కల్తీ మాఫియాపై పోరాటం

26 Sep, 2019 00:39 IST|Sakshi
కేథరిన్‌ థెరిస్సా

సిద్ధార్థ్‌ హీరోగా సాయి శేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వదలడు’. దెయ్యం అయినా సరే... అనేది ఉపశీర్షిక. ఈ చిత్రంలో కేథరిన్‌ థెరిస్సా కథానాయికగా నటించారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా వచ్చే నెల 11న విడుదల కానుంది. టి. అంజయ్య సమర్పణలో పారిజాత క్రియేషన్స్‌ పతాకంపై టి. నరేష్‌ కుమార్, టి. శ్రీధర్‌ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. ప్రొడ్యూసర్‌ సెక్టార్‌ చైర్మన్‌ ఏలూరు సురేందర్‌రెడ్డి, ఫిల్మ్‌ చాంబర్‌ జాయింట్‌ సెక్రటరీ నట్టికుమార్‌ కలిసి ఈ సినిమా టీజర్‌ను బుధవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు.

ఈ సందర్భంగా సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ– ‘‘పదేళ్లుగా అంజయ్యగారు నాకు పరిచయం. ఆయనకు సినిమాలంటే ప్యాషన్‌. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు నిర్మిస్తుంటారు’’ అన్నారు. ‘‘అంజన్న, నేను మంచి స్నేహితులం. ఆ మధ్య సిద్ధార్థ్‌ నటించిన ‘గృహం’ హిట్‌ చిత్రంగా నిలిచింది. ‘వదలడు’ అంతకన్నా పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు నట్టికుమార్‌. ‘‘రియల్‌ ఎస్టేట్‌లో అంచెలంచెలుగా ఎదిగాం. అలాగే ఇండస్ట్రీలోనూ పైకి రావాలనుకుంటున్నాం. మా బ్యానర్‌లో వచ్చే సినిమాలు పూర్తి వినోదాత్మకంగా ఉండాలన్నదే మా లక్ష్యం. మా బ్యానర్‌లో వచ్చిన తొలి చిత్రం ‘ప్రేమ అంత ఈజీ కాదు’. రెండో చిత్రం ‘కిల్లర్‌’ మంచి విజయం సాధించింది.

‘మిస్టర్‌ కేకే’ చిత్రానికి మంచి పేరొచ్చింది. ఇప్పుడు ‘వదలడు’ సినిమా విడుదల చేస్తున్నాం. విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు టి. అంజయ్య. ‘‘మేం అందించే ప్రతి సినిమాలో ఏదో ఒక మేసేజ్‌ ఉంటుంది. కల్తీ మాఫియాపై ఓ యువకుడు ఎలా పోరాటం చేశాడు? ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? ఇలాంటి సమయంలో హీరోయిన్‌కి ఏమైంది? అనే విషయాలు సినిమాలో ఆసక్తికరంగా ఉంటాయి. దాదాపు 450 థియేటర్స్‌లో ఈ సినిమాను విడుదల చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత టి. శ్రీధర్‌. ‘‘మంచి కాన్సెప్ట్‌ సినిమాలను నిర్మించాలనే ఇండస్ట్రీలోకి వచ్చాం. ‘వదలడు’ సినిమా మంచి విజయం సాధిస్తుంది’’ అన్నారు టి. నరేష్‌ కుమార్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా