సినిమా షూటింగ్‌లో అపశ్రుతి

8 Nov, 2016 07:51 IST|Sakshi
సినిమా షూటింగ్‌లో అపశ్రుతి

హెలికాప్టరు నుంచి రిజర్వాయర్‌లోకి దూకిన హీరో, విలన్లు
ఈత రాకపోవడంతో ఇద్దరు నటుల గల్లంతు
హీరో దునియా విజయ్ క్షేమం

 
సాక్షి, బెంగళూరు: కన్నడ సినిమా చిత్రీకరణ సమయంలో విషాదం చోటుచేసుకుంది. చిత్రం పతాక సన్నివేశాలను ఒక రిజర్వాయర్ సమీపంలో చిత్రీకరిస్తుండగా ఇద్దరు వర్ధమాన నటులు నీటిలో మునిగి గల్లంతయ్యారు. ‘దునియా’ విజయ్ హీరోగా, అమూల్య హీరోయిన్‌గా నాగశేఖర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మాస్తీగుడి. బెంగళూరుకు 35 కిలోమీటర్ల దూరంలోని రామనగర జిల్లా తిప్పగుండనహళ్లి రిజర్వాయర్ వద్ద సోమవారం సినిమా పతాక సన్నివేశాల చిత్రీకరణలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
 
సినిమాలో విలన్‌గా నటిస్తున్న ఉదయ్, స్టంట్‌మ్యాన్ అనిల్ మొదటగా 50 మీటర్ల ఎత్తులో హెలికాప్టర్ నుంచి దూకారు. అయితే వీరికి ఈత రాకపోవడం, రక్షక బోట్లు సరైన సమయానికి రాకపోవడంతో నీటిలో మునిగి చనిపోయారు. హీరో విజయ్ కూడా వారి వెనకే దూకినా అతనికి తెప్ప అందడంతో సురక్షితంగా బయటపడ్డాడు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్ల సాయంతో వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. భారీగా పేరుకుపోయిన పూడిక కింద చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు.

కాగా, సినిమా చిత్రీకరణ యూనిట్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంత ప్రమాదకరమైన చిత్రీకరణకు ముందు ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దుర్ఘటనతో కన్నడ సినీవర్గాలు విషాదంలో మునిగిపోయాయి. గల్లంతైన అనిల్, ఉదయ్ కొన్ని రోజుల ముందు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తమకు ఈత సరిగా రాదని, స్టంట్లు చేయడం భయమని పేర్కొనడం గమనార్హం.