‘ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయాం’

18 Dec, 2019 09:46 IST|Sakshi

ముంబై: భారత సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటుడు శ్రీరాం లగూ(92) కన్నుమూశారు. వయోభారంతో పుణెలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. కాగా థియేటర్‌ ఆర్టిస్టుగా కెరీర్‌ ప్రారంభించిన శ్రీరాం.. పలు హిందీ, మరాఠీ చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు. ఇరవైకి పైగా మరాఠీ నాటకాలకు దర్శకత్వం వహించి నాటకరంగంలో సేవలు అందించారు. కేవలం నటుడిగానే కాకుండా ఈఎన్‌టీ సర్జన్‌గా, సామాజిక కార్యకర్తగా అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. 

కాగా శ్రీరాం లగూ మరణం పట్ల కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ విచారం వ్యక్తం చేశారు. ‘ గొప్ప నటుడు శ్రీరాం లగూ. మనం ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయాం. విలక్షణ నటనతో థియేటర్‌ ఆర్టిస్టుగా రాణించిన ఆయన.. సిల్వర్‌ స్క్రీన్‌పై తనదైన ముద్ర వేశారు. పలు సామాజిక కార్యక్రమాల్లోనూ భాగమైన శ్రీరాం లగూకు నివాళులు అర్పిస్తున్నా’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇక సినీ పరిశ్రమ సైతం శ్రీరాం లగూ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసింది. సహజ, సమయస్ఫూర్తి గల నటుడిని కోల్పోయాం అని బాలీవుడ్‌ నటుడు రిషి కపూర్‌ ట్వీట్‌ చేశారు.

>
మరిన్ని వార్తలు