జల్లికట్టు నేపథ్యంగా వీరతిరువిళా

24 Aug, 2017 01:49 IST|Sakshi
జల్లికట్టు నేపథ్యంగా వీరతిరువిళా

తమిళసినిమా: తమిళుల వీరత్వానికి చిహ్నం జల్లికట్టు క్రీడ. ఈ నేపథ్యంలో తెరకెక్కిన తొలి చిత్రం వీర తిరువిళా అని అంటున్నారు ఆ చిత్ర దర్శకుడు విజయ్‌ మురళీధరన్‌. ఈయన కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రాన్ని ఇరైవన్‌ సినీక్రియేషన్స్‌ పతాకంపై సి.సెల్వకుమార్‌ నిర్మిస్తున్నారు. ఈయన నిర్మించిన ఒరు కణవుపోల చిత్రం త్వరలో విడుదల కానుంది. వీర తిరువిళా చిత్రంలో సత్య,సెల్వం, సెల్వ కథానాయకులుగా నటించగా నాయకిగా తేనిక నటించారు. ఇతర ముఖ్య పాత్రల్లో పొన్‌వన్నన్, సింధియా, నజీర్, కాదల్‌సుకుమార్‌  నటించారు.

ఈఎస్‌.రామ్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ, ఇది జల్లికట్టు ప్రజలు నివశించే ప్రాంతం నేపథ్యంగా తెరకెక్కించిన చిత్రం అని చెప్పారు. పూర్వం జల్లికట్టు అనేది క్రీడ కాదన్నారు. అది వీర పోరాటం అని తెలిపారు. ఐదుగురు యువకులు జల్లికట్టు పోరాటంలో గెలిచి వారి ఊరికి మంచి పేరు తెచ్చిపెట్టిన కథే వీర తిరువిళా అని చెప్పారు. ఇది జల్లికట్టు క్రీడ నేపథ్యంలో తెరకెక్కించిన తొలి చిత్రం అని, ఆ తరువాత జల్లికట్టు క్రీడను నిషేధించడంతో ఈ చిత్ర విడుదలకు జాప్యం జరిగిందని తెలిపారు. చిత్ర షూటింగ్‌ను కారైక్కుడి, అమరావతి, పుదూర్, సీరావయల్, ఆకావయల్, నేమం, మేట్టూర్‌ పెరియతండా ప్రాంతాల్లో నిర్వహించినట్లు చెప్పారు. చిత్రాన్ని త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు.

>