‘కేసీఆర్‌ సర్‌.. నిన్ను నాయినా అని పిలవనా?’

17 Apr, 2020 11:10 IST|Sakshi

నటుడు, రచయిత ఉత్తేజ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెరపై వైవిధ్య పాత్రల్లో కనిపించి మెప్పించే ఈ నటుడిలో గొప్ప రచయిత దాగి ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుత, వాస్తవిక సంఘటనలపై తన అంతరంగంలో మెదిలిన భావాలను సూటిగా, నిక్కశ్చిగా చెప్పడం పాఠకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. గతంలో షార్ట్‌ కట్‌ అంటూ మానవాళి చేస్తున్న తప్పిదాలను ఉత్తేజ్‌ వేలెత్తి చూపించాడు. తాజాగా తెలంగాణ గడ్డపై కరోనా బారి నుంచి ప్రతీ ఒక్కరినీ కాపాడేవిధంగా నిర్ణయాలు తీసుకుంటూ, వారికి అండగా నిలుస్తూ భరోసా ఇస్తున్న సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఓ వీడియోను విడుదలచేశాడు. తన పదునైన, గుండెబరువెక్కె విధంగా ఉత్తేజ్‌ పలికిన మాటలు అందరని ఆకట్టుకునే,ఆలోచించే విధంగా ఉన్నాయి. ప్రస్తుతం ఉత్తేజ్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

‘మహమ్మారి కరోనా వైరస్‌ ప్రపంచ మానవాళిని, మానవ మనుగడను, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తోంది. ఈ సమయంలో ప్రజలందరూ స్వీయ నియంత్రణ, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ యుద్దం చేస్తున్నాం. అటువైపు మనందరి శ్రేయస్సు కోసం ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ అహర్నిశలు, అలుపులేకుండా ప్రజాశ్రేయస్సే పరమావరిధిగా తన పరిపాల దక్షతతో సరైన నిర్ణయాలతో తెలంగాణ గ​డ్డపై ప్రతీ ఒక్కరినీ కాపాడేవిధంగా కొండంత అండగా నిలువెత్తు మానవత్వంతో మనందరికోసం, మనకోసం నడుస్తున్నందుకు కేసీఆర్‌ సర్‌ నిన్ను నాయినా అని పిలవాలని ఉందే.. 

నిన్ను నాయినా అని పిల‌వాల‌ని వుంది పిల‌వ‌నా.. మొన్ననిన్ను టీవీలో చూసినంక నీ మాట‌లు ఇన్నంకా నీ చెయ్యితోని మా కండ్ల నీళ్లు తుడిచినట్టు.. మా భుజాల మీద చేయి వేసి ధైర్యం చెప్పిన‌ట్టు.. మా ఇంట్లో మ‌నిషివైన‌ట్టు కొట్టిందే. నిన్ను నాయినా అని పిల‌వాల‌నుంది పిల‌వ‌నా నాయినా. మొన్న నువ్వు ఇచ్చిన భరోసాకు ఆల్లు ఈల్లని కాదు మొత్తం అందరు ఊపిరి పీల్సుక్నురు పానాలు లేచివచ్చినయ్‌ అన్నరు తెలంగాణ వెన్నుపూసగ నిల్శినవ్‌ గుండె దమ్మువై నడుస్తున్నవ్‌ మా బాగోగులు పట్టించుకుంటున్నవ్‌నిన్ను చూసినా నీ మాట‌లిన్నా బ్ర‌తుకుమీద న‌మ్మ‌కం వ‌స్త‌ది.. భ‌యం అన్న‌ది ఆమ‌డ దూరం బోత‌ది. దేన్నైనా జ‌యిస్తాం అనిపిస్త‌ది.

మేం చేసుకున్న అదృష్ట‌మే నువ్వు. ఇది నా ఒక్క‌డి మాట కాదు, తెలంగాణ వాళ్లే కాదు తెలుగు వాళ్లంద‌రి మాట‌. అందరు సల్లగుండాలె మనుషులు పోతే వస్తరా అని మానవ వనరుల విలువలు చెప్తివి. తెలంగాణ బిడ్డ‌లే కాదు ఈ గడ్డ‌మీద వున్న ఏ బిడ్డ కూడా ఉపాసం పండొద్ద‌ని అమ్మ‌లెక్క అర్సుకున్న‌వ్ ఆఫీసర్లకి ఆర్డర్లిస్తివి ఆపన్నుల ఆదుకుంటివి అనాథల అక్కున చేర్చుకుంటివి గీ ‘కరోనా’ని తరుముకుంట పానాలు నిలుపుతుంటివి..! నాయిన లెక్క చూసుకున్న‌వ్‌. అప్పుడెప్పుడో ఎన‌క‌ట శ్రీ‌కృష్ణుడు గోవ‌ర్ధ‌న ప‌ర్వ‌త‌మెత్తి గోవుల‌ను కాపాడినట్టు క‌రోనా బారిన ప‌డ‌కుండా ఆ గ‌డ్డ మీదున్నోళ్లు ఓట‌ర్లు కాదు మ‌నుషుల‌ని కాపాడిన‌వ్‌. క‌న‌ప‌డ‌న వాడు దేవుడైతే నాయినా నువ్వు మాకు క‌నిపించే దేవునివి. నువ్వు స‌ల్ల‌గుండాలె నాయినా.. నీ కొడుకులు బిడ్డ‌లు స‌ల్ల‌గుండాలే’అంటూ ఉత్తేజ్‌ ఆ వీడియోలో పేర్కొన్నాడు.

చదవండి: 
కేసీఆర్‌ తాత నిన్ను పాస్‌ చేసిండుపో.. 
లాక్‌డౌన్‌: ఏకబిగిన 70 కి.మీ. నడక
‘మా ఇంటి బిడ్డ(కేసీఆర్‌) పైసలు పంపిండు’

మరిన్ని వార్తలు