నేను ప్రేమికుణ్ణి... కానీ లవర్‌ లేదు!

10 Feb, 2018 00:30 IST|Sakshi
వరుణ్‌తేజ్

‘‘బాబాయ్‌ (పవన్‌ కల్యాణ్‌) ‘తొలిప్రేమ’ టైమ్‌కీ ఇప్పటికీ టెక్నాలజీలో చాలా మార్పులొచ్చాయి. అప్పట్లో సెల్‌ఫోన్లు ఉండేవి కావు. అందుకే.. ఆ సినిమాలో హీరోయిన్‌కి ప్రేమలేఖ రాస్తాడు హీరో. కానీ.. ఇప్పుడలా కాదు. సెల్‌ఫోన్లు, సోషల్‌ మీడియా బాగా విస్తరించింది. నా ‘తొలిప్రేమ’ చిత్రంలో తొలి షాట్‌లోనే హీరోయిన్‌కి ప్రేమ విషయం చెప్పేస్తా’’ అని వరుణ్‌తేజ్‌ అన్నారు. వరుణ్‌తేజ్, రాశీఖన్నా జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో బీవీయస్‌యన్‌ ప్రసాద్‌ నిర్మించిన ‘తొలిప్రేమ’ ఈరోజు విడుదలవుతోంది. వరుణ్‌  తేజ్‌ చెప్పిన విశేషాలు.

► వెంకీ నాకు ఐదారేళ్లుగా తెలుసు. నిహారిక షార్ట్‌ ఫిల్మ్స్‌కి రచనలో సహాయం చేశాడు. ఏ సినిమాకైనా కథే హీరో. తను చెప్పిన కథ నచ్చడం, ‘దిల్‌’ రాజుగారు వెంకీ గురించి చెప్పడంతో ఈ మూవీ చేశా. ఫస్ట్‌ సినిమా అయినా బాగా తీశాడు.

► ‘ఫిదా’ కంటే ముందే ‘తొలిప్రేమ’ సైన్‌ చేశా. అయితే ముందు ‘ఫిదా’ వస్తే బాగుంటుందనుకున్నాం. ఆ సినిమా తర్వాత  వస్తున్న ‘తొలిప్రేమ’ పై మంచి అంచనాలున్నాయి. ఇదొక ప్యూర్‌ లవ్‌స్టోరీ. నేను అనుకుంటే ఏదైనా చేయగలను.. నేను చేసేదే కరెక్ట్‌ అనుకునే పాత్ర నాది. ఏదైనా చేసేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలన్నది హీరోయిన్‌ పాత్ర. విభిన్న మనస్తత్వాలున్న మేం ప్రేమలో పడితే ఎలా ఉంటుందన్నది ఆసక్తికరం. కల్యాణ్‌ బాబాయ్‌ ‘తొలిప్రేమ’తో మా సినిమాని పోల్చలేం. మా సినిమా ఈ జనరేషన్‌కి నచ్చుతుంది.

► కాలే జీ పార్ట్‌ షూటింగ్‌ చేసేటప్పుడు నా కాలేజీ డేస్‌ గుర్తొచ్చాయి. నిజజీవితంలో నేను టాపర్‌ కాదు కానీ సినిమాలో ఎకనామిక్స్‌లో టాపర్‌గా కనిపిస్తా. ఈ సినిమా చూశాక ఎక్కడో ఒక్క చోటైనా ప్రేక్షకులు ఇది మా లైఫ్‌లో జరిగిందనుకుంటారు.

► చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే ప్రేమ. కాలేజ్‌ బంక్‌ కొట్టి మరీ సినిమాలు చూసేవాణ్ణి. హాలీవుడ్‌ లాంటి వైవిధ్యమైన చిత్రాలు తెలుగులో ఎందుకు తీయడం లేదనుకునేవాణ్ణి. కొత్త తరహా కథలకి మనమే శ్రీకారం చుడదామనుకుని వైవిధ్యమైన కథలు ఎంచుకుంటున్నా.

► మెగా ఫ్యామిలీలోని హీరోల్లో ఎవరికి నచ్చిన తరహా కథలు వారు ఎంచుకుంటున్నారు. నాకు ప్రయోగాలతో కూడిన వైవిధ్యమైన కథలంటే ఇష్టం. కథల ఎంపికలో ‘ఫిదా’ నుంచి కాన్ఫిడెన్స్‌ వచ్చింది. ఆ కథ నాన్నగారికి (నాగబాబు) చెప్పలేదు. ‘తొలిప్రేమ’ కథ చెప్పా. బాగుందన్నారు. పైగా.. నువ్వు చేయాలనుకుని మైండ్‌లో ఫిక్స్‌ అయితే చేస్తావుగా.. ఏదో మాట వరసకి నన్ను అడుగుతున్నావ్‌ అంటారు (నవ్వుతూ).

► హిట్‌ అవుతుందని చేసిన సినిమా ఫ్లాప్‌ అయినప్పుడు బాధగా ఉంటుంది. తప్పు ఎక్కడ జరిగిందా అని మళ్లీ జరగకుండా చూసుకుంటా. ‘కంచె’ లాంటి సినిమాలు ఇండస్ట్రీకి రావాలి. నిర్మాతలకు డబ్బులొస్తేనే అటువంటి సినిమాలు మరిన్ని చేస్తారు. మా అంజనా ప్రొడక్షన్‌లో ఓ సినిమా చేస్తా. టైమ్‌ పడుతుంది.

► ఇంత స్టార్‌డమ్, స్టేటస్‌ వదులుకుని బాబాయ్‌ (కల్యాణ్‌) సినిమాలు వదిలి రాజకీయాల్లోకి వెళ్లారంటే అందుకు గట్స్‌ కావాలి. నేనైతే వెళ్లను.

► రెండు నెలల గ్యాప్‌ తర్వాత ‘ఘాజి’ ఫేమ్‌ సంకల్ప్‌రెడ్డితో ఓ సినిమా చేయబోతున్నా. అంతరిక్షం నేపథ్యంలో ఆ సినిమా ఉంటుంది. నా కెరీర్‌లో అది ప్రతిష్టాత్మక చిత్రం అవుతుందనే నమ్మకం ఉంది. అనిల్‌ రావిపూడి ఓ పాయింట్‌ చెప్పాడు. కథ డెవలప్‌ చేయమన్నాం.

► సినిమాల్లో ప్రేమించడం తప్ప రియల్‌ లైఫ్‌లో లవ్‌లో పడలేదు. ‘వేలంటైన్స్‌ డే’కి ఏమీ లేదు. కాకపోతే ఆ  సెలబ్రేషన్స్‌ ఎలా ఉంటాయో తెలుసుకోడానికి నా ఫ్రెండ్స్‌తో కలిసి సెలబ్రేషన్స్‌ జరిగే ప్లేసెస్‌కి వెళ్లేవాణ్ణి. స్కూల్‌డేస్‌లో చిన్న క్రష్‌ తప్ప వేరే ఏం లేదు.

మరిన్ని వార్తలు