ఇప్పుడు నా టైమ్‌ మొదలైంది

31 Oct, 2018 01:02 IST|Sakshi

‘‘ఇన్ని రోజులు తెలుగు సినిమాలు చేయకపోవడానికి కారణం తమిళం, కన్నడం, మలయాళ సినిమాల మీద ఎక్కువ దృష్టి పెట్టడమే. ప్రతిదానికి ఓ టైమ్‌ రావాలంటాం కదా. ఇప్పుడిలా డబ్బింగ్‌ సినిమాల ద్వారా ఆ టైమ్‌ వచ్చింది. రేపు స్ట్రయిట్‌ సినిమాలకూ వస్తుందేమో’’ అన్నారు వరలక్ష్మీ శరత్‌ కుమార్‌. విజయ్, కీర్తీ సురేశ్‌ జంటగా మురుగదాస్‌ తెరకెక్కించిన ‘సర్కార్‌’ లో వరలక్ష్మీ కీలక పాత్ర చేశారు. ఈ చిత్రం నవంబర్‌ 6న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా తొలిసారి తెలుగు మీడియాతో ముచ్చటించారు వరలక్ష్మీ. 

∙ఆర్టిస్ట్‌ అన్నాక అన్ని రకాల పాత్రలు చేయాలి. అందుకే హీరోయిన్, సెకండ్‌ హీరోయిన్, విలన్, గెస్ట్‌ రోల్స్‌ అనే తేడా చూడను. బహుశా అందుకేనేమో ఈ ఏడాది ఆల్రెడీ 4 సినిమాలు రిలీజయ్యాయి. మరో మూడు రిలీజ్‌ కాబోతున్నాయి.

∙విజయ్, మురుగదాస్‌ కాంబినేషన్‌ అంటే ఎవరైనా ఎగై్జట్‌ అవుతారు. నేనూ అంతే. సినిమాలో మంచి పాత్ర చేశాను. పాజిటీవా? నెగటీవా? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

∙పందెం కోడి 2, సర్కార్‌ సినిమాలకు తెలుగులో సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకున్నాను. పాత్ర తాలూకు ఎమోషన్స్‌ నటీనటులకే ఎక్కువ తెలుస్తాయి కాబట్టి మనది మనమే చెప్పుకుంటే ఇంకా పాత్రకు డెప్త్‌ వస్తుందని నమ్మకం. అందుకే కొంచెం కష్టమైనా డబ్బింగ్‌ చెప్పుకున్నాను.

∙నా ఫస్ట్‌ సినిమా ‘పోడా పోడి’ (2012) తర్వాత ఇప్పటివరకూ నేను చేసిన సినిమాలు తక్కువ. ఆ మాటకొస్తే గతేడాది నుంచే ఎక్కువ సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు నా టైమ్‌ మొదలైంది.

∙మా నాన్నగారి (శరత్‌ కుమార్‌) పేరు వాడటం ఇష్టం ఉండదు. సొంతంగా ఎదగాలనే ఫిలాసఫీ నాది. ఇప్పుడందరూ వరలక్ష్మీ వాళ్ల నాన్నగారు శరత్‌ కుమార్‌ అంటుంటే కూతురిగా నాకు గర్వంగా ఉంది. ప్రస్తుతం నాన్నతో కలసి ‘పాంబన్‌’ అనే సినిమా చేస్తున్నా. 

∙లైంగికంగా వేధిస్తే బయటకు చెప్పాలి. సెలబ్రిటీలుగా మేం చెబితే బయట వాళ్లకు ఓ ధైర్యం వస్తుందని దాదాపు ఏడాదిన్నర క్రితమే నాకు జరిగిన ఓ చేదు అనుభవం గురించి బయటకు చెప్పాను. ‘మీటూ’ ఉద్యమం స్టార్ట్‌ అవ్వకముందే క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి మాట్లాడాను. ‘మీటూ’ ఉద్యమం ముఖ్య ఉద్దేశం ‘నేమ్‌ అండ్‌ షేమ్‌’. అంటే.. స్త్రీల పట్ల తప్పుగా ప్రవర్తించిన వారి పేరు బయటపెట్టి, పరువు తీయడం. అలా చేస్తే భవిష్యత్తులో మరొకరు ఆ తప్పు చేయడానికి భయపడతారు. పాత తరం హీరోయిన్లు క్యాస్టింగ్‌ కౌచ్‌ అనేది ఇండస్ట్రీలో కామన్‌ అని పాపం తలవొంచి ఉండొచ్చు. అందర్నీ అనడంలేదు. కానీ ఇప్పుడు మేం మార్పు తీసుకొస్తే, భవిష్యత్తు తరం వాళ్లు హాయిగా పని చేసుకునే వాతావరణం ఉంటుంది. బ్యాగ్రౌండ్‌ ఉన్నవాళ్లు.. లేనివాళ్లు అని ఉండదు. పవర్‌ని తప్పుగా వాడుకోవాలనుకున్నవాళ్లు ఎవర్నీ వదలరు. ప్రశ్నించే అలవాటు, అనిపించింది బయటకు చెప్పే స్వభావం నాకు చిన్నప్పటి నుంచే అలవడింది. తప్పు ఎవరిదైతే వాళ్ల వైపు వేలు ఎత్తి చూపించడానికి భయపడను. అది మా నాన్నగారు అయినా సరే.

∙మరో ఐదేళ్లలో మిమ్మల్ని ఎక్కడ ఊహించుకుంటున్నారు అని అడగ్గా – ‘‘రాజకీయాల్లో. తప్పకుండా రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశం ఉంది. జయలలితగారి వారసురాలు అనిపించుకోవాలనుంది. జయలలితగారు రాష్ట్రాన్ని పాలించిన తీరు, విధానం, ఆమె జర్నీ కచ్చితంగా స్ఫూర్తినిస్తుంది. ఆవిడ మనల్ని వదిలి వెళ్లాక తమిళనాడు రాజకీయాల్లో ఒక శూన్యం ఏర్పడింది. దాన్ని నింపేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. చూద్దాం ఏమౌతుందో. కమల్‌ హాసన్‌గారు, రజనీకాంత్‌గారిలో ఎవరు గెలుస్తారు? అని ప్రశ్నించగా నవ్వి ఊరుకున్నారు.

∙విశాల్‌తో నేను డేటింగ్‌ చేయడం లేదు. మేమిద్దరం బెస్ట్‌ ఫ్రెండ్స్‌ మాత్రమే. ఒకవేళ విశాల్‌కి పెళ్లి అయినా కూడా మేం ఇప్పటిలానే బెస్ట్‌ ఫ్రెండ్స్‌లా ఉంటాం. తను నన్ను సోల్‌మేట్‌ అనడానికి కారణం మేం అంత మంచి ఫ్రెండ్స్‌ కావ డమే. 

మరిన్ని వార్తలు