్గొన్నారు.

కశ్మీర్‌లో అమరులైన జవాన్లకు సినీ ప్రముఖుల నివాళి
కదిలించిన శ్రీదేవి స్మృతులు :భార్య నటించిన చిత్రాల క్లిప్పింగులు చూసి బాధాతప్తుడైన బోనీకపూర్‌

సాక్షి, విశాఖపట్నం: అందాల నటి శ్రీదేవిని విశాఖ మరోసారి స్మరించుకుంది. ఆమెపై తనకున్న అభిమానాన్ని చాటుకుంది. టీఎస్సార్‌–టీవీ–9 జాతీయ సినిమా అవార్డుల ప్రదానం కార్యక్రమంలో శ్రీదేవికి మెమోరియల్‌ అవార్డు ప్రముఖ నటి విద్యాబాలన్‌ను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన శ్రీదేవి భర్త బోనీకపూర్‌ను  అవార్డు అందజేసే సమయంలో వేదికపైకి పిలిచారు. అప్పుడు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, మోహన్‌బాబు, రాజేంద్రప్రసాద్, విద్యాబాలన్‌ తదితరులు వేదికపైనే ఉన్నారు. శ్రీదేవి నటించిన కొన్ని తెలుగు, హిందీ సినిమాల క్లిప్పింగులను తెరపై ప్రదర్శించారు. వాటిని చూసి బోనీకపూర్‌ విషాదంలో మునిగిపోయారు. తన నుంచి దూరమైన జీవిత భాగస్వామిని తెరపై చూసి వేదనతో ఉక్కిరిబిక్కిరయ్యారు. దాంతో ఆయన పలుమార్లు వెనక్కి తిరిగిపోవడం, విషాదంతో పక్కకు వెళ్లడం వంటివి కనిపించాయి.  టి.సుబ్బరామిరెడ్డి బోనీకపూర్‌ భుజంపై చేయి వేస్తూ అనునయించారు. సభకు హాజరైన వారంతా శ్రీదేవిని, ఆమె ప్రతిభను, ప్రాభవాన్ని మరోసారి స్మరించుకున్నారు.

మరిన్ని వార్తలు