హీరోగా విలన్‌ తనయుడు

25 Aug, 2018 02:57 IST|Sakshi
మల్లిఖార్జున, దేవరాజ్, ప్రణమ్‌ దేవరాజ్, చంద్రలేఖ, సాయి శివన్‌

‘ఎస్పీ పరశురాం, సమరసింహారెడ్డి, యజ్ఞం, ఎవడైతే నాకేంటి, భరత్‌ అనే నేను’ తదితర చిత్రాల ద్వారా విలన్‌గా తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ గుర్తింపు పొందారు కన్నడ నటుడు దేవరాజ్‌. తాజాగా ఆయన తనయుడు ప్రణమ్‌ దేవరాజ్‌ ‘వైరం’ చిత్రంతో తెలుగులోకి హీరోగా పరిచయవుతున్నారు. సాయి శివన్‌.జె దర్శకత్వంలో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున పిక్చర్స్‌ పతాకంపై జె.ఎం.కె నిర్మిస్తున్న ఈ చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. డైరెక్టర్‌ వి.ఎన్‌.ఆదిత్య కెమెరా స్విచ్చాన్‌ చేయగా, మరో దర్శకుడు వి.సాగర్‌ క్లాప్‌ ఇచ్చారు. తొలి సన్నివేశానికి  శ్రీవాస్‌ గౌరవ దర్శకత్వం వహించారు.

దేవరాజ్‌ మాట్లాడుతూ– ‘‘తెలుగు, కన్నడలో ఎన్నో చిత్రాల్లో నటించి నంది అవార్డు అందుకున్నా. మా అబ్బాయిని తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయం చేస్తున్నా. నాపై చూపిన అభిమానాన్ని తనపైనా చూపిస్తారని ఆశిస్తున్నా’’ అన్నారు. ‘‘చక్కని ప్రేమకథతో పాటు పక్కా యాక్షన్‌ ప్యాక్డ్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉంటుంది. తెలుగు, కన్నడలో ఒకేసారి తెరకెక్కిస్తున్నాం’’ అన్నారు సాయి శివన్‌. ‘‘కుమారి 21ఎఫ్‌’ కన్నడ రీమేక్‌లో నటించా. ఆ చిత్రం హిట్‌ అయ్యి నన్ను హీరోగా నిలబెట్టింది. తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించడానికి శాయశక్తులా కృషిచేస్తా’’ అన్నారు దేవరాజ్‌. ‘‘సెప్టెంబర్‌ మొదటి వారం నుంచి మా చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అవుతుంది’’ అన్నారు నిర్మాత జె.ఎం.కె. ఈ చిత్రానికి కెమెరా: గోపీనాథ్, సంగీత్‌: సాగర్‌ మహతి.

మరిన్ని వార్తలు