రెక్కల సివంగి

19 Jun, 2019 12:13 IST|Sakshi

డిగ్రీ చదివితే చాలు అని ఆడపిల్లల గురించి అనుకునే రోజుల్లో పోలీస్‌ ఆఫీసర్‌గాఒక ఆడపిల్లను చూపించిన సీరియల్‌ ‘ఉడాన్‌’. మగవాళ్ల వ్యవస్థలో స్త్రీ సగౌరవంగాతన ఉనికిని చాటుకోవచ్చు అని చెప్పిన కథ ‘ఉడాన్‌’. పాటలు, ఏడుపుగొట్టు సన్నివేశాలు మాత్రమే హీరోయిన్‌కు దక్కే రోజుల్లో యువతుల ఆకాంక్షలకు రెక్కలు తొడిగి సాహస వనితలుగా ఉన్నతీకరించిన సంచలనం ‘ఉడాన్‌’.

సరిగ్గా ముప్పై ఏళ్ల క్రితం..
అప్పుడప్పుడే స్త్రీ చదువు, ఉద్యోగం అంటూ ఇంటి గడప దాటి తన జీవితానికి ఓ దిశా దశ ఏర్పరుచుకుంటున్న కాలం. ఆకాశంలో సగం కోసం పోరాటం కాదు నేలమీదే తన ఉన్నతికి పాటుపడుతున్న సమయం. అలాంటి సమయంలో వచ్చింది ‘ఉడాన్‌’ సీరియల్‌. భారతదేశంలో మొట్టమొదటిసారి దూరదర్శ 1989లో మహిళా సాధికారితను ఓ సీరియల్‌ ద్వారా పరిచయం చేయడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ సీరియల్‌ ఒక మహిళా ఐపీఎస్‌ ఆఫీసర్‌ ఎదుర్కొనే ఒత్తిళ్లు, సంఘర్షణ, సవాళ్లను చూపించడమే ధ్యేయంగా నడిచింది.‘ఉడాన్‌’ సీరియల్‌కి స్ఫూర్తి ఐపీఎస్‌ కాంచన్‌ చౌదరి భట్టాచార్య (మాజీ డీజీపీ). ఈమె ఇండియాలోనే మొట్టమొదటి మహిళా డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీజీపీ). కాంచన భట్టాచార్య తన వృత్తిలో చూపించిన నిబద్ధత, ఎదుర్కొన్న కష్టాలు సాధారణమైనవి కావు. ఈమె వాస్తవ కథే ‘ఉడాన్‌’ సీరియల్‌కి ప్రేరణ. కాంచన చౌదరి ఎవరో కాదు ఉడాన్‌ సీరియల్‌లో నటించిన కవితా చౌదరి అక్క. తన తోబుట్టువు సాహసం, కష్టాలు, ఎదుర్కొన్న ఒత్తిళ్లను చూసి, తెలుసుకున్న కవిత ఒక కథ రాసుకున్నారు. ఈ సీరియల్‌ దర్శకత్వ బాధ్యతలను తానే చేపట్టారు. అంతేకాదు, తన సోదరి నిజజీవితాన్ని హృద్యంగా చిత్రించి, బుల్లితెర ప్రేక్షకులను తన నటనతో మెప్పించారు కవిత.

ఇంటికి పెద్ద కొడుకులా!
ఉడాన్‌ సీరియల్‌లో ప్రధానపాత్రధారి పేరు కళ్యాణీ సింగ్‌. ఒకసారి కళ్యాణి తండ్రి విక్రమ్‌ గోఖలే అనే వ్యక్తి వల్ల తన భూమినంతా కోల్పోతాడు. ఊళ్లో తన పరువు అంతా పోయిందని, తమకో కొడుకు ఉంటే ఇలా జరిగేది కాదని తండ్రితోపాటు కుటుంబం అంతా బాధపడుతూ ఉంటుంది. ఆ సమయంలో కళ్యాణి తన తండ్రితో మహిళ ఏ విషయంలోనూ మగవాడికన్నా తక్కువ కాదని, సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో స్త్రీని ఉంచడమే తన లక్ష్యమని చెబుతుంది. తాను పోలీస్‌ అధికారినై కుటుంబానికి తిరిగి గౌరవాన్ని తీసుకువస్తానని ప్రతిజ్ఞ చేస్తుంది. అనుకున్నట్టుగానే పోలీస్‌ ఆఫీసరై తండ్రి కష్టాన్ని తీరుస్తుంది. అందరూ కళ్యాణీసింగ్‌ కుటుంబాన్ని గొప్పగా చూస్తుంటారు. ఏ లక్ష్యంతో అయితే ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్‌లో చేరుతుందో ఆ దిశగానే నిబద్ధతతో పనులు చేస్తుంటుంది కళ్యాణి. ఐపీఎఎస్‌ అధికారిగా ఆమె చేపట్టిన ఎన్నో ప్రజాప్రయోజన పనులు అందరినీ ఆకట్టుకుంటాయి.

వివక్షపై పోరాటం
సమాజంలో లింగవివక్షపైనే కాకుండా రకరకాల సమస్యలపై పోరాడి గెలిచిన మహిళా పోలీస్‌ ఆఫీసర్‌ని ఈ షో చూపింది. పోలీస్‌ అంటే ప్రజల్లో ఉండాల్సింది భయం కాదు. ఒక స్నేహితుడిలా, తమను కాపాడే సంరక్షకుడిలా, పౌరులు గౌరవించే విధంగా ఉండాలని కోరుకుంటుంది కళ్యాణి. ఇదేవిధమైన సూచనలను పోలీసు అధికారులందరికీ ఇస్తుంది. ప్రతి పౌరుడు చట్టాన్ని ఏ విధంగా గౌరవిస్తున్నాడో గమనిస్తుంటుంది. సమాజ కంటకులుగా మారినవారిని ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకుండా శిక్షిస్తుంది. పోలీసు వ్యవస్థలో జరిగే లోటుపాట్లను సరిదిద్దుతుంది. మహిళలు కష్టపడి పనిచేయడానికి, తమ సొంత కాళ్ల మీద నిలబడగల సామర్థ్యం సాధించడానికి, సమాజంలో గౌరవం పొందడానికి, ధైర్యాన్ని నింపుకోవడానికి స్ఫూర్తిగా నిలుస్తుంది.

ప్రజా పోలీసు
ప్రజాదర్బారులో ఒక వ్యక్తి తన అభ్యర్థనను ఐఎఎస్, జిల్లా జడ్జిముందు ఉంచుతాడు. అతి తక్కువ సమయంలో అతనికి తగిన న్యాయం జరిగేలా చూస్తారు ఆఫీసర్లు. అందుకు చొరవ చూపిన పోలీస్‌ అధికారి కళ్యాణిని అందరూ అభినందిస్తారు. ఆ సమయంలో ఆ వ్యక్తి ఆఫీసర్ల పాదాలు తాకి తన సంతోషాన్ని వ్యక్తం చేసే విధానం ప్రతి గుండెనూ కదిలిస్తుంది. అదే ఎపిసోడ్‌లో జిల్లా న్యాయవాది పీఏ రకరకాల బ్యూరోక్రటిక్‌ అడ్డంకులను ప్రదర్శించడానికి ప్రయత్నించినప్పుడు పోలీస్‌ అధికారిగా కళ్యాణీసింగ్‌ స్పందించిన విధానం ప్రజల్లోకి ఒక చిన్న సందేశాన్ని పంపినట్లుగా అవుతుంది. ఈ సందర్భంలో కళ్యాణీ సింగ్‌ ‘ మేం క్రమబద్ధమైన పద్ధతిలో పనిచేస్తాం. ప్రజలను నిరాశపరిచేలా, అడ్డంకులు సృష్టించే వారు ఎవరైనా సరే, వారిని క్షమించం’ అంటూ అతడిని జైలుకు పంపిస్తుంది.కళ్యాణీసింగ్‌ ఆదర్శాలు నచ్చిన ఐఎఎస్‌ ఆఫీసర్‌ శేఖర్‌ కపూర్‌ ఆమె మెప్పు సాధించడానికి, పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు, తన ఆదర్శాలను ఆ ఆలోచన సరైనదో కాదో జాగ్రత్తగా అంచనా వేసే కళ్యాణి అంటే శేఖర్‌ అభిమానం చూపుతుంటాడు.

సమాజంలో ప్రజలు అన్యాయానికి అడ్డుగా నిలబడే బలం ఉన్నప్పుడే న్యాయవ్యవస్థ కూడా సక్రమంగా పనిచేస్తుందని అప్పుడే నిజమైన ప్రయోజనం పొందవచ్చనే సందేశాన్ని ఎపిసోడ్‌ చివరలో దర్శకుడు చూపించడంతో సీరియల్‌ ముగుస్తుంది. చివరి సన్నివేశంలో కల్యాణిసింగ్, ఆమె కుటుంబ సభ్యులు ప్రజలందరి మధ్య జరిగిన సమావేశానికి హాజరవడం, అందరూ కళ్యాణిని అభినందించడం, తర్వాత ఆమె తనకు కొత్తగా ఇచ్చిన పోస్టింగ్‌వైపు కదలడం చూపుతుంది. ఈ సమయంలో కళ్యాణిసింగ్‌ ఐపిఎస్‌ గురించి ఒక స్వరం ఆమె గొప్పతనం గురించి ప్రశంసిస్తుంది. మొత్తం ముప్పై ఎపిసోడ్లుగా వచ్చిన ఉడాన్‌ సీరియల్‌ నాటి తరం అమ్మాయిల్లో ధైర్యాన్ని, సాహసాన్ని పెంచింది. ఈ సీరియల్‌ వచ్చిన ఏడాదికే తెలుగులో విజయశాంతి పోలీసాఫీసర్‌గా నటించిన కర్తవ్యం సినిమా విడుదలైంది.– ఎన్‌.ఆర్‌

కవితా చౌదరి సర్ఫ్‌ డిటర్జెంట్‌ ప్రకటన ద్వారా నాడు చాలామందికి పరిచయమే. కవిత బాలీవుడ్‌ నటి, మోడల్‌ కూడా. దూరదర్శన్‌లో వచ్చిన ఉడాన్‌ సీరియల్‌లో ఐపీఎస్‌ ఆఫీసర్‌ కళ్యాణీసింగ్‌గా నటించింది. ఉడాన్‌ సీరియల్‌తో పాటు ‘యువర్‌ ఆనర్, ఐపీఎస్‌ డైరీస్‌’ అనే మరో రెండు టెలివిజన్‌ సీరిస్‌ను తీసింది కవిత.

మరిన్ని వార్తలు