'ఉంగరాల రాంబాబు' రివ్యూ

23 Sep, 2017 15:57 IST|Sakshi

టైటిల్ : ఉంగరాల రాంబాబు
జానర్ : కామెడీ ఎంటర్టైనర్
తారాగణం : సునీల్, మియా జార్జ్, పోసాని కృష్ణమురళి, ప్రకాష్ రాజ్
సంగీతం : గిబ్రాన్
దర్శకత్వం : క్రాంతి మాధవ్
నిర్మాత : పరుచూరి కిరిటీ

హాస్య నటుడిగా మంచి ఫాంలో ఉండగా హీరోగా మారిన సునీల్ చాలా కాలంగా విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. హీరోగా ఒకటి రెండు విజయాలు వచ్చినా.. ఆ ఫాం కొనసాగించలేకపోయాడు. వరుస అపజయాలతో కెరీర్ కష్టాల్లో పడేసుకున్న ఈ కామెడీ స్టార్.. చాలా కాలంగా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న ఉంగరాల రాంబాబు సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. దర్శకుడిగా క్లీన్ ఇమేజ్ ఉన్న క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సునీల్ కెరీర్ ను గాడిలో పెట్టిందా..? క్రాంతి మాధవ్ మరోసారి ఆకట్టుకున్నాడా...?

కథ :
కోటీశ్వరుడైన రాంబాబు (సునీల్) తన తాత మరణంతో ఆస్తులన్ని కోల్పోయిన రోడ్డున పాడతాడు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్న రాంబాబుకు జనాల్ని మోసం చేస్తూ బతికే దొంగ బాబా బాదం బాబా(పోసాని కృష్ణమురళి) ఆశ్రమం కనిపిస్తుంది. రాంబాబు ను చూసిన బాదం బాబా నేను చెప్పినట్టు చేస్తే నీ డబ్బు నీకు తిరిగొస్తుందని చెబుతాడు. అలా బాదం బాబా చెప్పిన పనికి వెళ్లిన రాంబాబు కు భారీగా బంగారం దొరుకుతుంది. దీంతో బాబా మీద నమ్మకం మరింత పెరుగుతుంది. జాతకాల మీద విపరీతమైన నమ్మకంతో రాంబాబు.. ఉంగరాల రాంబాబుగా మారిపోతాడు.

అయితే తిరిగి కోటీశ్వరుడైన రాంబాబుకు వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ ఇబ్బందుల నుంచి బయటపడేసే జాతకం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని బాబా చెప్తాడు. దీంతో బాబా చెప్పిన జాతకం కలిగిన సావిత్రి (మియా జార్జ్)ను ప్రేమిస్తాడు. అలా డబ్బు కోసం ప్రేమలో పడ్డ రాంబాబు అనుకున్నది సాధించాడా.? సావిత్రిది నిజంగా బాబా చెప్పిన జాతకమేనా..? వారి ప్రేమ గెలిచిందా..? అన్నదే మిగతా కథ.

నటీనటులు :
హీరోగా సత్తా చాటేందుకు ప్రయత్రిస్తున్న సునీల్ రాంబాబు సినిమాతో మరోసారి అదే ప్రయత్నం చేశాడు. తన పాత్రకు పూర్తి న్యాయం చేసినా.. అభిమానులు తన నుంచి ఆశించే కామెడీని మాత్రం అందించలేకపోయాడు. దొంగ బాబా పాత్రలో పోసాని ఆకట్టుకున్నాడు. తనదైన నటనతో నవ్వులు పంచే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ గా మియాజార్జ్ పరవాలేదనిపించింది. స్టార్ కామెడియన్ గా ఎదుగుతున్న వెన్నెల కిశోర్ బోరింగ్ సీన్స్ నుంచి ఆడియన్స్ ను ఆదుకునే ప్రయత్నం చేశాడు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో ఆకట్టుకున్నాడు.

సాంకేతిక నిపుణులు :
ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు లాంటి మనసుతాకే చిత్రాలను అందించిన క్రాంతి మాధవ్ దర్శకత్వంలో మరో సినిమా వస్తుందంటే అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే తన మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవటంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు. ఏ మాత్రం లాజిక్ లేని సన్నివేశాలతో పాటు మంచి నటులు ఉన్నా.. వారి నుంచి ఆ స్థాయి పర్ఫామెన్స్ రాబట్టలేకపోయారు. గిబ్రాన్ సంగీతం కూడా నిరాశపరిచింది. సినిమాటోగ్రఫి కాస్త ఊరట కలిగిస్తుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :
పోసాని, వెన్నెల కిశోర్ ల కామెడీ

మైనస్ పాయింట్స్ :
కథా కథనం
సంగీతం

మరిన్ని వార్తలు