సోలోగా నా తొలి విజయం ఇది - సందీప్

4 Dec, 2013 00:53 IST|Sakshi
సోలోగా నా తొలి విజయం ఇది - సందీప్
 ‘‘మామూలుగా కొన్ని సినిమాలకు డివైడ్ టాక్ వస్తుంది. కానీ ఈ సినిమా ‘హిట్’ అని అందరూ అంటున్నారు. ఆ పదం వింటుంటే, మంచి అనుభూతి కలుగుతోంది. నన్ను ‘బోయ్ నెక్ట్స్ డోర్’ అంటారు. అందుకేనేమో తమ అబ్బాయిలా భావించి, ఫ్యామిలీతో కలిసి ఈ సినిమా చూస్తున్నారు. సోలోగా నేను సాధించిన తొలి విజయం ఇది’’ అన్నారు సందీప్‌కిషన్. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో సందీప్‌కిషన్, రకుల్‌ప్రీత్ జంటగా కిరణ్ నిర్మించిన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ గత వారం విడుదలైంది.
 
  హైదరాబాద్‌లో జరిగిన సక్సెస్ మీట్‌లో దర్శకుడు మాట్లాడుతూ-‘‘సినిమా బాగుందని చాలామంది ఫోన్ చేసి ప్రశంసిస్తున్నారు. మంచి చిత్రానికి ఆదరణ లభిస్తుందని మరోసారి ప్రూవ్ అయ్యింది’’ అన్నారు. ‘‘మామూలుగా నేనో సినిమాకి పని చేస్తే, కెమెరా వర్క్ బాగుందని ఫోన్ చేస్తారు. కానీ ఈ సినిమాకి డెరైక్టర్ అద్భుతం అని ఫోన్స్ వస్తున్నాయి. సందీప్ బాగా చేశాడు’’ అని ఛోటా కె.నాయుడు అన్నారు. ఆస్ట్రేలియా, కెనడా నుంచి వచ్చిన తన స్నేహితులు తెలుగు తెలియకపోయినా ఈ సినిమా చూసి, ఎంజాయ్ చేశారని రమణ గోగుల చెప్పారు. ఇంకా బ్రహ్మాజీ, రకుల్, సప్తగిరి తదితరులు ఆనందం వ్యక్తం చేశారు.