మంచి టర్న్‌

17 Mar, 2020 01:34 IST|Sakshi

కొన్ని సినిమా కథలు ఎలాంటి మలుపులు తీసుకుంటాయో ఊహించలేం. ‘యు–టర్న్‌’ సినిమా కథ అలాంటిదే. ఈ కథలో వచ్చిన మలుపులను ప్రేక్షకులు ముందే ఊహించలేకపోయారు. అంత పకడ్బందీగా ఆ కథ రాసుకున్నారు చిత్రదర్శకుడు పవన్‌ కుమార్‌. అందుకే కన్నడంలో హిట్‌ అయిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రీమేక్‌ అయి, రెండు భాషల్లోనూ హిట్‌ అయింది. ఇప్పుడు ‘యు–టర్న్‌’ మరో మంచి టర్న్‌ తీసుకోబోతోంది. ఈ చిత్రం ఫిలిపైన్‌ భాషలో రీమేక్‌ కానుంది.

ఈ సందర్భంగా చిత్రదర్శకుడు పవన్‌ కుమార్‌ మాట్లాడుతూ – ‘‘మా ‘యు–టర్న్‌’ ఫిలిపైన్‌లో రీమేక్‌ కానుంది. కిమ్‌ చియు, జెఎమ్‌డి గుజ్‌మ్యాన్, టోనీ లబ్రుస్కా ఈ చిత్రాన్ని రీమేక్‌ చేయబోతున్నారు. ఫిలిపైన్‌ దర్శకుడు డెరిక్‌ కాబ్రిడో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారు. మనం తీసిన సినిమా ఇతర భాషల్లో రీమేక్‌ అవుతోందంటే చాలా ఆనందంగా ఉంటుంది. పైగా దర్శకుడిగా కన్నా ఈ కథ రాసినందుకు రచయితగా ఎక్కువగా ఆనందపడుతున్నా. ఎందుకంటే ఈ కథ రాస్తున్నప్పుడు లోకల్‌ స్టోరీ అనుకుని రాశాను.

ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి రీచ్‌ ఉంటుందనుకోలేదు. గత నెల సింహళ భాషలో ఈ చిత్రం రీమేక్‌ అయింది. ఇంకా థాయ్, చైనీస్‌ భాషల్లోనూ రీమేక్‌ కానుంది. విశేషం ఏంటంటే.. ఈ సినిమాని రీమేక్‌ చేస్తారా? అని మా అంతట మేం ఎవరినీ అడగలేదు. సినిమా చూసి రీమేక్‌ చేయడానికి వాళ్లంతట వాళ్లే ముందుకొచ్చారు’’ అన్నారు. ‘‘భారతీయ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయి. మేం రీమేక్‌ చేయబోతున్న ‘యు–టర్న్‌’ మా ఫిలిపైన్‌ ప్రేక్షకులను థ్రిల్‌ చేస్తుందని నమ్ముతున్నాం’’ అన్నారు చిత్రనిర్మాతలు.

>
మరిన్ని వార్తలు