కింగ్ ఖాన్ @ 50

1 Nov, 2015 23:16 IST|Sakshi
కింగ్ ఖాన్ @ 50

విధి విచిత్రమైనది. ఎవరినైనా చల్లగా చూసిందంటే చాలు.. అథః పాతాళం నుంచి ఆకాశానికి ఎత్తేస్తుంది. షారుక్ ఖాన్ జీవితం అందుకు ఓ ఉదాహరణ. ఒకప్పుడు 50 రూపాయల కోసం పని చేసిన షారుక్ ఇప్పుడు కోటీశ్వరుడు. ఒకప్పుడు బతుకు బండిని లాగడానికి టీ బండి నడిపిన షారుక్ ఇప్పుడు బెంజ్ కార్‌లో తిరుగుతున్నాడు. ‘బాలీవుడ్ బాద్‌షా’, ‘కింగ్ ఖాన్’ అనే బిరుదులను సొంతం చేసుకుని, తిరుగులేని నటుడిగా దూసుకెళుతున్నాడు. నేడు ఈ బాలీవుడ్ బాద్‌షా 50వ పుట్టినరోజు. ఈ సందర్భంగా షారుక్ ఖాన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు.
 
* షారుక్ ఖాన్ అసలు పేరు ‘అబ్దుల్ రహ్మాన్’. షారుక్‌కి అతని బామ్మ పెట్టిన పేరిది. అయితే, ఆ పేరుని అధికారికంగా ఎక్కడా వాడలేదు. ఐదారేళ్ల వయసు వరకూ బామ్మ దగ్గర, ఆ తర్వాత  తల్లిదండ్రుల దగ్గర పెరిగాడు. తల్లిదండ్రులు అతనికి పెట్టిన పేరు ‘షారుక్ ఖాన్’. దాన్నే అధికారికంగా వాడుతున్నాడు.

* ఆర్మీలో చేరాలన్నది షారుక్ కల. అందుకే ఆర్మీ స్కూల్‌లో చేరాడు. షారుక్ తల్లికి మాత్రం తన కొడుకు ఆర్మీలో చేరడం ఇష్టం లేదు. దాంతో ఆ ఆలోచన విరమించుకున్నాడు.

* షారుక్ తండ్రి స్వాత్రంత్య సమరయోధుడు. కొంత కాలం తర్వాత చిన్న వ్యాపారం మొదలుపెట్టారాయన. ఢిల్లీలోని ‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా’లో ఓ టీ షాప్ నడిపేవారాయన. ఆ టీ షాప్‌కి వెళ్లినప్పుడే షారుక్‌కి యాక్టింగ్ మీద ఆసక్తి ఏర్పడింది. ఆ స్కూల్లోనే యాక్టింగ్ నేర్చుకున్నాడు. అప్పుడు బుల్లితెర నిర్మాతల దృష్టిలో పడ్డాడు. పలు టీవీ సీరియల్స్‌లో నటించాడు. వ్యాఖ్యాతగా కూడా చేశాడు.

* షారుక్ తొలి సంపాదన 50 రూపాయలు. ప్రముఖ గాయకుడు పంకజ్ ఉదాస్ నిర్వహించిన ఓ సంగీత కచేరీలో ప్రేక్షకులకు సీట్స్ చూపించే వ్యక్తిగా పని చేసినందుకు షారుక్ తీసుకున్న జీతం అది. అప్పట్లో ఢిల్లీలో ఉండేవాడు. ఆ యాభై రూపాయలు పారితోషికం తీసుకుని ఆగ్రా వెళ్లి, తాజ్‌మహల్ చూశాడు.

* స్పోర్ట్స్ అంటే షారుక్‌కి చాలా ఇష్టం. చదువుకునే రోజుల్లో ఫుట్‌బాల్, హాకీ టీమ్స్‌కి కెప్టెన్‌గా చేశాడు. జాతీయ స్థాయిలో క్రికెట్ కూడా ఆడాడు.

* మధ్యతరగతి కుటుంబానికి చెందిన షారుక్ సినిమాల్లోకి రాకముందు ఢిల్లీలో ఓ రెస్టారెంట్ నడిపాడు.
 
* షారుక్ తండ్రి 1981లో, ఆ తర్వాత పదేళ్లకు అతని తల్లి చనిపోయారు. తల్లి మరణాన్ని తట్టుకోలేక డిప్రెషన్‌కి గురయ్యాడు షారుక్. అందులోంచి బయటపడటానికి ఫుల్ టైమ్ ఆర్టిస్ట్‌గా చేయాలనుకున్నాడు. అప్పుడే ఢిల్లీ నుంచి ముంబయ్‌కి మకాం మార్చాడు. ‘దీవానా’ చిత్రంలో కథానాయికునిగా చేసే అవకాశం తెచ్చుకుని,  తొలి చిత్రంలోనే మంచి గుర్తింపు సాధించారు.

* ‘దీవానా’ తర్వాత వరుసగా సినిమాలు అంగీకరించేశారు. నాయకుడిగా మాత్రమే కాదు.. ‘డర్’, ‘బాజీగర్’, ‘అంజామ్’, ‘డాన్’, ‘డాన్ 2’ వంటి చిత్రాల్లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేసి, తనలో మంచి ప్రతినాయకుడు కూడా ఉన్నాడని నిరూపించుకున్నారు.

* వ్యక్తిగతంగా షారుక్ ఖాన్ పేరు ఆయనకు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. అలాగే, తెరపై ‘రాహుల్’ పేరుతో ఆయన చేసిన పాత్రలు హిట్టయ్యాయి. ‘దిల్ తో పాగల్ హై’, ‘కుచ్ కుచ్ హోతా హై’, ‘కభీ ఖుషీ కభీ గమ్’, ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’తో పాటు మరో ఐదారు చిత్రాల్లో షారుక్ పాత్ర పేరు ‘రాహుల్’. ఈ చిత్రాలన్నీ హిట్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే, ‘రాజు బన్ గయా జెంటిల్‌మేన్’, ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’,‘ చల్తే చల్తే’, ‘రబ్ నే బనా దీ జోడి’ చిత్రాల్లో ఆయన పాత్రల పేరు ‘రాజ్’ కావడం విశేషం.

* దాదాపు పదహారు చిత్రాల్లో షారుక్ చనిపోతారు. వాటిలో ‘బాజీగర్’, ‘డర్’, ‘దిల్ సే’, ‘దేవ్‌దాస్’ వంటి చిత్రాలు ఉన్నాయి.

* బాలీవుడ్‌లో ఉన్న ‘హ్యాపీ కపుల్స్’లో షారుక్, గౌరీఖాన్‌ల జంట ఒకటి. గౌరీని షారుక్ కలిసినప్పుడు అతని వయసు 18. అప్పుడు గౌరి వయసు 14. నాలుగైదేళ్లు ప్రేమించుకుని ఆ తర్వాత పెళ్లాడారు. ఈ దంపతులకు ఆర్యన్, సుహానా అనే కొడుకూ, కూతురూ ఉన్నారు. రెండేళ్ల క్రితం సరోగసీ విధానం ద్వారా పుట్టిన బాబుకి ‘అబ్రామ్’ అని పేరు పెట్టారు.

* రాత్రి నిద్రపోయేటప్పుడు షారుక్ ఇస్త్రీ చేసిన పైజామాలనే వేసుకుంటారు. కలలో ఎవరైనా ప్రత్యేకమైన వ్యక్తి వస్తే.. అందుకే ఇస్త్రీ చేసిన పైజామా వేసుకుంటానని ఓ సందర్భంలో షారుక్ పేర్కొన్నారు.

>