'కంచె' మూవీ రివ్యూ

23 Oct, 2015 08:00 IST|Sakshi
'కంచె' మూవీ రివ్యూ

టైటిల్ : కంచె
జానర్ ; పీరియాడిక్ రొమాంటిక్ యాక్షన్ డ్రామా
తారాగణం ; వరుణ్ తేజ్, ప్రగ్య జైస్వాల్, నికితిన్ ధీర్
దర్శకత్వం ; రాధాకృష్ణ జాగర్లమూడి (క్రిష్)
సంగీతం ; చిరంతన్ భట్
సినిమాటోగ్రఫి ; గుణశేఖర్ వియస్
నిర్మాత ; సాయిబాబు జాగర్లమూడి, వై. రాజీవ్ రెడ్డి


గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుం లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు క్రిష్. అతని దర్శకత్వంలో, మెగా వారసుడిగా భారీ మాస్ ఇమేజ్ ఉన్నా, ముకుందా లాంటి ఓ క్లాస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ రెండో ప్రయత్నంగా తెరకెక్కిన పీరియాడికల్ రొమాంటిక్ యాక్షన్ డ్రామా కంచె. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జరిగిన ప్రేమ కథ సన్నివేశాన్ని తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్ సర్కిల్స్లో భారీ హైప్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వరుణ్తో పాటు క్రిష్కు కూడా ఓ భారీ కమర్షియల్ సక్సెస్ అవసరమైన సమయంలో చేసిన కంచె, ఈ ఇద్దరికి ఎలాంటి రిజల్ట్ ఇచ్చిందో రివ్యూలో చూద్దాం.

కథ ;
1930 నాటి కథతో కంచె సినిమా మొదలవుతుంది. ధూపాటి హరిబాబు (వరుణ్ తేజ్) ఎంతో హుందా ఉండే మధ్య తరగతి అబ్బాయి. భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో శ్రద్దగా చదువుకుంటుంటాడు. అదే సమయంలో సమాజంలో జరిగే అన్యాయాలను చూసి సహించలేకపోతాడు. మనుషుల మధ్య దూరాలు పెరగటం ఎవరికి వారు కంచె వేసుకోని జీవించటం హరిబాబుకు నచ్చదు. అదే గ్రామంలో ఓ పెద్ద కుటుంబానికి చెందిన సీతాదేవి (ప్రగ్యా జైస్వాల్) హరిబాబుతో ప్రేమలో పడుతుంది. అయితే అక్కడి సామాజిక పరిస్థితులు కొంత మంది వ్యక్తులు వారి ప్రేమకు అడ్డుపడతారు.ఇలాంటి పరిస్థితుల్లో హరిబాబు తన ప్రేమను గెలిపించుకున్నాడా..? అసలు హరిబాబు సైనికుడిగా ఎందుకు మారాల్సి వచ్చింది.? అన్నదే మిగతా కథ.

నటీనటులు :
తొలి సినిమాతో పోలిస్తే వరుణ్ నటుడిగా మంచి పరిణతి కనబరిచాడు. యాక్షన్ సీన్స్తో పాటు రొమాంటిక్ సీన్స్లోనూ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా సైనికుడిగా, ప్రేమికుడిగా రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రను పోషించటంలో అతడు విజయం సాధించాడు. తొలి పరిచయం అయినా హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ తన నటనతో మెప్పించింది. రెండు మూడు సీన్స్లో తప్ప పర్ఫామెన్స్కు పెద్దగా స్కోప్ లేకపోయినా ఉన్నంతలో మంచి మార్కులే సాధించింది.

 

అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకుంది. విలన్గా నటించిన నికితిన్ ధీర్ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఎంత బలమైన విలన్ ఉంటే హీరో అంత గొప్పగా కనిపిస్తాడు. అందుకే నికితిన్ తన నటనతో హీరోయిజాన్ని ఎలివేట్ చేయడానికి చాలా కష్టపడ్డాడు. ఈ సినిమా తరువాత నికితిన్ టాలీవుడ్లో బిజీ విలన్ అయ్యే అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి. కథను మలుపు తిప్పే పాత్రలో అవసరాల శ్రీనివాస్, లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్, గొల్లపూడి మారుతిరావులు తమ పరిధి మేరకు అలరించారు.

సాంకేతిక నిపుణులు :
దర్శకుడిగా క్రిష్ గురించి కొత్తగా చెప్పకోవాల్సింది ఏమీలేదు. తన గత సినిమాల మాదిరిగానే, ఈ సినిమాలో కూడా హ్యమన్ ఎమోషన్స్ను అద్భుతంగా చూపించాడు. ఇంత వరకు సౌత్ స్క్రీన్ మీద రాని ఓ కొత్త కథను ఎంచుకున్న క్రిష్, ఆ కథను వెండితెర మీద ఆవిష్కరించటంలో వంద శాతం సక్సెస్ అయ్యాడు. ఈ సినిమా విషయంలో ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన మరో అంశం ఆర్ట్. రెండో ప్రపంచ యుద్ధం నాటి పరిస్థితులను కళ్లకు కట్టినట్టుగా చూపించాడు ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్. తొలిసారిగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ చిరంతన్ భట్ కూడా పర్వాలేదనిపించాడు. ఈ సినిమాకు మరో ఇంపార్టెంట్ ఎసెట్ గుణశేఖర్ వియస్ సినిమాటోగ్రఫి, పీరియాడిక్ లుక్, వార్ ఎపిసోడ్స్ ను అద్బుతంగా తెరకెక్కించాడు.

ప్లస్ పాయింట్స్ :
యుద్ధ సన్నివేశాలు
వరుణ్, ప్రగ్యల నటన
దర్శకత్వం
డైలాగ్స్

మైనస్ పాయింట్స్ :
స్లో నారేషన్
స్క్రీన్ ప్లే

ఓవరాల్గా 'కంచె' తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్లే సక్సెస్ఫుల్ సినిమా