ఇవాళ అలంకరణకే హీరోయిన్‌లు!

2 Mar, 2016 01:31 IST|Sakshi
ఇవాళ అలంకరణకే హీరోయిన్‌లు!

కాలం మారింది. ఒకప్పటితో పోలిస్తే... నటీమణుల్ని ఇప్పుడు కేవలం అందానికీ, అలంకరణకీ వాడే సామగ్రిలా చూస్తున్నారే తగిన గౌరవం ఇవ్వడం లేదు. ఈ మాట అందరూ అనుకొనేదే అయినా, గౌరవప్రదమైన నటి ఎవరైనా అంటే? అవును. నటి సుహాసిని నోట ఇప్పుడు ఈ మాటే వచ్చింది. ‘‘1980లలో పరిశ్రమలో నటిగా మంచి స్థానంలో ఉన్నందుకు గర్విస్తున్నా. నన్నడిగితే - ఆ సమయంలో సినిమాల్లో హీరోయిన్లుగా చేసిన నటి రాధిక, నేను, రేవతి, సరిత - ఇలా మేమందరం చాలా అదృష్టవంతులం.
 
 అప్పట్లో మేము చేసినవన్నీ వ్యక్తిత్వమున్న బలమైన పాత్రలు’’ అని నటి - దర్శకురాలు సుహాసినీ మణిరత్నం ఇటీవల ఓ ప్రైవేట్ కార్యక్రమంలో మాట్లాడుతూ అన్నారు. అప్పటికీ, ఇప్పటికీ వచ్చిన మార్పుల గురించి ఆమె వ్యాఖ్యానిస్తూ, ‘‘దురదృష్టవశాత్తూ, ఇవాళ నటీమణుల్ని కేవలం అలంకరణ సామగ్రిలా వాడుతున్నారు. ఈ తరం హీరోయిన్లు అందగత్తెలే కాదు, అపారమైన ప్రతిభావంతులు. వాళ్ళకు ప్రపంచం గురించీ బాగా తెలుసు. కానీ, ఇప్పుడు స్త్రీ ప్రధాన పాత్రలు చాలా తక్కువగా వస్తున్నాయి’’ అని అన్నారు.
 
 ఉత్తరాదితో పోలిస్తే, దక్షిణాదిలో పరిస్థితి మరీ బాగా లేదని సుహాసిని అభిప్రాయపడ్డారు. ‘‘మన కన్నా హిందీ చిత్రపరిశ్రమ కొంత మెరుగ్గా ఉంది. అక్కడ విద్యాబాలన్, కంగనా రనౌత్ లాంటివాళ్ళు బలమైన పాత్రలు పోషిస్తున్నారు. ఉత్తరాది లానే దక్షిణాది సినీపరిశ్రమలో కూడా ఎక్కువ భాగం పురుషాధిత్యమే. అయితే, రానురానూ అక్కడి కన్నా ఇక్కడ పరిస్థితి మరింత దిగజారుతోంది.
 
 ఇప్పుడొస్తున్న అమ్మాయిలు కూడా బలమైన పాత్రలు చేసే కన్నా, సులభమైన మార్గాలు చూసుకుంటున్నారు’’ అని సుహాసిని అన్నారు. ‘‘పురుషాధిపత్యం ఎక్కువగా ఉండే ఈ పరిశ్రమలో కథానాయకుడికిచ్చే పారితోషికానికీ, కథానాయికకు ఇచ్చే డబ్బుకూ మధ్య కూడా చాలా తేడా ఉంది’’ అని ఆమె వాపోయారు. అయితే, 1980ల నాటి నటీనటులందరం ఇటీవల తరచూ కలుస్తూ, అభిప్రాయాలు కలబోసుకోవడం వల్ల చాలామంది పాత రోజుల్ని మళ్ళీ గుర్తు చేసుకోగలుగుతున్నామని ఆమె అన్నారు.
 
 కమల్‌కు తగని సిగ్గు: ఇది ఇలా ఉండగా, బాబాయ్ కమలహాసన్ గురించి ఆమె ఓ ఆసక్తికరమైన అంశం బయటపెట్టారు. వెండితెర మీద చాలామంది హీరోయిన్లతో కలసి రొమాన్స్‌ను పండించే కమల్‌కు నిజానికి, ఆడవాళ్ళంటే తగని సిగ్గు అని సుహాసిని చెప్పారు. ‘‘మా ఇంటికి వచ్చే ఆడవాళ్ళను ఆయన ఎప్పుడూ కళ్ళలో కళ్ళు పెట్టి చూడరు, మాట్లాడరు. వాళ్ళను గౌరవంగా పలకరించి, ఆ వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోతారు’’ అని ఆమె చెప్పారు. మొత్తానికి, ఆడవాళ్ళ పట్ల గౌరవం విషయంలో సుహాసిని ఆవేదన అర్థం చేసుకోవాల్సిందే.