నటికి గుండెపోటు.. విషమంగా ఆరోగ్యం

23 Nov, 2019 13:47 IST|Sakshi

ముంబై : ప్రముఖ మోడల్, నటి గెహానా వశిష్ట(31) తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు. గురువారం ఆమెకు గుండెపోటు రావడంతో ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఓ వెబ్‌ సిరీస్‌ కోసం విశ్రాంతి లేకుండా షూటింగ్‌ చేసే సమయంలో బీపీ తగ్గి.. హార్ట్‌ఎటాక్‌ వచ్చినట్లు గెహానా సన్నిహితులు తెలిపారు. తిండిలేకుండా కేవలం డ్రింక్స్‌ తీసుకుంటూ షూటింగ్‌ చేయడంతో ఈ పరిస్థితి తలెత్తిందని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ విషయం గురించి డాక్టర్‌ ప్రణవ్‌ మాట్లాడుతూ... గెహానాను వెంటిలేటర్‌ మీద ఉంచి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆస్పత్రికి తీసుకువచ్చే సమయానికే తన పరిస్థితి విషమంగా ఉందని.. నాడీ కొట్టుకోవడం కూడా ఆగిపోయిందని తెలిపారు. అనంతరం ఎలక్ట్రిక్‌ షాక్‌ ఇవ్వడం ద్వారా గుండె కొట్టుకునేలా చేశామన్నారు.

ఇక ప్రస్తుతం తనకు శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందిగా ఉందని.. గెహానాను బతికించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. గెహానాకు షుగర్‌ ఉందని... 48 గంటల పాటు ఆహారం తీసుకోకుండా ఉన్నందువల్లే ఆరోగ్యం విషమించిందని పేర్కొన్నారు. కాగా వందనా తివారీ గెహానా వశిష్ట అనే స్క్రీన్‌ నేమ్‌తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. మోడల్‌, టీవీ ప్రజెంటర్‌, నటిగా గుర్తింపు పొందారు. తొలుత సీరియళ్లలో కనిపించిన గెహానా.. హిందీ, తమిళ, తెలుగు సినిమాల్లో కూడా నటించారు. ఆపరేషన్‌ దుర్యోదన వంటి సినిమాల్లో ఐటం సాంగ్స్‌లో నర్తించిన ఆమె... ప్రేమించు పెళ్లాడు, నమస్తే, ఐదు, బీటెక్‌ లవ్‌ స్టోరీ వంటి చిన్న సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఇక గెహానా ఆరోగ్య పరిస్థితిపై ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు సంబంధించిన వార్తలు ట్విటర్‌లో ట్రెండ్‌ అవుతున్నాయి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా