శ్రీప్రియ దర్శకత్వంలో వెంకీ

8 Jan, 2014 23:59 IST|Sakshi
శ్రీప్రియ దర్శకత్వంలో వెంకీ

 చంటి, చినరాయుడు, సుందరకాండ, అబ్బాయిగారు, సూర్యవంశం, రాజా, శీను, జెమిని, ఘర్షణ, బాడీగార్డ్... ఇలా వెంకటేష్ నటించిన రీమేక్ చిత్రాల జాబితా చాలానే ఉంది. ఇటీవల హిందీ ‘బోల్ బచ్చన్’ రీమేక్ ‘మసాలా’లో కూడా నటించిన విషయం తెలిసిందే. వెంకీ నటించిన రీమేక్ చిత్రాల్లో విజయం సాధించినవే ఎక్కువ. ప్రస్తుతం ఆయన హిందీ ‘ఓ మై గాడ్’ రీమేక్‌లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాజాగా, మరో రీమేక్‌ని కూడా అంగీకరించారు. మలయాళంలో జీతు జోసఫ్ దర్శకత్వంలో మోహన్‌లాల్ హీరోగా రూపొందిన ‘దృశ్యం’ని తెలుగులో పునర్నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
 
  ‘మాలిని 22’ చిత్రాన్ని నిర్మిస్తున్న రాజ్‌కుమార్ థియేటర్స్ సంస్థ ఈ చిత్రం రీమేక్ హక్కులను దక్కించుకుంది. ఈ చిత్రాన్ని వైడ్ యాంగిల్ క్రియేషన్స్‌తో కలిసి సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించనుంది. ‘మాలిని 22’కి దర్శకత్వం వహిస్తున్న శ్రీప్రియ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. లేడీ డెరైక్టర్‌తో సినిమా చేయడం వెంకీకి ఇదే మొదటిసారి అవుతుంది. మలయాళంలో ‘దృశ్యం’ చిత్రం ఘనవిజయం సాధించింది. ఆ చిత్రంలో మోహన్‌లాల్ సరసన మీనా కథానాయికగా నటించారు.మరి... తెలుగు రీమేక్‌లో కథానాయికగా ఎవర్ని ఎంపిక చేస్తారు తదితర వివరాలు త్వరలోనే తెలుస్తాయి.