సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం

29 Jul, 2018 02:34 IST|Sakshi
బెనర్జీ, భరత్‌ చౌదరి, వీరినాయుడు, శివాజీరాజా

తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి నూతన అధ్యక్షుడిగా పూర్వి పిక్చర్స్‌ అధినేత వి. వీరినాయుడు ఏక గ్రీవంగా ఎన్నికైయ్యారు. ఉపాధ్యక్షునిగా వి. సాగర్‌ని ఎంపిక చేశారు. వీరినాయుడు మాట్లాడుతూ– ‘‘తెలుగు ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షునిగా అవకాశం వచ్చినందుకు ఆనందంతోపాటు గర్వంగానూ ఉంది. ప్రతి ఏడాది ఒక్కో సెక్టార్‌ నుంచి ఈ ఎంపిక జరుగుతుంది. ఈ ఏడాది పంపిణీదారుల నుంచి నాకు అవకాశం రావడం జరిగింది.

ఇదివరకు నేను ఎగ్జిక్యూటివ్‌ కమిటీలో మెంబర్‌గా ఉండటం వల్ల అన్ని సెక్టార్ల సమస్యలపై నాకు అవగాహన ఉంది. ఎగ్జిబిటర్లకు జీఎస్టీతో సహా పలు రకాల సమస్యలు ఉన్నాయి. ఇలాంటి సమస్యలను తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం మా టీమ్‌తో కృషి చేస్తాను. డిజిటల్‌ ప్రొవైడర్ల సమస్యలపై కూడా దృష్టి పెడతాం. ఇండస్ట్రీకి మేలు చేసే మంచి పనులు చేయడానికి కృషి చేస్తాను’’ అన్నారు. ‘‘కొత్త అధ్యక్షుడు వీరినాయుడు ఎన్నో మంచి పనులు చేస్తారని ఆశిస్తున్నాను.

ఈ ఏడాది తెలుగు సినీ పరిశ్రమకు బెస్ట్‌ అవుతుందని చెప్పగలను’’ అన్నారు ఉప కార్యదర్శి మోహన్‌ వడ్లపట్ల. నిర్మాతల సెక్టార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ వల్లూరిపల్లి రమేష్‌ మాట్లాడుతూ– ‘‘డిస్ట్రిబ్యూటర్‌ కమ్‌ ఎగ్జిబిటర్‌గా వీరినాయుడుకి ఎంతో అనుభవం ఉంది. సబ్సిడీ విషయంలో నిర్మాతల సమస్యలను పరిష్కరించాలి. డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్ల సమస్యలను త్వరగా పరిష్కరించాలి. పాతవారితో కుదరక పోతే కొత్త డీఎస్‌పీలను ఎంపిక చేయాలి’’ అన్నారు.

పాత కమిటీలోని కె. బసిరెడ్డి, ముత్తవరపు శ్రీనివాస బాబు ప్రస్తుత కమిటీలో ఉపాధ్యక్షులుగా కొనసాగ నున్నారు. నిర్మాతల సెక్టార్‌ కౌన్సిల్‌ చైర్మెన్‌గా వల్లూరిపల్లి రమేష్, స్టూడియోస్‌ సెక్టార్‌ కౌన్సిల్‌ చైర్మెన్‌గా వై. సుప్రియ, డిస్ట్రిబ్యూటర్‌ సెక్టార్‌ కౌన్సిల్‌ చైర్మెన్‌గా వి. నాగేశ్వరరావు, ఎగ్జిబిటర్‌ కౌన్సిల్‌ చైర్మెన్‌గా జీ. వీరనారాయణ బాబు కొనసాగుతారని జనరల్‌ బాడీ ప్రతినిధులు పేర్కొన్నారు. కొత్త కార్యవర్గానికి ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా, వైస్‌ ప్రెసిడెంట్‌ బెనర్జీ, నిర్మాత సురేష్‌ కొండేటి అభినందించారు.

మరిన్ని వార్తలు