అంచనాలకు అందని వర్ణ

17 Jul, 2013 01:32 IST|Sakshi
అంచనాలకు అందని వర్ణ

7/జి బృందావన కాలనీ, ఆడవారి మాటలకు అర్థాలు వేరులే, యుగానికొక్కడు చిత్రాలు... దర్శకునిగా సెల్వరాఘవన్ ప్రతిభకు నిలువుటద్దాలు. దక్షిణాది ప్రేక్షకులందరికీ ఈ చిత్రాలతో ఇష్టుడయ్యారు సెల్వరాఘవన్. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘వర్ణ’. ఆర్య, అనుష్క ముఖ్య తారలుగా రూపొందిన ఈ చిత్రాన్ని 70 కోట్ల భారీ వ్యయంతో పీవీపీ సినిమా పతాకంపై పరం వి.పొట్లూరి నిర్మిస్తున్నారు. భారతీయ చలనచిత్ర చరిత్రలో ముందెన్నడూ లేని విజువల్ ఎఫెక్ట్స్‌తో ఈ చిత్రం తెరక్కెతోందని సమాచారం. పలు విజయవంతమైన హాలీవుడ్ చిత్రాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించిన కేత్ డెలివిన్ సంస్థ ఈ చిత్రానికి పనిచేస్తుండటం విశేషం.
 
 ఈ చిత్ర సమర్పకుడు ప్రసాద్ వి.పొట్లూరి మాట్లాడుతూ-‘‘విజువల్ ఎఫెక్ట్స్‌కు ప్రాధాన్యమున్న సినిమా ఇది. అయినా.. కథ, కథనాలకే తొలి ప్రాధాన్యత ఇచ్చారు దర్శకుడు. అంచనాలకు అందని రీతిలో కథ, కథనాలు సాగుతాయి. భారతీయ ప్రేక్షకుడు చూడని అద్భుతమైన లొకేషన్లలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఆర్య, అనుష్క పాత్రలు పలు కోణాలతో భిన్నంగా ఉంటాయి. ఛాలెంజ్‌గా తీసుకొని వారిద్దరూ ఈ పాత్రలు పోషించారు. హారిస్ జైరాజ్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఆగస్టులో ఘనంగా విడుదల చేస్తాం. సెప్టెంబర్‌లో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు.