ఈ యముడు చాలా డిఫరెంట్

4 Jun, 2014 01:01 IST|Sakshi
ఈ యముడు చాలా డిఫరెంట్

 ‘‘యమధర్మరాజు పాత్రలో తారకరత్న అద్భుతంగా నటించారు. అచ్చం పెద్దాయన ఎన్టీఆర్ పరకాయప్రవేశం చేసినట్టుగా అనిపించింది. ఇప్పటి వరకూ తెలుగు తెరపై రాని, కనీ వినీ ఎరుగని కథాంశమిది’’ అని నిర్మాత పి.ఎన్.ఎస్.గౌడ్ తెలిపారు. నందమూరి తారకరత్న యమధర్మరాజుగా నటించిన సోషియో - ఫ్యాంటసీ చిత్రం ‘వీడు చాలా వరస్ట్’. నందన్, నీరజ్, కృష్ణ, స్వప్న ఇందులో ముఖ్య తారలు. వెంకట్ పంపన దర్శకుడు. ఎస్.ఎల్.ఎన్.ఎస్. ఫిలిమ్స్ పతాకంపై పి.ఎన్.ఎస్. గౌడ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 6న విడుదల కానుంది.
 
  ఈ సందర్భంగా దర్శకుడు వెంకట్ పంపన మాట్లాడుతూ -‘‘ఇదొక విభిన్న తరహా సోషియో-ఫ్యాంటసీ చిత్రం. మనిషి అంతర్ముఖాన్ని ఆవిష్కరించే సినిమా ఇది. ఇప్పటివరకూ వచ్చిన యమ నేపథ్య చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. నరకానికి వచ్చిన హీరోని యమధర్మరాజే స్వయంగా మళ్లీ భూలోకానికి పంపిస్తాడు. అది ఎందుకనేది చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఇందులో 28 నిమిషాల పాటు గ్రాఫిక్స్ ఉన్నాయి. యముడిపై తీసిన పాట సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: ఈశ్వర్, సంగీతం: పార్థసారథి, సమర్పణ: లక్ష్మీ మల్లాగౌడ్, సహ నిర్మాత: నరేష్ గౌడ్.