ఒంటి చేత్తోనే కళాఖండాల సృష్టి..!

3 Dec, 2013 02:17 IST|Sakshi
ఒంటి చేత్తోనే కళాఖండాల సృష్టి..!
ఎంతటి గజ ఈతగాడైనా ఒంటి చేత్తో సముద్రాన్ని ఈదగలడా? అసాధ్యం కదూ! టీవీయస్ శర్మను చూస్తే ఈ ప్రపంచంలో ఏదీ అసాధ్యం కాదనిపిస్తుంది. కళాదర్శకుడంటేనే చేతులతో పని. చక చకా బొమ్మలు గీసెయ్యాలి. సెట్లు వేసెయ్యాలి. టీవీయస్ శర్మకు ఎడమ చెయ్యి లేదు. ఒంటి చేత్తోనే కళాఖండాలన్నీ సృష్టించేశాడాయన.
 
లవకుశ... నర్తనశాల... సీతారామ కల్యాణం... భీష్మ... మైరావణ... రాజు-పేద... చెంచులక్ష్మి... దొంగరాముడు... తోడికోడళ్లు... కలిసి ఉంటే కలదు సుఖం... శకుంతల... శ్రీకృష్ణ పాండవీయం...  ఈ క్లాసిక్స్ అన్నింటికీ ఓ కళ తీసుకొచ్చింది శర్మే. నెల్లూరులో పుట్టి పెరిగిన శర్మకు చిన్నతనంలోనే చిత్రలేఖనం అలవడింది. మరో పక్క ఆటల్లో బెస్టు. అల్లరిలో ఫస్టు. ఆ అల్లరి ఓసారి శ్రుతి మించింది. 
 
 ఓ దీపావళినాడు బాణాసంచా పేలి, ఎడమ చేయి తెగిపడింది.
 మోచేతి దాకా తీసిపారేశారు. చేయి లేకపోతేనేం... చేవ ఉంది కదా అనుకున్నా డాయన.
 తన కల నెరవేర్చుకోవడానికి సింగిల్ హ్యాండ్ చాలనుకున్నాడు.
 సినిమా ఫీల్డ్‌కి వచ్చీ రావడంతోనే శర్మ కళాపరిమళం గుప్పున ఉప్పొంగింది. తొలి సినిమా ‘సతీ తులసి’ (1936)తోనే అందరి కళ్లూ శర్మ వైపే. ‘మై రావణ’ (1939)లో పాతాళలోక సృష్టి చూసి భేష్ అననివారు లేరు. అసలు పౌరాణికాలన్నీ ఆయన పేరు చెబితేనే పులకించిపోయేవి. ఏం మేజిక్ చేసేవాడో ఏంటో కానీ, కొన్ని పాత్రల గెటప్పులు చూస్తే నిజంగా దేవతలే దిగివచ్చినట్టుగా అనిపించేసింది.
 ‘లవకుశ’లో అయితే నిజంగా శ్రీరాముడు, సీతాదేవి - ఎన్టీఆర్, అంజలీదేవిగా మారువేషం వేసుకున్నట్టే ఫీలయ్యారు జనాలు.
 
 ‘సత్యభామ’ సినిమాలో నారదుడి వేషం కానివ్వండి. ‘శ్రీకృష్ణ పాండవీయం’లో దుర్యోధనుడి రూపకల్పన కానివ్వండి... ఆయన కళా చాతుర్యం అద్భుతః.‘నర్తనశాల’లో బృహన్నల పాత్ర అయితే ఎక్స్‌లెంట్. ఎన్టీఆర్‌లాంటి సూపర్‌స్టార్‌ని అటూ ఇటూ కాని పేడి పాత్రలో చాలా లబ్జుగా తయారు చేశారు. ఏమాత్రం అటూ ఇటూ అయినా ఆ పాత్ర కాదు, సినిమానే తేడా కొట్టేసేది. ఇక ఆ సినిమా సెట్టింగులైతే అదరహో. ఈ సినిమా కోసం ఆయన తయారు చేసిన రాజరాజేశ్వరీ విగ్రహానికి సావిత్రి ఫ్లాట్ అయిపోయారు. షూటింగంతా అయ్యాక ఆ విగ్రహాన్ని ఇంటికి తీసుకెళ్లి, అక్కడే శాశ్వతపూజలో పెట్టేసుకున్నారు.
 
  ఏ కళాదర్శకుడికైనా ఇంతకన్నా ఏం కావాలి?
 ‘జకార్తా’ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అయితే వచ్చిన గెస్టులంతా ‘నర్తనశాల’ సెట్టింగుల్ని రెండు కళ్లూ చాలవన్నట్టు చూశారు. ఇండోనేషియా ప్రధాని సుకర్ణో అయితే, ఒంటి చేత్తోనే శర్మ ఇవన్నీ సృష్టించారని తెలిసి ఒకటే పొగడ్తలు. అప్పుడే ఆయనకు ఉత్తమ కళాదర్శకుడిగా అవార్డొచ్చింది. ఇలా ఒక్కటని కాదు. శర్మ కెరీర్‌లో అన్నీ మెరుపులే.
 
 
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా