టైసన్ ఈ సినిమా చూస్తారట!

2 Feb, 2016 23:32 IST|Sakshi
టైసన్ ఈ సినిమా చూస్తారట!

 మైక్ టైసన్ తెలుసుగా! ప్రపంచ ప్రసిద్ధ అమెరికన్ మాజీ బాక్సర్. ఇప్పుడు ఆయన మన భారతీయ సినిమా చూడా లని ఆశపడుతున్నారు. ఆశ్చర్యపోకండి! ఇది నిజం! సాక్షాత్తూ మైక్ టైసనే స్వయంగా తన ఫేస్‌బుక్ పేజీలో ఆ సంగతి వెల్లడించారు. ఇంతకీ, ఆ సినిమా ఏమిటంటే - మాధవన్ ప్రధాన పాత్రలో నటించిన హిందీ సినిమా ‘సాలా ఖదూస్’ (తమిళంలో ‘ఇరుది సుట్రు’). చెన్నైలోని మురికివాడల నుంచి మట్టిలోని ఓ మాణిక్యాన్ని వెలికితీసి, బాక్సింగ్ చాంపియన్‌గా తీర్చిదిద్దిన బాక్సింగ్ కోచ్ జీవితం చుట్టూ నడిచే సినిమా అది. తెలుగమ్మాయి సుధ కొంగర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రితికా సింగ్ మహిళా బాక్సర్ పాత్ర పోషించారు.

ఈ సినిమాకు సంబంధించిన సమీక్షను ఒక భారతీయ పత్రికలో చదివిన మైక్ టైసన్ ఆ సమీక్షను తన ఫేస్‌బుక్‌లో షేర్ చేసుకున్నారు. అంతటితో ఆగకుండా, ‘‘ఈ బాక్సింగ్ సినిమాను చూడాలనుకుంటున్నా’’ అని పేర్కొన్నారు. బాక్సింగ్ బరిలో రికార్డులు నెలకొల్పి, ప్రపంచమంతటా ప్రసిద్ధుడైన టైసన్ ఇలా ‘సాలా ఖదూస్’ సినిమా చూస్తాననడంతో సహజంగానే అందరి దృష్టీ ఆ చిత్రంపై పడింది. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం మాధవన్‌కు మంచి పేరు తేవడమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద ఆదరణ పొందుతుండడం విశేషం.