‘మహేశ్‌, అరే మహేశ్‌, ఉమా మహేశ్‌గారూ’

21 Feb, 2020 13:41 IST|Sakshi

అందరూ ఎవరి మాట విన్నా, వినకపోయినా ఒకరు చెప్పినట్లు మాత్రం చచ్చినట్లు వినాల్సిందే. అది ఎవరో మీకీపాటికే అర్థమైపోయుంటుంది.. ఫొటోగ్రాఫర్‌.. అవును, అతను ఏది చెప్పినా కిక్కురుమనకుండా చేయాల్సిందే. పైగా పెళ్లైనా, పేరంటమైనా ఆయన లేనిదే ముందుకు సాగని పరిస్థితి. అలాంటి ఫొటోగ్రాఫర్‌ అవతారమెత్తాడు సత్యదేవ్‌. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య. ఇది ‘మహేశింటె ప్రతీకారమ్‌’ అనే మలయాళ చిత్రానికి రీమేక్‌. టీజర్‌ను చూస్తే.. ఈ ఫొటోగ్రాఫర్‌ ఓ అమ్మాయి ఫొటో క్లిక్‌మనిపించే సమయంలో ప్రేమలో పడినట్లు తెలుస్తోంది.

ఇంకేముందీ.. అద్దం ముందు నిల్చుని రెడీ అవ్వడం, తనలో తానే ముసిముసిగా నవ్వుకోవడం, గంటల తరబడి ఫోన్‌ మాట్లాడటం.. అబ్బో ఇలా చాలానే ఉన్నాయి. అయితే, టైటిల్‌ అంత భీకరంగా ఉన్నప్పటికీ టీజర్‌ మాత్రం సాఫీగా సాగుతుంది. కానీ ఎంతో సౌమ్యంగా కనిపిస్తున్న హీరో చివర్లో ఉగ్రావతారం ఎత్తాడు. అది దేనికోసమో తెలియాలంటే సినిమా వచ్చేవరకు ఆగాల్సిందే. కాగా ఈ సినిమాను బాహుబలి వంటి భారీ బడ్జెట్‌ను తెరకెక్కించిన శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని ‘కేరాఫ్‌ కంచరపాలెం’ దర్శకుడు వెంకటేశ్‌ మహా, నిర్మాత ప్రవీణా పరుచూరితో కలిసి నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌ 17న ఈ చిత్రం విడుదల కానుంది. (చెప్పు లేసుకోవయ్యా అంటే.. తిరిగి ఆణ్ణి కొట్టేవరకు చెప్పులు వేసుకోను)
 

మరిన్ని వార్తలు