నటుడు రతన్‌ చోప్రా మృతి

15 Jun, 2020 00:18 IST|Sakshi
రతన్‌ చోప్రా

సినిమా అంటే గ్లామర్‌ ప్రపంచం. అందుకే ఇక్కడ ఉన్నవారి జీవితం కలర్‌ఫుల్‌గా ఉంటుందని చాలామంది  అనుకుంటారు. అయితే కొందరి నటీనటుల జీవితాలు కనీసం వైద్యానికి నోచుకోని స్థితిలో ముగుస్తున్నాయంటే నమ్మశక్యం కాదు. తాజాగా బాలీవుడ్‌ నటుడు రతన్‌ చోప్రా (70) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారాయన. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రతన్‌ చోప్రా సరైన వైద్యం చేయించుకోలేకపోయారు. శుక్రవారం ఆయన మృతి చెందిన విషయాన్ని ఆయన దత్త పుత్రిక అనిత అధికారికంగా ప్రకటించారు.

మోహన్‌ కుమార్‌ దర్శకత్వంలో 1972లో వచ్చిన ‘మామ్‌ కీ గుడియా‘ చిత్రంలో ప్రధాన పోత్ర పోషించారు రతన్‌ చోప్రా. ఆ తర్వాత పలు బాలీవుడ్‌ సినిమాల్లో నటించారు. పంజాబ్‌ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్‌ పట్టా అందుకున్న రతన్‌ పటియాలాలో పీజీ విద్య అభ్యసించారు. సినిమాలపై ఆసక్తితో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో నటించారు. అయితే తన నానమ్మకు నటనా రంగంపై ఇష్టం లేకపోవడంతో రతన్‌ చోప్రా ఇండస్ట్రీకి దూరమై పలు స్కూళ్లలో టీచర్‌గా పనిచేశారు.

క్యాన్సర్‌ బారిన పడిన ఆయన ఆరోగ్యం విషమించడంతో పంజాబ్‌లోని మాలర్‌కోట్లలో తుదిశ్వాస విడిచారు. ఆర్థిక సమస్యలతో హర్యానాలోని పాంచ్‌కులలో అద్దె ఇంట్లో ఉంటున్న ఆయన భోజనానికీ ఇబ్బందులు పడ్డారట. సమీపంలోని ఆలయాల వారే భోజనం పెట్టేవారని వార్తలు చెబుతున్నాయి. వివాహం చేసుకోని రతన్‌.. అనిత అనే యువతిని కూతురిగా దత్తత తీసుకున్నారు. ఇటీవల బాలీవుడ్‌ నటులు ధర్మేంద్ర, అక్షయ్‌ కుమార్, సోనూ సూద్‌లను రతన్‌ చోప్రా ఆర్థిక సాయం కోరారట. అయితే వారి నుంచి సమాధానం రాలేదని అనిత, రతన్‌ చోప్రా బంధువులు అంటున్నారు. 

మరిన్ని వార్తలు