నిజంగానే పోలీస్ శిక్షణ తీసుకున్నా : వెంకట్

2 Jul, 2014 01:12 IST|Sakshi
నిజంగానే పోలీస్ శిక్షణ తీసుకున్నా : వెంకట్

‘‘ఓ ఐఏయస్ అధికారి ముఖ్యమంతి అయితే ఎలా ఉంటుంది? యువతరం తలుచుకుంటే... సమాజంలో ఎలాంటి మార్పు తేగలరు? ఈ ప్రశ్నలకు సమాధానంగా మా ‘ఆ ఐదుగురు’ సినిమా ఉంటుంది’’ అని వెంకట్ అన్నారు. వెంకట్ ప్రత్యేక పాత్రలో రూపొందిన చిత్రం ‘ఆ ఐదుగురు’. అనిల్ జేసన్ గూడూరుని దర్శకునిగా పరిచయం చేస్తూ... సరితా పట్రా ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రేమ్‌కుమార్ పట్రా సమర్పిస్తున్న ఈ సినిమా ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో వెంకట్ విలేకరులతో ముచ్చటించారు.
 
 ‘‘ఇందులో నేను 40 మంది యువకులకు శిక్షణ ఇచ్చే పోలీస్ అధికారిని. నా శిక్షణ నుంచి బయటకొచ్చిన ఓ ఐదుగురు సమాజంలో ఎలాంటి చైతన్యాన్ని తెచ్చారన్నదే ఈ సినిమా ఇతివృత్తం. నా కెరీర్‌లో పోలీస్‌గా కనిపించడం ఇదే ప్రథమం. ఈ సినిమా కోసం ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీలో రవికుమార్ అనే ఎస్.ఐ దగ్గర నిజంగానే పోలీస్ శిక్షణ తీసుకున్నాను. కథ నచ్చడంతో పోలీసులు కూడా ఈ సినిమాకు ఎంతో సహకరించారు. 35 మంది నిజమైన పోలీసు మధ్య శిక్షణ తీసుకోవడం నిజంగా మరచిపోలేను. పోలీస్ పాత్రలో సహజత్వం కోసం ఎంతో కష్టపడ్డాను. వారి జీవన శైలిని అధ్యయనం చేశాను. డూప్ లేకుండా పోరాటాలు కూడా చేశాను. ఈ కారణంగా బలమైన దెబ్బలు తగిలి కొన్నాళ్లు షూటింగ్ కూడా నిలిచిపోయింది. ఇదంతా సినిమాపై ఇష్టంతో చేసిందే.
 
 ఈ సినిమాలోని ప్రతి పాత్రలో హీరోయిజం ఉంటుంది’’ అని వెంకట్ చెప్పారు. కథ నచ్చితే మల్టీస్టారర్ చిత్రాల్లో నటించడానికి తాను సిద్ధమని, ‘ఈగ’లో సుదీప్‌లా విలన్ పాత్రలు చేయడానికి కూడా తాను రెడీగా ఉన్నానని ఈ సందర్భంగా వెంకట్ వెల్లడించారు. చిత్ర పరిశ్రమలో హీరోల మధ్య ఆరోగ్యకరమైన వాతావరణం లేదని, కలిసి నటించడానికి అందరూ ముందుకొస్తే మంచి కథలొస్తాయని వెంకట్ పేర్కొన్నారు. చిన్న సినిమాలకు పరిశ్రమలో స్థానం లేకుండా పోతోందని, ఈ విషయమై పవన్‌కల్యాణ్‌ని కలవాలనుకుంటున్నానని, ఈ సమస్యను ఆయన మాత్రమే పరిష్కరించగలరని వెంకట్ అభిప్రాయపడ్డారు.