అంధత్వం నుంచి అమరత్వానికి..

9 Oct, 2015 19:15 IST|Sakshi
అంధత్వం నుంచి అమరత్వానికి..

- కళ్లు లేకున్నా .. కలకాలం నిలిచిపోయే సంగీతం అందించిన రవీంద్ర జైన్
- బాలీవుడ్ మెస్ట్రో.. ఆథ్యాత్మిక ఆల్బమ్స్కు కేరాఫ్గా ప్రపంచ ఖ్యాతి
- మహాభారత్, రామాయణ్, అలీఫ్ లైలా తదితర సీరియళ్లకు ఆయన సంతీతమే ప్రాణం
- కిడ్నీ సంబంధిత వ్యాధితో ముంబైలో కన్నుమూత.. సంగీత లోకం దిగ్భ్రాంతి..


దక్షిణభారతాన్ని మేల్కొల్పేది..  'ఓం కౌసల్యా సుప్రజా రామా పూర్వా..' అంటూ ఎమ్మెస్ సుబ్బలక్ష్మి ఆలపించిన వేంకటేశ్వర సుప్రభాతం. మరి ఉత్తరాదిని..? అంతకు ముందు ఏదో తెలియదుగానీ, 80వ దశకం తర్వాత మాత్రం ఉత్తర భారతం మేల్కొంటున్నది 'ఓం నమః శివాయ నమ: శివాయః హరహర భోలే..' అనే రవీంద్ర జైన్ సంగీత సృష్టితోనే!

    
అది 1944, ఫిబ్రవరి 28.. అలీగఢ్ లో సంస్కృత పండితుడు, ఆయుర్వేద ఆచార్యుడిగా పేరుమోసిన ఇంద్రమణి జైన్ నివాసం. ఆయన భార్య కిరణ్ జైన్ మూడో సంతానానికి జన్మనిచ్చింది. మంత్రసాని పిల్లాడిని పరీక్షగా చూసింది. అన్నీ బాగున్నాయి. కళ్లు కూడా. కానీ చూపు లేదు. ఇంద్రమణి- కిరణ్ జైన్ లకు ఏడుగురు సంతానం వారిలో మూడోవాడు.. అంధుడు రవీంద్ర జైన్. అయితే చదువు నేర్పిన సంస్కారంతో ఆ కుటుంబం రవీంద్ర ను 'స్పెషల్' గా కాక సాధరణంగానే ట్రీట్ చేసేది. బ్లైండ్ స్కూలులో ప్రాథమిక విద్యసాగుతుండగానే.. రవీందర్ కు సంగీతం పట్ల ప్రేమ కలిగింది.

ఇంట్లో నిత్యం జరిగే భజనలు వింటూ.. పాడటం నేర్చుకున్న రవీంద్ర.. చుట్టుపక్కల ఆలయాల్లో జరిగే కార్యక్రమాల్లో ప్రత్యేక గీతాలు ఆలపించే స్థాయికి ఎదగాడు. ఆసక్తిని గుర్తించిన తల్లిదండ్రులు దిగ్గజాలైన జీఎల్ జైన్, జనార్థన్ శర్మ, పండిట్ నాథూరామ్ ల వద్ద శిక్షణ ఇప్పించారు. రవీంద్ర ప్రతిభను గుర్తించిన ప్రతిభూషణ్ జైన్ అనే ఆయన తన సినిమాకు పనిచేయమంటూ కొల్ కతా తీసుకెళ్లాడు. పదేళ్లతర్వాత.. అంటే 1972లో ముంబైలో అడుగుపెట్టాడు రవీంద్ర జైన్..

ఒక అంధుడు సంగీత దర్శకుడయ్యాడు అనే సంచలనం కంటే రవీంద్ర జైన్ అందించే ట్యూన్లే మరింత సంచలనాలు అయ్యేవి. చోర్ మచాచే షోర్ (1975), తీత్ గాతా చల్ (1975), చిత్ చోర్ (1976), అఖియో కే జరోఖోఃసే (1978) లాంటి చిత్రాలు అతడు వార్చిన సంగీతామృతంలో నాలుగు పలుకులు! సంగీతకారుడిగానే కాక పాటల రచయితగానూ విశేషంగా రాణించారాయన. అమితాబ్ బచ్చన్ కు తొలి మ్యూజికల్ హిట్ గా నిలిచిన 'సౌదాగర్' ఆయనదే.

రాజ్ కపూర్ తో రవీంద్ర జైన్ ది హిట్ కాంబినేషన్. రామ్ తెరీ గంగా మైలి, దో జాసూస్ చిత్రాలతో ప్రారంభమైన వారి మైత్రి చాలాకాలం కొనసాగింది. హిందీతోపాటు ఇతర భాషల్లోనూ దాదాపు 200 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారాయన. తెలుగులో నందమూరి తారకరామారావు 1991లో రూపొందించిన 'బ్రహ్మర్శి విశ్వామిత్ర' చిత్రానికి సంగీతం అందించింది రవీంద్రే! అటు మలయాళం, హర్వాణి, పంజాబి, గుజరాతి, భోజ్ పురి, బెంగాలీ, ఒరియా, రాజస్థానీ భాషల్లోనూ పలు చిత్రాలకు పనిచేశారు. మలయాళ గాయకుడు కె.జె. యేసుదాసు రవీంద్రకు మంచి మిత్రుడు కూడా. యేసుదాసును బాలీవుడ్ కు పరిచయం చేసిందికూడా ఆయనే.

ఓవైపు సినీ సంగీతమేకాక భక్తి పాటలనూ రూపొందిచే రవీంద్ర జైన్.. 1980లో ఆశా భోంస్లేతో కలిసి శివుణ్ని స్తుతిస్తూ ఓ ఆల్బం చేశారు. అందులోని 'ఓం నమః శివాయః ఓం నమః శివాయః' పాట దేశవ్యాప్తంగా పెనుసంచలనమైంది. ఉత్తరాదికి సుప్రభాతంలా మారిన ఆ పాట చాలా మంది ఫోన్లకు రింగ్ టోన్ కూడా. భారత దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరిగే అతి పెద్ద ఆథ్యాత్మిక వేడుకలపై రవీంద్రజైన్ ఆల్బమ్స్ రూపొందించారు. మహాభారతం సహా పలు ఆథ్యాత్మిక టీవీ సీరియళ్లకు నేపథ్య సంగీతం అందించింది కూడా రవీంద్రజైనే కావడం విశేషం. వీటిలో జై హనుమాన్, రామాయణం, శ్రీ కృష్ణ, అలీఫ్ లైలా, ఇతిహాస్ కి కహానియా, జై మహాలక్ష్మి, శ్రీ బ్రహ్మ విష్ణు మహేష్, సాయి బాబా , జై మా దుర్గా, దర్తీ కా వీర్ యోధ పృథ్వీరాజ్ చౌహాన్ తదితర సీరియళ్లు ఎంత ఆదరణ పొందాయో చెప్పనవసరం లేదు.

ఈ ఏడాదే (2015లో) రవీంద్ర జైన్ కు భారతదేశ నాలుగో అత్యున్నత పౌరపురస్కారం పద్మశ్రీ లభించింది. రామ్ తెరి గంగా మైలి, చిత్ చోర్, అఖియోన్ కే.. , చిత్రాలకు గానూ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. రెండు సార్లు బెస్ట్ లిరిసిస్ట్ గానూ ఫిలింఫేర్ లు సాధించారు. మూత్రనాళంలో ఇన్ ఫెక్షన్ రావడం, అది కిడ్నీల వ్యాధికి దారితీయడంతో అనారోగ్యానికి గురైన రవీద్రజైన్.. చాలా కాలంగా చికిత్స పొదతుతున్నారు. అలాంటి స్థితిలోనూ ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు నాగపూర్ వెళ్లి అపస్మారక స్థితికి లోనయ్యారు. ఎయిర్ ఆంబులెన్స్ ద్వారా ఆయనను ముంబైలోని జేజే ఆసుపత్రికి చేర్చారు. శుక్రవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు.

ప్రతికూలతను జయించడం, అక్కడి నుంచి ఉన్నత శిఖరాలకు చేరుకోవడం గురించి మాట్లాడాలంటే ముందుగా చెప్పుకోవలసింది ఆయన పేరే. అంధత్వంతో జన్మించి అటుపై దానిని జయించి సంగీత దర్శకుడిగా.. బాలీవుడ్ మెస్ట్రోగా కీర్తినందుకున్న రవీంద్ర జైన్ (71) ఇక లేరన్న వార్త సనీజగత్తును దిగ్భ్రాంతికి గురిచేసింది. భౌతికంగా లేకున్నా ఆయన అందించిన సంగీతం అజరామరం.