సినీ రచయిత కాశీ విశ్వనాథ్ హఠాన్మరణం

23 Dec, 2015 02:30 IST|Sakshi
సినీ రచయిత కాశీ విశ్వనాథ్ హఠాన్మరణం

* రైల్లో ప్రయాణిస్తుండగా గుండెపోటు
* 1980లో సినీ రంగప్రవేశం.. చిత్రసీమకు నిరుపమాన సేవలు
* రంగస్థల, సినీ రచయితగా, దర్శకుడిగా విఖ్యాతి

ఖమ్మం క్రైం/విశాఖ కల్చరల్: మరో సినీ దిగ్గజం దివికేగింది. అలనాటి నలుపు తెలుపు చిత్రాల నుంచి.. నేటి డిజిటల్ యుగం వరకు తెలుగు చలన చిత్ర రంగానికి నిరుపమాన సేవలందించిన ప్రఖ్యాత రచయిత, నటుడు, రంగస్థల ప్రయోక్త శిలుకోటి కాశీ విశ్వనాథ్ (69) మంగళవారం కన్నుమూశారు. హైదరాబాద్ నుంచి వైజాగ్‌కు రైల్లో వస్తుండగా ఖమ్మం సమీపంలో మంగళవారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో హఠాన్మరణం చెందారు.

ఖమ్మం జీఆర్‌పీ హెడ్‌కానిస్టేబుల్ పుప్పాల శ్రీనివాసరావు కథనం ప్రకారం.. కాశీ విశ్వనాథ్ హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చేందుకు సోమవారం రాత్రి లోకమాన్యతిలక్ ఎక్స్‌ప్రెస్ ఎక్కా రు. ఏసీ బీ-1 కోచ్, బెర్త్ నంబర్ 52లో ప్రయాణిస్తుండగా.. ఖమ్మం సమీపానికి రాగానే ఆయనకు గుండెపోటు వచ్చింది. టీసీ త్యాగరాజన్ బోగీలోకి వచ్చి చూసేసరికి కాశీ విశ్వనాథ్ బెర్త్‌పై నుంచి కిందపడి ఉన్నారు. ఎంత లేపినా లేవకపోవడంతో ఖమ్మం రైల్వే అధికారులకు సమాచారమిచ్చారు.

తెల్లవారుజామున 2 గంటలకు ఖమ్మంలో రైల్వే సిబ్బంది కాశీ విశ్వనాథ్‌ను కిందకు దించారు. 108 సిబ్బంది పరీ క్షించి ఆయన మృతిచెందినట్లు నిర్ధారించారు. జీఆర్‌పీ పోలీసులు ఆయన కుమారుడు శ్రీధర్‌కు సమాచారం అందించారు. 1946లో విశాఖలో శిలుకోటి అప్పలస్వామి, బుచ్చయమ్మ దంపతులకు జన్మించిన కాశీ విశ్వనాథ్.. హైస్కూల్ స్థాయి నుంచే రంగస్థల నటుడిగా, నాటక రచయితగా, దర్శకుడిగా.. యూనివర్సిటీ స్థాయిలో జాతీయ క్రీడాకారుడిగా రాణిం చారు. 1980లో సినీ రంగప్రవేశం చేశారు. హాస్యచిత్ర రచయితగా, సంభాషణకర్తగా బహుముఖ సాహితీ సేవలందించారు.
 
మృతదేహం కుమారుడికి అప్పగింత
తండ్రి మరణవార్త వినగానే విశాఖలో లోకో పైలట్‌గా పనిచేస్తున్న ఆయన కుమారుడు శ్రీధర్ హుటాహుటిన ఖమ్మం చేరుకున్నారు. పంచనామా అనంతరం పోలీసులు మృతదేహాన్ని ఆయన కుమారుడికి అప్పగించారు. తెల్లవారుజామున 1:50 నిమిషాలకు ఫోన్ చేసి ఏదో చెప్పాలని ప్రయత్నించి.. చెప్పలేక పోయారని, హలో.. హలో అంటున్నా.. అటువైపు నుంచి జవాబు రాలేదని శ్రీధర్ రోదిం చారు.

అనంతరం మృతదేహాన్ని వైజాగ్‌లోని స్వగృహానికి తరలించారు. కాశీ విశ్వనాథ్ మరో కుమారుడు కల్యాణ చక్రవర్తి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చెన్నైలో పనిచేస్తుండగా, కూతురు పుష్పలత గృహిణి. విశ్వనాథ్ భార్య మహాలక్ష్మితో కలసి వైజాగ్‌లో ఉంటున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి