సినిమా పండగ వచ్చేసిందోచ్‌!!

4 Dec, 2017 02:35 IST|Sakshi

 ఒకటి పక్కా మాస్‌ సినిమా.. ఇంకోటేమో క్లాస్‌ ఫ్యామిలీ డ్రామా.. మరో సినిమా ప్యూర్‌ కామెడీ.. ఇలా అన్నీ ఒక్కసారే వచ్చి పడితే ఎలా ఉంటుంది? సినిమా పండగ అయిపోదూ? అదే.. మన సంక్రాంతి, దసరాలాగే.. హాలీవుడ్‌కు అసలైన  పండగ సీజన్‌ అంటే క్రిస్‌మస్‌. ఈ నెలంతా క్రిస్‌మస్‌ పండగ సెలబ్రేట్‌ చేసుకునేందుకు సినీ అభిమానులకు ఉన్న ఒక మంచి ఆప్షన్‌ సినిమా. క్రిస్‌మస్‌కు ముందు, ఆ తర్వాత న్యూ ఇయర్‌ వరకూ హాలీవుడ్‌ సినిమాల హడావిడి మామూలుగా ఉండదు. ఈ ఏడాది క్రిస్‌మస్‌ సినిమా పండగ జోరు ఇంకాస్త ఎక్కువే ఉంది. డిసెంబర్‌ 1 నుంచే ఈ హంగామా మొదలైపోయింది. 2017 క్రిస్‌మస్‌ సీజన్‌లో హాలీవుడ్‌ను కవ్విస్తోన్న సినిమాలు కొన్ని... 
ది షేప్‌ ఆఫ్‌ వాటర్‌
ఈ సీజన్లో రిలీజ్‌కు ముందే భారీ అంచనాలను మూటగట్టుకున్న సినిమా ‘ది షేప్‌ ఆఫ్‌ వాటర్‌’. ఇప్పటికే పలు ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమైన ఈ సినిమాకు సూపర్‌ రెస్పాన్స్‌ వచ్చింది. డిసెంబర్‌ 8న థియేటర్లకు రానున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గులెర్మొ డెల్‌టొరొ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్‌ డ్రామా యూఎస్‌లో ఇండియా కంటే వారం ముందే (డిసెంబర్‌ 1) విడుదలైంది.

స్టార్‌ వార్స్‌ – ది లాస్ట్‌ జేడి
స్టార్‌ వార్స్‌ అభిమానులకు ఈ ఏడాది క్రిస్‌మస్‌ పండగ పదిరోజుల ముందే మొదలైపోతోంది. డిసెంబర్‌ 15న ప్రపంచవ్యాప్తంగా ‘స్టార్‌వార్స్‌ – ది లాస్ట్‌ జేడీ’ విడుదలవుతోంది. స్టార్‌ వార్స్‌ సీక్వెల్‌ ట్రయాలజీలో ఇది రెండో సినిమా. సాధారణంగానే స్టార్‌ వార్స్‌కు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. అదీ పండగ సీజన్‌లో వస్తోందంటే ఇక చెప్పక్కర్లేదు. ఫస్ట్‌ వీకెండ్‌కే ఈ సినిమా 200 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ. 1250 కోట్లు) వసూలు చేయొచ్చని ట్రేడ్‌ అంచనా వేస్తోంది. ఇక సినిమా బాగుంటే, న్యూ ఇయర్‌ వరకూ కాసుల వర్షమే!! రియాన్‌ జాన్సన్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

జుమాంజి – వెల్‌కమ్‌ టు ది జంగిల్‌
పండగ సీజన్లో యాక్షన్‌ సినిమా అభిమానులకు పండగలా రాబోతోన్న సినిమా ‘జుమాంజి’. 1995లో వచ్చిన ‘జుమాంజి’కి ఇది సీక్వెల్‌. జేక్‌ కస్దాన్‌ దర్శకత్వం వహించారు. డ్వెయన్‌ జాన్సన్, జాక్‌ బ్లాక్, కెవిన్‌ హార్ట్‌ తదితర స్టార్స్‌ నటించిన ఈ సినిమా కోసం ఇండియన్‌ మూవీ ఫ్యాన్స్‌ కూడా బాగా ఎదురు చూస్తున్నారు. ట్రైలర్‌తో యాక్షన్‌ సినిమా అభిమానులకు కావాల్సిన అన్ని హంగులూ ఈ సినిమాలో ఉన్నాయని తెలియడంతో ఇక సినిమాకు క్రేజ్‌ అలా పెరుగుతూనే పోతోంది. డిసెంబర్‌ 20న అమెరికాలో విడుదలవుతోన్న ఈ సినిమా ఇండియాలో డిసెంబర్‌ 29న విడుదల కానుంది.

పిచ్‌ పర్ఫెక్ట్‌ 3
‘పిచ్‌ పర్ఫెక్ట్‌’ ట్రయాలజీలో వస్తోన్న మూడో సినిమాయే ‘పిచ్‌ పర్ఫెక్ట్‌ 3’. కామెడీ సినిమా అభిమానులకు ఈ సీజన్లో బెస్ట్‌ అప్షన్‌ ఈ సినిమా. అన్నా కెండ్రిక్, రెబెల్‌ విల్సన్, హైలీ స్టీన్‌ఫీల్డ్‌ తదితర భారీ తారాగణం నటించిన ఈ సినిమా ఔట్‌ అండ్‌ ఔట్‌ నవ్వులు పూయిస్తుందన్న నమ్మకాన్ని కలిగిస్తోంది. డిసెంబర్‌ 22న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.
పైన చెప్పిన సినిమాలే కాకుండా హాలీవుడ్‌ సినీ అభిమానులు ఎంతో ప్రత్యేకంగా భావిస్తూ వచ్చిన రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి ప్రఖ్యాత దర్శకుడు స్పీల్‌బర్గ్‌ తెరకెక్కించిన ‘ది పోస్ట్‌’ అయితే, మరొకటి రొమాన్స్‌ జానర్‌ సినిమాల స్పెషలిస్ట్‌ ఉడీ అలెన్‌ తెరకెక్కించిన ‘వండర్‌ వీల్‌’.

వండర్‌ వీల్‌..
రొమాన్స్‌ జానర్లో పలు క్లాసిక్‌ సినిమాలను అందించిన ఉడీ అలెన్‌ తెరకెక్కించిన ‘వండర్‌ వీల్‌’ యూఎస్‌లో డిసెంబర్‌ 1నే విడుదలైంది. ఇండియన్‌ మార్కెట్లో ఈ సినిమా ఇంకా విడుదల కావాల్సి ఉంది. దర్శకుడి స్టైల్లో రొమాన్స్‌ జానర్లో ఓ మంచి సినిమాగా ‘వండర్‌ వీల్‌’కు పేరొస్తోంది. కేట్‌ విన్‌స్లెట్‌ ప్రధాన పాత్రలో నటించడం ఈ సినిమాకు మేజర్‌ అట్రాక్షన్‌.

ది పోస్ట్‌
స్పీల్‌బర్గ్‌ సినిమాల కోసం ప్రపంచమంతా ఎంతలా ఎదురు చూస్తుందో చెప్పక్కర్లేదు. అయితే ఆయన గత రెండు సినిమాలూ బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా ఆడలేదు. దీంతో ఇప్పుడు ఆయన అభిమానుల ఆశలన్నీ ‘ది పోస్ట్‌’ పైనే ఉన్నాయి. ఈ సినిమాకు సూపర్‌స్టార్‌ టామ్‌ హ్యాంక్స్‌ హీరో కావడం కూడా అంచనాలను పెంచింది. హిస్టారికల్‌ పీరియడ్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో మెరిల్‌ స్ట్రీప్‌ రోల్‌ సినిమాకే హైలైట్‌గా ఉంటుందట. యూఎస్‌లో కొన్ని చోట్ల డిసెంబర్‌ 22నే ఈ సినిమా విడుదలవుతున్నా, పూర్తి స్థాయిలో మాత్రం 2018 జనవరి 12న విడుదల కానుంది. అంటే స్పీల్‌బర్గ్‌ ఇండియన్‌ అభిమానులకు ‘ది పోస్ట్‌’ చూడాలంటే ఎదురుచూపులు తప్పవు.

మరిన్ని వార్తలు