మిస్టరీగా మారిన శ్రీదేవీ మృతి..?

26 Feb, 2018 19:09 IST|Sakshi

దుబాయ్‌ : ప్రముఖ నటి శ్రీదేవి అకాల మరణంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. యూఏఈ అధికారులు విడుదల చేసిన ఫోరెన్సిక్‌ రిపోర్టు అనంతరం అనుమానాలు మరింత పెరిగాయి. శ్రీదేవీ గుండెపోటుతో చనిపోలేదని, ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో పడిపోవడం వల్ల ఊపిరాడక చనిపోయారంటూ ఫోరెన్సిక్‌ రిపోర్టు తెలిపింది.  అయితే ఈ రిపోర్టు వెలువడక ముందు ప్రముఖ రచయిత, ఫిజిషియన్‌ తస్లిమా నస్రీన్ చేసిన ట్వీట్‌తో పాటు, ట్విట్టర్‌ యూజర్లు కూడా ఫోరెన్సిక్‌ రిపోర్టుపై అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఒక ఆరోగ్యకరమైన మహిళ ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌ల్లో పడిపోతారా? అంటూ ఓ ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌ అనంతరం ఫోరెన్సిక్‌ రిపోర్టు శ్రీదేవీ ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో పడిపోయినట్టు పేర్కొంది. అయితే శవపరీక్షలో ప్రమాదవశాత్తు పడిపోయినట్టు అని ఎలా పేర్కొంటారు? అని ట్విట్టర్‌ యూజర్లు మండిపడుతున్నారు. కేవలం బాత్‌టబ్‌లో పడిపోయినట్టే చెప్పాలని, ఒకవేళ అది ప్రమాదవశాత్తు అయి ఉంటే శవపరీక్ష దాన్ని ఎలా బహిర్గతం చేస్తుంది? ఇది ఒక సందేహాస్పదమైన రిపోర్టు అంటున్నారు.

మరోవైపు ఫోరెన్సిక్‌ రిపోర్టు కూడా డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ పేరుతో విడుదలైంది. అంటే ఫోరెన్సిక్‌ అని చెబుతున్న ఈ రిపోర్టు అసలు నిజమైందేనా? అనే సందేహాలు కూడా వెల్లువెత్తుతున్నాయి. మేనల్లుడు పెళ్లి వేడుకకు వెళ్లిన శ్రీదేవీ తాను ఒక్కతే ఎందుకు దుబాయ్‌లోనే ఉండాలనుకున్నారు? ఎందుకు బోనీ కపూర్‌ మళ్లీ శ్రీదేవీని కలవడానికి ముంబై నుంచి దుబాయ్‌ వెళ్లారు? అంటూ పలు ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. తొలుత కార్డియాక్‌ అరెస్ట్‌ అని, తర్వాత బాత్‌టబ్‌లో పడిపోయి చనిపోయిరని ఎందుకు చెప్పారని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు బోనీ కపూర్‌ శ్రీదేవీ మృతిపై స్పందించలేదు.

ఒకే నెంబర్‌ నుంచి శ్రీదేవీకి పలుమార్లు కాల్‌

శ్రీదేవీ మృతిపై ఇంకా విచారణ కొనసాగుతుందని దుబాయ్‌ పోలీసులు పేర్కొన్నారు. ఆమె కేసును దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు బదిలీ చేశారు. శ్రీదేవీ కాల్‌ డేటా, బోనీ కపూర్‌ కాల్‌డేటాను కూడా పరిశీలిస్తున్నారు. బోనీ కపూర్‌, శ్రీదేవీ ఎప్పుడెప్పుడు మాట్లాడుకున్నారో కూడా తేలుస్తున్నారు. ఒకే నెంబర్‌ నుంచి ఆమెకు పలుమార్లు కాల్‌ వెళ్లినట్టు తెలుస్తోంది. మరోవైపు బోనీ కపూర్‌ని కూడా సుదీర్ఘ సమయం పాటు పోలీసులు విచారించారు. ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఆయనతో పాటు అపస్మారక స్థితిలో ఉన్న శ్రీదేవీని బోనీతోపాటు ఆసుపత్రికి తీసుకెళ్లిన మరో ముగ్గురు వ్యక్తులు, రషీద్‌ ఆసుపత్రి ఇద్దరు డాక్టర్లు, ఐదుగురు అటెండర్ల వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేసుకున్నారు. హోటల్‌ సిబ్బందిని కూడా దుబాయ్‌ పోలీసులు ప్రశ్ని‍స్తున్నారు. ప్రస్తుతం బోనీ కపూర్‌, హోటల్‌ సిబ్బంది దుబాయ్‌ ప్రాసిక్యూషన్‌ అధికారుల అదుపులోనే ఉన్నట్టు తెలుస్తోంది. టబ్‌లో పడిపోయిన సమయంలో శ్రీదేవీ ఆల్కహాల్‌ సేవించినట్టు తెలుస్తోంది. అయితే ఆమెకు ఆల్కహాల్‌ సేవించే అలవాటు లేదని రాజ్యసభ ఎంపీ అమర్‌ సింగ్‌ అన్నారు. బాత్‌టబ్‌లో పడిపోయిన తర్వాత ఎంత సేపటికి ఆమెను గుర్తించారు? తనంతట తానే పడిపోయిందా? లేదా ఆమెను ఇంకెవరైనా బాత్‌టబ్‌లోకి తోసేశారా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని వార్తలు