సాహసం-హీరోయిజం.. అందమైన కథ!

12 Jul, 2018 12:09 IST|Sakshi

చిమ్మ చీకట్లో పదిహేను రోజులకుపైగా బిక్కుబిక్కుమంటూ ఆటగాళ్లు, కోచ్‌. తినటానికి తిండి లేదు.. మట్టి నీరు తప్ప. చుట్టూ విషపూరిత పాములు.. భయానక పరిస్థితులు. ముందు.. అసలు బతికున్నారో లేదో అన్న అనుమానాలు. ఆచూకీ లభించాక వారిని వెలుపలికి తెస్తామో లేదో అన్న సంశయం. వెరసి ప్రపంచం మొత్తం ఊపిరి బిగబట్టి ఆసక్తిగా తిలకించిన వేళ థాయ్‌లాండ్‌ ‘థామ్‌ లూవాంగ్‌ గుహ’ రెస్క్యూ ఆపరేషన్‌ విజయవంతంగా ముగిసింది. కోచ్‌తోపాటు 12 మంది పిల్లలు క్షేమంగా బయటపడ్డారు. అయితే ఓ సినిమాకు ఇంతకన్నా మంచి స్క్రీన్‌ప్లే దొరకదన్న ఉద్దేశంతో పలు ప్రఖ్యాత సంస్థలు దీనిని తెరకెక్కించేందుకు ఎగబడిపోతున్నాయి. 

ప్యూర్‌ ఫ్లిక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌పై సుమారు 60 మిలియన్‌ డాలర్ల ఖర్చుతో(దాదాపు 400 కోట్ల) బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ విషయాన్ని నిర్మాతలు మైకేల్‌ స్కాట్‌, అడమ్‌ స్మిత్‌లు అధికారికంగా ప్రకటించారు. ‘ఈ ఘటనలో సాహసం ఉంది. హీరోయిజం ఉంది. ఓ సినిమాకు ఇంతకన్నా ఏం కావాలి. అయినా ఇది ఓ చిత్రం మాత్రమే కాదు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న వీరులకు, మరణించిన డైవర్‌కు ఈ చిత్రం అంకితమిస్తున్నాం’ అని మైకేల్‌ స్కాట్‌ తెలిపారు. 

ఇక మరో దర్శకుడు ఎమ్‌ చూ కూడా ఈ థాయ్‌ ఆపరేషన్‌ను చిత్రంగా మలిచేందుకు సిద్ధమయ్యారు. ‘ఇదో అందమైన కథ. ప్రపంచం మొత్తాన్ని ఊపిరి బిగపట్టేలా చేసిన ఈ ఆపరేషన్‌ను.. తెరపై చూపించటం గర్వంగా ఫీలవుతున్నా’ అని ఆయన ప్రకటించారు. లాస్‌ ఏంజెల్స్‌కు చెందిన ఇవన్‌హోయె పిక్చర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. ఈ రెండింటిలో ఒకటి కోచ్‌ ఎక్కపోల్‌ చాంతవోంగ్‌ కోణంలో తెరకెక్కుతుండగా.. మరొకటి గుహ సహయక ఆపరేషన్‌ నేపథ్యంలో తెరకెక్కనున్నట్లు థాయ్‌ మీడియా ఛానెళ్లు కథనాలను ప్రచురించాయి.

మరిన్ని వార్తలు