అటూ ఇటూ తిరిగి నర్తనశాల నాకే వచ్చింది

10 Aug, 2018 05:20 IST|Sakshi
శ్రీనివాస చక్రవర్తి, వంశీ పైడిపల్లి, నాగశౌర్య, యామినీ, కష్మీరా, ఉష, సాగర్‌ మహతి, శంకర్‌ ప్రసాద్‌

నాగశౌర్య

‘‘కొడుకు కలల్ని అర్థం చేసుకుని తనకి నచ్చినట్లు సినిమాలు తీస్తున్నారు నాగశౌర్య తల్లిదండ్రులు.  వారి ఆశీర్వాదానికి మించిన ఆశీస్సుల కంటే ఇంకేం కావాలి. ‘నర్తనశాల’ వంటి క్లాసిక్‌ టైటిల్‌తో తీసిన ఈ చిత్రంలో నాగశౌర్య విభిన్నమైన పాత్రలో నటించారు. టీజర్‌లో కొత్తదనం కనిపించింది. నా మిత్రుడు శ్రీనివాస్‌కి ఈ చిత్రం మంచి హిట్‌ తీసుకొస్తుంది. ఈ సినిమా కెమెరామేన్‌ విజయ్‌ సి.కుమార్‌ నాన్నగారు పాత ‘నర్తనశాల’ చిత్రానికి కెమెరా బాధ్యతలు నిర్వర్తించడం విశేషం’’ అని దర్శకుడు వంశీ పైడిపల్లి అన్నారు.

నాగశౌర్య హీరోగా, కష్మీర పరదేశి, యామిని భాస్కర్‌ హీరోయిన్లుగా శ్రీనివాస చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నర్తనశాల’. శంకర ప్రసాద్‌ మూల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ఉష మూల్పూరి నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ని వంశీ పైడిపల్లి రిలీజ్‌ చేశారు. నాగశౌర్య మాట్లాడుతూ– ‘‘2013లో నేను హీరోగా అవకాశాల కోసం తిరుగుతున్నప్పుడు శ్రీనివాస్‌ చక్రవర్తి ‘నర్తనశాల’ కథ వినిపించారు. చాలా బాగా నచ్చింది. అప్పు చేసి అయినా ఈ సినిమా నిర్మించాలనిపించింది.

అప్పటి నుంచి ఈ కథ అటూ ఇటూ తిరిగి మళ్లీ నా వద్దకే రావడం చాలా సంతోషంగా ఉంది. సినిమా తీస్తా. 15 కోట్లు పెట్టండి? అంటే ఏ తల్లిదండ్రులైనా ఆలోచిస్తారు. కానీ, నా తల్లిదండ్రులు మాత్రం నాపై ప్రేమతో చాలా ఖర్చుపెట్టి ఈ సినిమా తీశారు. వినోదాత్మకంగా తెరకెక్కిన చిత్రమిది’’ అన్నారు. ‘‘నా గురువు కృష్ణవంశీగారు. నాగశౌర్య, శంకర్‌ ప్రసాద్‌ల ప్రోత్సాహంతో నా కల తీరింది’’ అన్నారు శ్రీనివాస్‌ చక్రవర్తి. నటుడు శివాజీ రాజా, లైన్‌ ప్రొడ్యూసర్‌ బుజ్జి, ఎడిటర్‌ కోటగిరి వెంకటేశ్వరరావు, కొరియోగ్రాఫర్‌ విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు